తాజా మేజర్లకూ పరిహారం
ఆరువేల మందికిపైగా లబ్ధి
ఒక్కొక్కరికి రూ.2లక్షలు చెల్లింపు
జిల్లా పర్యటనలో సీఎం బిజీబిజీ
అధికారులతో సమీక్ష, ఏరియల్ సర్వే
రెండు రోజులు ఉండాలని వచ్చిన సీఎం
ప్రమాదం లేదని తెలిసి తిరుగుపయనం
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మిడ్‌మానేరు, ఎల్లంపల్లి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో గత ప్రభుత్వాలు చాలా జాప్యం చేసినయ్. 2008 వరకు ఉన్న మేజర్లకు మాత్రమే సాయం అందిస్తామన్నయ్. నిర్వాసితులు మాత్రం ఈరోజు వరకు మేజర్లయిన వారందరికీ ఆర్థిక సాయాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. అట్లా చేస్తే మిడ్‌మానేరులో 4,231, ఎల్లంపల్లిలో 1447 మందికి లబ్ధి చేకూరుతుంది. వాళ్లకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు ఇస్తే ప్రభుత్వంపై రూ.114 కోట్లు భారం పడుతుంది. ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి వాళ్లకు చెల్లిస్తాం. గండిపెల్లి, గౌరవెల్లిలోనూ ఈ సమస్య ఉన్నందున వాళ్లకూ ఈ ప్యాకేజీని వర్తింపజేస్తాం – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వర్షాలు, వరదల పరిస్థితిని అంచనా వేసేందుకు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ మిడ్‌మానేరు, ఎల్లంపల్లి భూనిర్వాసితులు చేస్తున్న డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఆయా ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయిన కుటుంబాల్లో తాజాగా మేజర్లయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించారు. తాజా నిర్ణయం వల్ల దాదాపు ఆరువేల మందికిపైగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వీరిలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 1447 మంది, మిడ్‌మానేరు పరిధిలో 4,231 మంది లబ్ధి పొందనున్నారు. ఇందుకుగాను ప్రభుత్వంపై రూ.114 కోట్ల భారం పడనుంది. గౌరవెల్లి, గండిపెల్లి బాధితులకు సైతం ఈ ప్యాకేజీని వర్తింపజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అదనంగా మరో 500 మందికి లాభం చేకూరే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో మేజర్లయిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం చెల్లించనున్నారు. సాధ్యమైనంత తొందర్లో ఈ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
డబుల్ బెడ్ర్రూం ఇవ్వలేం...
మిడ్‌మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ర్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్న హామీని అమలు చేయలేమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గతేడాది జూన్ 18న వేములవాడ పర్యటనకు వచ్చిన కేసీఆర్ మిడ్‌మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. అట్లా చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో కేసీఆర్ తాజాగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ‘ఆరోజు నాకు అవగాహన లేదు. మిడ్‌మానేరు బాధితులకు ప్లాట్లు ఇచ్చారట. రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు కల్పించారట. ఈ విషయాన్ని అధికారులు చెప్పిండ్రు. మళ్లీ వాళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే డూప్లికేషన్ సమస్యతోపాటు ఆడిట్పరంగా ఇబ్బంది వస్తుందన్నారు. అందుకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేకపోతున్నా. మిడ్‌మానేరు బాధితులు పెద్ద మనుసుతో నన్ను క్షమించాలి’ అని కోరారు.
5గంటల పర్యటన..
వరదలు, వర్షాల పరిస్థితిపై అంచనా వేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్ ఆద్యంతం బిజిబిజీగా గడిపారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చేందుకు షెడ్యూల్ ఖరారైనప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన రోడ్డు మార్గం ద్వారా జిల్లాకు వచ్చారు. ఉదయం 11.45 గంటలకు ఎల్ఎండీకి చేరుకున్న సీఎంకు మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఎల్ఎండీ అతిథిగృహంలో ఐదు నిమిషాలు ఆగిన కేసీఆర్ అక్కడినుంచి నేరుగా కలెక్టరేట్‌కు వచ్చారు. అప్పటికే జిల్లాకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే.జోషి, ముఖ్యకార్యదర్శి బీఆర్.మీనా, కలెక్టర్ నీతూప్రసాద్, ఎస్పీ జోయల్‌డేవిస్ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. వారితో కలిసి దాదాపు అరగంటకుపైగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుని మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. అనంతరం కలెక్టరేట్ హెలిప్యాడ్ గ్రౌండ్‌కు చేరుకుని అప్పటికే సిద్ధంగా ఉన్న హెలికాప్టర్లో మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో కలిసి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తిరిగి సాయంత్రం 4గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌కు చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడారు. 4.45 గంటల సమయంలో రోడ్డు మార్గం ద్వారా గజ్వేల్‌లోని వ్యవసాయ క్షేత్రానికి బయల్దేరారు. కేసీఆర్ రెండు రోజులపాటు కరీంనగర్‌లోనే మకాం వేయాలని వచ్చినట్లు తెలిపారు. మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ భవన్‌లోనే బస చేయాలనుకున్నారు. మంగళవారం ఆదిలాబాద్, బుధవారం నిజామాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టులను పరిశీలించడంతోపాటు ఆయా జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని భావించారు. అయితే వరద ఉధృతి తగ్గడంతోపాటు ప్రమాదం కూడా పూర్తిగా తప్పిందని అధికారులు చెప్పడంతో ఏరియల్ సర్వే నిర్వహించి వెళ్లిపోయారు. ‘ఒకట్రెండు రోజులు ఇక్కడే ఉండాలని ప్రిపరై వచ్చిన. కానీ ప్రమాదం తప్పిపోయింది. ఇక ఇబ్బంది లేదని తెలిసి హైదరాబాద్ వెళుతున్నా. అవసరమైతే మళ్లీ వస్తా’ అని వెల్లడించారు.