పోలీసుల అదుపులో నయీమ్ అనుచరుడు?
నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు గోసుకొండ శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని పలివెల గ్రామానికి చెందిన శంకర్ మాజీ నక్సలైటు. దళంలో పనిచేసే సమయంలో నయీమ్‌తో అతడికి మంచి సాన్నిహిత్యం ఉండేది. దళం నుంచి జనజీవన స్రవంతిలో కలసిన తర్వాత శంకర్ తిరిగి నయీమ్ గ్యాంగ్‌లో చేరాడు. నయీమ్‌కు చేదోడువాదోడుగా ఉంటూ అతని సెటిల్మెంట్లకు సహకరించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. నయీమ్ మృతి చెందిన నెల రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిన శంకర్ గురించి పోలీసులు పట్టించుకోలేదు.
ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టకపోవడంతో అతడు తిరిగి జనంలోకి వచ్చాడు. యథావిధిగా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ తన స్వగ్రామానికి వస్తూ వెళ్తున్నాడు. వారం రోజుల క్రితం నుంచి మునుగోడు పోలీసులు.. శంకర్‌కు ఫోన్‌చేసి ఒకసారి స్టేషన్‌కు వచ్చి తమకు కావాల్సిన వివరాలు చెప్పాలని కోరినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న శంకర్‌ను చండూరు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.