చిట్ డబ్బులు ఇవ్వలేదని సెల్ టవర్ ఎక్కి..
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గంటపాటు హైడ్రామా
మేనేజర్ హామీతో కథ సుఖాంతం
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : తనకు రావలసిన సొమ్ము చెల్లింపులో ఓ ప్రైవేటు చిట్‌ఫండ్ కంపెనీ వేధిస్తోందంటూ ఒక వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విశాఖజిల్లా నర్సీపట్నానికి చెందిన గొర్లి లక్ష్మీనారాయణ(35) స్టీల్సామగ్రి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలోని శ్రీరామ్ చిట్స్ కంపెనీలో రూ.5లక్షల చీటీ కడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెండు నెలల క్రితం చీటీ పాడుకున్నాడు. కంపెనీ నిబంధనల ప్రకారం ముగ్గురు వ్యక్తుల ష్యూరిటీతో పాటు రూ.లక్ష డిపాజిట్ కూడా చేశాడు.
మరో ష్యూరిటీ కావాలని కంపెనీ ప్రతినిధులు నిబంధన విధించడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో బుధవారం సాయంత్రం వీర్రాజు థియేటర్ సమీపంలోనిబీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో పట్టణ ఎస్ఐ అప్పారావు సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. భార్యాపిల్లలు కిందకు రావాలని వేడుకున్నారు.
శ్రీరామ్ చిట్స్ మేనేజర్ వచ్చి చీటీ మొత్తాన్ని ఇస్తానని హామీ ఇచ్చేవరకు కిందకు దిగనని మొండికేశాడు. గంటపాటు సెల్‌టవర్‌పైనే ఉండిపోయాడు. పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. ఎస్ఐ అప్పారావు శ్రీరామ్‌చిట్స్ మేనేజర్‌కు ఫోన్‌చేసి రప్పించారు. గురువారం చిట్‌సొమ్ము చెల్లిస్తానని పోలీసుల సమక్షంలో మేనేజర్ హామీ ఇవ్వడంతో లక్ష్మీనారాయణ సెల్‌టవర్ నుంచి దిగాడు.