ఫస్ట్ లవ్ పాటలు
‘‘ఫస్ట్ లవ్ అనే పదం అనిర్వచనీయమైనది. నిర్వచనం ఉంటే అది ఫస్ట్ లవ్ కానే కాదు. ఈ చిత్రదర్శకుడు అంబటి గోపి నాకు మంచి స్నేహితుడు. సాహిత్యం మీద తనకు పట్టుంది. అద్భుతమైన పుస్తకాలు రాసాడు. తను తీసిన ఈ సినిమా కవితాత్మకంగా, కళాత్మకంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఎన్. శంకర్.
మహేంద్ర, అమితారావ్ జంటగా అంబటి గోపి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫస్ట్ లవ్’ మరియు బేబి అక్షర సమర్పణలో సన్షైన్ మూవీ ఆర్ట్స్ పతాకంపై సత్యనారాయణ మంగలిపల్లి, నాగరాజు మంగలిపల్లి నిర్మిస్తున్నారు. జీవన్ థామస్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో సీడీని ఎన్. శంకర్ ఆవిష్కరించి, సోనియాకి ఇచ్చారు. ఇంకా ఈ వేడుకలో టి.ప్రసన్నకుమార్, బసిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, మోహన్ వడ్లపట్ల, మధుర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈవీవీగారు దర్శకత్వం వహించిన ‘మావిడాకులు’ చిత్రం ద్వారా రచయితగా నా కెరీర్ ప్రారంభమైంది. ‘లిటిల్ సోల్జర్’ చిత్రానికి సోలోగా మాటలు రాశాను. దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ప్రేమలో కోత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది’’ అన్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించామని, అవుట్పుట్ బాగా వచ్చిందని నిర్మాతల్లో ఒకరైన సత్యనారాయణ చెప్పారు. ఈ చిత్రంలో నటించడంపట్ల మహేంద్ర, అమితారావ్ ఆనందం వ్యక్తం చేశారు. మంచి పాటలివ్వడానికి స్కోప్ ఉన్న కథ అని జీవన్ థామస్ తెలిపారు.