ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది విద్యుత్ వినియోగంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ బిల్లుల మోత దెబ్బకు గూబ గుయ్.. మంటున్నా తమకెందుకులే అన్నట్లుగా ఉంటున్నారు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా ఏసీలు, లైట్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నిర్వహించిన ‘న్యూస్‌లైన్’ విజిట్‌లో విద్యుత్ దుర్వినియోగం బట్టబయలైంది. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనే పట్టపగలు లైట్లు వెలుగుతున్నాయి. గదుల్లో ఎవరూ లేకున్నా ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయంటే అక్కడి అధికారులు, సిబ్బందికి ఏ పాటి బాధ్యత ఉందో ఇట్టో అర్థమవుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా ఏసీలు వాడుకుంటున్నారు. దీంతో విద్యుత్ బిల్లులు సాధారణం కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ రావటంతో విద్యుత్ సంస్థకు బకాయిలు పేరుకుపోయాయి. జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రం, మున్సిపాలిటీల్లో ఏసీల వినియోగం అధికంగానే ఉంది. మండల కేంద్రాల్లో ఏసీలు లేకపోయినా నిర్లక్ష్యంగా ఉండటంతో విద్యుత్ దుర్వినియోగం అధికంగానే ఉంది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు ఏర్పాటు చేసుకోవాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. అలాంటిది అనుమతి లేకుండానే ఏసీలు వినియోగిస్తున్నారు. కంప్యూటర్లు ప్రతి కార్యాలయంలో ఉన్నా వాటి మాటున చాంబర్లకు కూడా ఏసీలు బిగించుకుని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. సాధారణంగా కార్యాలయాల నిర్వహణకు బడ్జెట్ ఎంత అవసరమో ఖర్చులతో కూడిన ప్రణాళికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతారు. వచ్చే నిధుల ఆధారంగా కరెంట్, ఫోన్.. ఇతర బిల్లులు చెల్లించాల్సి ఉంది. బడ్జెట్ ప్రకారం కేటాయింపులు జరిగినా విద్యుత్ బిల్లులు మాత్రం అధికారులు చెల్లించరు. ఎందుకంటే అంచనా కంటే ఎన్నో రేట్లు ఎక్కువ బిల్లు రావటమే ఇందుకు కారణం.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు విద్యుత్ సంస్థకు అక్షరాలా రూ 18.97 కోట్లు. మరీ ఇంత బకాయి ఉన్నా ఎందుకు విద్యుత్ కనెక్షన్ తొలగించడంలేదంటే ప్రభుత్వ కార్యాలయాలనే. అదే సామాన్యుడు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ వెంటనే తొలగిస్తారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో కొనసాగుతున్న కార్యాలయాలు మాత్రం విద్యుత్‌ను యథేచ్ఛగా వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకు కేటగిరి-2 కింద విద్యుత్ సరఫరా చేస్తారు. అత్యధిక యూనిట్ రేటు కలిగిన కేటగిరి ఇదీ. పరిశ్రమలకు కూడా ఇంత యూనిట్ ధర ఉండదు.
సాధారణంగా నెలకు 100 నుంచి 200 యూనిట్లలోపు వినియోగించుకోవాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు 500 యూనిట్లకు మించి వినియోగిస్తున్నాయి. అంటే 500 యూనిట్లు దాటితే యూనిట్ ధర 9.13లు, ఫిక్స్‌డ్ చార్జీలు రూ 40 అదనం. అంటే ఒక్కో కార్యాలయం నెలకు విద్యుత్ బిల్లు రూ 4,500 దాటుతుందన్న మాట. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యాలయాలు విద్యుత్ శాఖకు రూ 18.97 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం కట్టినా.. కట్టకపోయినా అధికారులకు ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ లేదు. తీరా అదనపు భారం ఏదో ఒకరోజు సామాన్య మానవుడి మీద పడటం ఖాయం.
నిలువెత్తు నిర్లక్ష్యం
Published Sat, Dec 28 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement