governer quota
-
ఎమ్మెల్సీల తిరస్కరణ పిటిషన్.. జనవరి 24కు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించిన విషయంలో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీల తిరస్కరణపై దాశోజు శ్రవణ్, సత్య నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు.. ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని హైకోర్టుకు తెలియజేశారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టుకు తెలిపారు. పిటిషన్ మెంటేనబిలిటీపై విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. కాగా.. తదుపరి విచారణ జనవరి 24కు హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: మాది చేతల ప్రభుత్వం: మంత్రి దామోదర రాజనర్సింహ -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలో గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16న ముగిసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదిందారు. మధుసూదనాచారిని శాసన మండలికి నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం నుంచి మధుసూదనాచారి పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎమ్మెల్సీ నియామకాలపై రిట్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ బుధవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోరేటి వెంకన్న, సారయ్యా, దయానందల నియామకాలను చాలెంజ్ చేస్తూ ధనగోపాల్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియామకం చేపట్టారని తన పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం ఎమ్మెల్సీ సిఫార్సులను ఆమోదించడంపై ఆయన హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరును రెండుసార్లు గవర్నర్‌కు ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రానున్న నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. -
కళాకారులకు దక్కిన గౌరవం ఇది : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : శానసమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా గోరేటి వెంకన్నకు శుభాకాంక్షలులు తెలిపారు. ‘తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది’ అని ట్వీట్ చేశాడు. అలాగే మరో ట్విట్లో ‘గుర్రం జాషువా, బోయి భీమన్న వంటి సాహితీ దిగ్గజాలు పూర్వం శాసనమండలి సభ్యులుగా సేవలందించారు. పాటకు పట్టం కట్టి, ప్రజాకవి గోరెటి వెంకన్న గారిని సమున్నత పదవితో సత్కరించిన సీఎం కేసీఆర్ గారికి వందనాలు’ అని అన్నారు. (చదవండి : గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం ) కాగా, మండలి గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రజాకవి, వాగ్గేయకారుడు గోటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం ముఖ్య సలహాదారు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినందుకు గోరేటి వెంకన్నకు అరుదైన గౌరవం కల్పించింది. పల్లె కన్నీరు పెడుతోందో.. అని తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి, గాయకుడు గోరటి వెంకన్న. తెలంగాణ భాష, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. (చదవండి : ‘గవర్నర్ కోటా’ ఖరారు) తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది pic.twitter.com/3fZdZH4tQD — KTR (@KTRTRS) November 15, 2020 -
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పాట..
సాక్షి, నాగర్‌కర్నూల్: శానసమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఈయనకు అరుదైన గౌరవం కల్పించింది. పల్లె కన్నీరు పెడుతోందో.. అని తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి, గాయకుడు గోరటి వెంకన్న. తెలంగాణ భాష, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్ ) విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పాటలకు నాంది పలికారు. ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. విదేశాల్లోనూ సత్కారాలు పొందారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారానికి చెందిన గోరటి నర్సింహ, ఈరమ్మ మొదటి సంతానం గోరటి వెంకన్న. ఎంఏ (తెలుగు) విద్యాభ్యాసం చేసిన ఈయన ప్రస్తుతం ఏఆర్ సబ్ డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పలు సినిమాలకు పాటలు రాశారు. ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, కుబుసం సినిమాల్లో రాసిన పాటలను మంచి పేరు వచ్చింది. బతుకమ్మ చిత్రంలో పాటలు రాయడంతో పాటు నటించారు. రాసిన పుస్తకాలు.. ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన అనేక పుస్తకాలు అచ్చయ్యాయి. 1994లో ఏకునాదం మోత, 2002లో రేలపూతలు పుస్తకాలు రాసి 2007లో తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ గేయ కావ్య పురస్కారం అందుకున్నారు. 2010లో అలసేంద్రవంక, 2016లో పూసిన పున్నమి, 2019లో వల్లంకి తాళం, 2019లో ద వేవ్ ఆఫ్ ద క్రెస్సెంట్ వంటి పుస్తకాలను రాసి అవార్డులు అందుకున్నారు. అవార్డులు ఇవే.. 2019లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కబీర్ సమ్మాన్’ జాతీయ అవార్డును అందించింది. 2006లో హంస అవార్డు, 2016లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డు, 2014లో ఉగాది పురస్కారం, 2019లో తెలంగాణ సారస్వత పరిషత్ నుంచి సినారే అవార్డు, లోక్‌నాయక్ అవార్డు, 2018లో తెలంగాణ మీడియా అకాడమి నుంచి అరుణ్‌సాగర్ అవార్డు, 2007లో అధికార భాషా సంఘం పురస్కారం అందుకున్నారు. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేట్.. ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేశారు. ప్రభుత్వ సిఫారసుల మేరకు జకియాఖానం, పండుల రవీంద్రబాబులను ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నామినేట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించారు. ►ఎమ్మెల్సీగా నామినేట్ అయిన పండుల రవీంద్రబాబు స్పందిస్తూ.. ‘2011లో వైఎస్సార్సీపీని స్థాపించిన నాటి నుంచి సీఎం వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టం. నేను జగన్ వీరాభిమానిని. 2014లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాను. మొట్టమొదట సారిగా ఇన్ని రోజులకు వైఎస్ జగన్‌తో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. నా అనుభవం అంతా ఉపయోగించి శాయశక్తులా పార్టీ అభివృద్దికి కృషి చేస్తాను. వైఎస్సార్సీపీ అనగానే దళిత, బలహీన, మైనార్టీల పార్టీ అని ఇవాళ మరోసారి రుజువైంది’ అని రవీంద్రబాబు పేర్కొన్నారు. ►జకియా ఖానం స్పందిస్తూ.. ‘యావత్ మైనార్టీల తరపున సీఎం జగన్‌కు ధన్యవాదాలు. మమ్మల్ని నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఆమోదించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటూ పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషిచేస్తాను' అని జకియా ఖానం తెలిపారు. -
గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నామినేట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేసింది. బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాసులు, టీడీ జనార్ధన్ లు ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యారు. అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కసరత్తు కోసం మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో సీఎం జోక్యం చేసుకుని రేపు విశాఖ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడుతో భేటీ కావాలని గంటా, అయ్యన్నలకు సూచించారు.