ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారo
ఖాతాలకు ఆధార్ అనుసంధానం
ఆంధ్రాబ్యాంక్ డీజీఎం శేషగిరిరావు
కరీంనగర్ అర్బన్ : దేశవ్యాప్త ఆర్థిక స్వావలంబనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 15న ప్రారంభించిన ప్రచార కార్యక్రమం 45 రోజుల పాటు విస్తృతంగా సాగుతుందని ఆంధ్రాబ్యాంక్ కరీంనగర్ జోన్ డీజీఎం వీఎస్. శేషగిరిరావు తెలిపారు. కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రచారంలో భాగంగా ఖాతాదారుల ఆధార్, మైబైల్ నంబర్‌ను ఖాతాతో అనుసంధించడంతో పాటు బ్యాంకు సేవలను బిజినెస్ కరస్పాండెంట్లు వివరిస్తారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛన్ దారులు వచ్చేనెల 31లోగా, సేవింగ్స్ ఖాతాదారులు వచ్చే ఏడాది మార్చి చివరిలోగా ఆధార్‌తో ఖాతాను అనుసంధానించుకోవాలని కోరారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ బీఏ. చౌదరి, నాబార్డు డీడీఎం రవిబాబు, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం సురేశ్‌బాబు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.