నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే
తిరుపతిక్రైం: తిరుపతిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ గోపీనాథ్‌జట్టి తెలిపారు. గురువారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి నగరంలో సుమారు 4 లక్షల జనాభా ఉందన్నారు. రోజూ లక్ష నుంచి లక్షా 50వేల వరకు యాత్రికులు తరలివస్తున్నారన్నారు. దీంతో ప్రతిరోజు నగరంలో 5 లక్షల మంది ప్రజల తాకిడి ఉందన్నారు. అందువలన ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇకపై ఆటోలు, జీపుల్లో ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్‌తో డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి రెండు ప్రచార రథాలు ప్రారంభించామన్నారు. ఇవి నగరంలోని అన్ని వీధుల్లో తిరిగి ట్రాఫిక్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలనే అంశంపై ప్రచురించిన కరపత్రాలను ఎస్పీ విడుదల చేశారు.
ఈ నెల ఆఖరు నుంచి నగరంపై పోలీసుల డేగ కన్ను ఉంటుందన్నారు. అత్యాధునికమైన ఇన్ఫోటెక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డీఎస్పీ టంగుటూరు సుబ్బన్న, సీఐలు రామకృష్ణ, ముజుబుద్దీన్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.