ఆదిరెడ్డికి చల్లాగా దెబ్బ
ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి చెక్ పెట్టేందుకు గోరంట్ల వ్యూహం
చేరిన పక్షం రోజులకే చల్లా శంకరరావు చేరిక
సాక్షి, రాజమహేంద్రవరం:
వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు ఆ పార్టీలో వీలైనంతగా ప్రాధాన్యం తగ్గించేందుకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీలోని ఆదిరెడ్డి సామాజిక వర్గ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారా?.. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన ఆదిరెడ్డిని ఆదే గ్రూపు రాజకీయాలతో దెబ్బకొట్టాలని ప్రయత్నించారా? అంటే అవునంటున్నారు.. పాలక పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు. పక్షం రోజుల కిందట ఆదిరెడ్డి అప్పారావు తన అనుచరులతో కలసి విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆదిరెడ్డి పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నాకే అతని తోడళ్లుడు, కాంగ్రెస్ పార్టీ నేత, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరావుని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేరేందుకు అనుమతి తీసుకున్నారు. అందులో భాగంగానే గురువారం రాజమహేంద్రవరం వచ్చిన సీఎం చంద్రబాబు సమక్షంలో చల్లా శంకరరావు టీడీపీలో చేరారు. పార్టీలో ఆదిరెడ్డి చేరికను మొదటి నుంచి గోరంట్లతోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, ఆదిరెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాసిరెడ్డి రాంబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తాను టీడీపీలో చేరుతున్నానని ఆదిరెడ్డి ప్రకటించిన వెంటనే పలు దఫాలుగా రోజుల తరబడి గోరంట్ల తన నివాసంలో అనుచరులు, పార్టీ నేతలతో చర్చలు సాగించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకు ఆదిరెడ్డి వియ్యంకుడు కావడంతో ఆయన చేరికను వీరు బహిరంగంగా వ్యతిరేకించలేకపోయారు. మొదట నుంచి ఆదిరెడ్డి గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరని, ఆయన వస్తే టీడీపీలోని తన సామాజిక వర్గ నేతలతో మరో కుంపటి పెడతాడని గోరంట్లతోపాటు పార్టీ నేతలు భావించారు. అందుకే గోరంట్లతో ఎప్పడూ ఉప్పు నిప్పులా ఉండే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ కూడా ఆయన నివాసంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. టీడీపీలో చేరినప్పుడు ఆదిరెడ్డి తన సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. నగరంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ముఖ్యనేతలందరి చిత్రాలు ఉన్నా ఎక్కడా వాసిరెడ్డి చిత్రం పెట్టలేదు. ఇదే సమయంలో చల్లా శంకరరావు మాత్రం వాసిరెడ్డి రాంబాబు చిత్రాన్ని తాను ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఉంచారు. సౌమ్యుడిగా పేరొందిన చల్లాకు తన సామాజిక వర్గం(వెలమ)లో మంచి పట్టుంది. ఆయన్ను టీడీపీలోకి తీసుకురావడం ఆదిరెడ్డికి చెక్ చెప్పవచ్చని ఆదే సమయంలో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.