బంగారు నాణేల పేరుతో మోసం: ముఠా అరెస్టు
గోరంట్ల(అనంతపురం): నకిలీ బంగారు నాణేలను అంటగడుతూ ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు అనంతపురం జిల్లా గోరంట్ల పోలీసులు. కొత్తచెర్వు సీఐ శ్రీధర్ తెలిపిన వివరాలివీ.. ధర్మవరం ప్రాంతానికి చెందిన రామాంజనేయులు, అలివేలమ్మ, హనుమంతరాజు, ఉత్తమ్‌రెడ్డి, నారాయణస్వామి, అంజయ్య అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి గోరంట్ల తదితర ప్రాంతాల్లోని గ్రామాల్లో తిరుగుతూ తమకు బంగారు నాణేలు దొరికాయని, వాటిని చాలా తక్కువ ఖరీదుకే ఇస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. వారి మాటలను నమ్మిన అమాయకులు డబ్బులు, కొందరు బంగారు నగలను ఇచ్చి నాణేలను తీసుకుంటున్నారు.
అయితే, మోసపోయినట్లు గ్రహించిన చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గోరంట్ల ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం ఉదయం టాటా సుమో వాహనంలో ముఠా సభ్యులంతా బెంగళూరు వైపు వెళ్తుండగా గోరంట్ల సమీపంలో అడ్డుకుని, స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి పావు కిలో నకిలీ బంగారు నాణేలు, వృషభ ఆకారంలో ఉన్న పురాతన పాత్రతోపాటు రూ.1.20 లక్షల నగదును, నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. టాటాసుమోను సీజ్ చేశారు.