‘ఆ గవర్నర్లు రాజ్యాంగం గొంతు కోశారు’
నెల్లూరు: మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక శాసనసభ స్థానాలు గెలిచినా గవర్నర్లు రాజ్యాంగం గొంతుకోసి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గవర్నర్ల తీరుకు నిరసనగా బుధవారం అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతామని ప్రకటించారు.
రెండు రాష్ట్రాల గవర్నర్లు బీజేపీ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ మణిపూర్, గోవాలో ఎమ్మెల్యేలను సంతలో పశువులుగా కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ను అందుకోలేనంత దూరంలో నిలిచినా, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి అక్రమ మార్గంలో అధికారం చేపట్టేందుకు సిద్ధమైందని ధ్వజమెత్తారు. గవర్నర్ల చర్యపై ప్రతి ఒక్కరూ నిరసన తెలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రఘువీరా కోరారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతిలో మొదటి స్థానం, ఎన్నికల హామీల అమలులో దేశంలో చిట్టచివరి స్థానం సంపాదించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని వెంకయ్య నాయుడు అడిగితే, 15 ఏళ్లు కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు హోదా ముగిసిన అంశమని బుకాయిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశం కాదనీ, అది రాష్ట్ర ప్రజల హక్కని రఘువీరా చెప్పారు. హోదా సాధన కోసం రెండు కోట్ల మందితో బ్యాలెట్ వేయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామన్నారు.