
సాక్షి, అమరావతి: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేశారు. ప్రభుత్వ సిఫారసుల మేరకు జకియాఖానం, పండుల రవీంద్రబాబులను ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నామినేట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించారు.
►ఎమ్మెల్సీగా నామినేట్ అయిన పండుల రవీంద్రబాబు స్పందిస్తూ.. ‘2011లో వైఎస్సార్‌సీపీని స్థాపించిన నాటి నుంచి సీఎం వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టం. నేను జగన్ వీరాభిమానిని. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాను. మొట్టమొదట సారిగా ఇన్ని రోజులకు వైఎస్ జగన్‌తో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. నా అనుభవం అంతా ఉపయోగించి శాయశక్తులా పార్టీ అభివృద్దికి కృషి చేస్తాను. వైఎస్సార్‌సీపీ అనగానే దళిత, బలహీన, మైనార్టీల పార్టీ అని ఇవాళ మరోసారి రుజువైంది’ అని రవీంద్రబాబు పేర్కొన్నారు.
►జకియా ఖానం స్పందిస్తూ.. ‘యావత్ మైనార్టీల తరపున సీఎం జగన్‌కు ధన్యవాదాలు. మమ్మల్ని నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఆమోదించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటూ పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషిచేస్తాను' అని జకియా ఖానం తెలిపారు.