govenment offices
-
కనికరించరేమయ్యా!
ఈ ఫొటోలోని ఇద్దరూ దివ్యాంగులు. ఒకరు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురానికి చెందిన చెన్నమ్మ కాగా మరొకరు పెళ్లకూరు మండలం శిరసనంబేడుకు చెందిన ఇందిరాకుమారి. ఇద్దరికీ రెండు కాళ్లూ పనిచేయవు. గత కొన్నేళ్లుగా సాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చెన్నమ్మ ట్రై సైకిల్ తుప్పు పట్టిపోయింది. కొత్త సైకిల్ కోసం అధికారులను ప్రాథేయపడుతోంది. ఇందిరాకుమారి రుణం కోసం అర్థిస్తోంది. ఎన్నిసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం కూడా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌డేకు తమ సమస్యలు విన్నవించుకుందామని వచ్చారు. చెన్నమ్మ తుప్పుపట్టిన ట్రైసైకిల్‌పైనే కలెక్టరేట్‌కు వచ్చింది. అది ముందుకు కదలక మొరాయించింది. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఒక్కరూ ఆమెను పట్టించుకోలేదు. అటూ.. ఇటూ తిరుగుతున్న కలెక్టరేట్ సిబ్బందికి ఆమె అవస్థ పట్టలేదు. పక్కనే ఉన్న ఇందిరాకుమారి, చెన్నమ్మ కష్టాన్ని చూసింది. పాకుకుంటూ వెళ్లింది. నీకు నేనున్నానంటూ ట్రైసైకిల్ చక్రాన్ని సరిచేసి సాయం అందించింది. ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకుసాగుతున్న వీరి కష్టాలు మాత్రం అధికారులకు కనిపించడం లేదు. ఎప్పటిలాగే వీరు అధికారులను కలిశారు. వినతిపత్రాలు ఇచ్చారు. మా సమస్య ఎప్పటికి తీరుతుందోనంటూ వారు వెనుదిరిగారు. ఫొటో– వి.సాంబశివరావు, నెల్లూరు (పొగతోట) నెల్లూరు(పొగతోట): సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తమ గోడు అధికారుల ఎదుట వెళ్లబోసుకుంటున్నా ఫలితం ఉండడం లేదని వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసీ కె.వెట్రిసెల్వి, జేసీ–2 కమలకుమారి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్ భార్గవి అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నీటి ప్రవాహాన్ని పెంచండి పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి నెల్లూరు జిల్లాకు నీటిని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానదికి వరద అధికంగా వస్తోందని, ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటిని సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నా జిల్లాలోకురవడం లేదన్నారు.కరువుతో ప్రజలు అలమటిస్తున్నారని, పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి నీటి ప్రవాహాన్ని పెంచి జిల్లాలోని చెరువులను నీటితో నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. న్యాయ విచారణ జరిపించాలి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు రుణాలు మంజూరు చేయడం లేదు. మండలానికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువ చేసే జేసీబీలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్లు పెద్ద పెద్ద భూస్వాములకు అందజేశారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే ఇచ్చారు. గత మూడేళ్ల నుంచి గిరిజనులకు రుణాలు కూడా మంజూరు చేయలేదు. జన్మభూమి కమిటీల దారదత్తంపై న్యాయ విచారణ జరిపించాలి. గ్రామానికి 10 నుంచి 20 మందికి రుణాలు మంజూరు చేయకపోతే ఈ నెల 22 నుంచి జిల్లావ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాం. – ఎస్.మల్లి తదితరులు, దళిత సంఘర్షణ సమితిజిల్లా అధ్యక్షుడు -
సమాచారం ఇవ్వాల్సిందే..
రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ జన్నత్ హుస్సేన్ సాక్షి, విశాఖపట్నం : నిర్ణీత గడువులోగా అడిగిన సమాచారం ఇవ్వకుంటే బాధ్యులపై చర్యలు తప్పవని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ జన్నత్ హుస్సేన్ స్పష్టం చేశారు. ‘స.హ.చట్టం-విజయాలు-తీర్పులు’ అనే అంశంపై శుక్రవారం జెడ్పీ సమావేశం హాలులో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లగలిగితేనే ప్రజాస్వామ్యానికి సార్ధకత చేకూరుతుందన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, కార్యాలయాలు స్వచ్ఛందంగా సమాచారాన్ని వెల్లడిస్తే చట్టం మరింత ఫలవంతంగా వినియోగమవుతుందన్నారు. స.హ.చట్టం జిల్లా నోడల్ అధికారి, డీఆర్ఓ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆర్టీఐ లోగోను వినియోగించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అధికార యంత్రాంగానికి అప్డేట్ సమాచారాన్ని తెలియజేస్తూ వివిధ స్థాయిల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జెడ్పీ సీఈఓ ఎం.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సహకార చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థలు కృషి చేయాలన్నారు. కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఈ చ ట్టాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో హెల్ప్ టు హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ బి.ఎం.నాయుడు, రమేష్, కేవిఎస్ నరసింహం, వివిధ మండలాల సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిలువెత్తు నిర్లక్ష్యం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది విద్యుత్ వినియోగంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ బిల్లుల మోత దెబ్బకు గూబ గుయ్.. మంటున్నా తమకెందుకులే అన్నట్లుగా ఉంటున్నారు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా ఏసీలు, లైట్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నిర్వహించిన ‘న్యూస్‌లైన్’ విజిట్‌లో విద్యుత్ దుర్వినియోగం బట్టబయలైంది. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనే పట్టపగలు లైట్లు వెలుగుతున్నాయి. గదుల్లో ఎవరూ లేకున్నా ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయంటే అక్కడి అధికారులు, సిబ్బందికి ఏ పాటి బాధ్యత ఉందో ఇట్టో అర్థమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏసీలు వాడుకుంటున్నారు. దీంతో విద్యుత్ బిల్లులు సాధారణం కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ రావటంతో విద్యుత్ సంస్థకు బకాయిలు పేరుకుపోయాయి. జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రం, మున్సిపాలిటీల్లో ఏసీల వినియోగం అధికంగానే ఉంది. మండల కేంద్రాల్లో ఏసీలు లేకపోయినా నిర్లక్ష్యంగా ఉండటంతో విద్యుత్ దుర్వినియోగం అధికంగానే ఉంది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు ఏర్పాటు చేసుకోవాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. అలాంటిది అనుమతి లేకుండానే ఏసీలు వినియోగిస్తున్నారు. కంప్యూటర్లు ప్రతి కార్యాలయంలో ఉన్నా వాటి మాటున చాంబర్లకు కూడా ఏసీలు బిగించుకుని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. సాధారణంగా కార్యాలయాల నిర్వహణకు బడ్జెట్ ఎంత అవసరమో ఖర్చులతో కూడిన ప్రణాళికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతారు. వచ్చే నిధుల ఆధారంగా కరెంట్, ఫోన్.. ఇతర బిల్లులు చెల్లించాల్సి ఉంది. బడ్జెట్ ప్రకారం కేటాయింపులు జరిగినా విద్యుత్ బిల్లులు మాత్రం అధికారులు చెల్లించరు. ఎందుకంటే అంచనా కంటే ఎన్నో రేట్లు ఎక్కువ బిల్లు రావటమే ఇందుకు కారణం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు విద్యుత్ సంస్థకు అక్షరాలా రూ 18.97 కోట్లు. మరీ ఇంత బకాయి ఉన్నా ఎందుకు విద్యుత్ కనెక్షన్ తొలగించడంలేదంటే ప్రభుత్వ కార్యాలయాలనే. అదే సామాన్యుడు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ వెంటనే తొలగిస్తారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో కొనసాగుతున్న కార్యాలయాలు మాత్రం విద్యుత్‌ను యథేచ్ఛగా వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకు కేటగిరి-2 కింద విద్యుత్ సరఫరా చేస్తారు. అత్యధిక యూనిట్ రేటు కలిగిన కేటగిరి ఇదీ. పరిశ్రమలకు కూడా ఇంత యూనిట్ ధర ఉండదు. సాధారణంగా నెలకు 100 నుంచి 200 యూనిట్లలోపు వినియోగించుకోవాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు 500 యూనిట్లకు మించి వినియోగిస్తున్నాయి. అంటే 500 యూనిట్లు దాటితే యూనిట్ ధర 9.13లు, ఫిక్స్డ్ చార్జీలు రూ 40 అదనం. అంటే ఒక్కో కార్యాలయం నెలకు విద్యుత్ బిల్లు రూ 4,500 దాటుతుందన్న మాట. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యాలయాలు విద్యుత్ శాఖకు రూ 18.97 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం కట్టినా.. కట్టకపోయినా అధికారులకు ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ లేదు. తీరా అదనపు భారం ఏదో ఒకరోజు సామాన్య మానవుడి మీద పడటం ఖాయం.