ప్రజల సొమ్ముతో సీఎం సోకులు!
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజల డబ్బుతో తనకు ఎలాంటి ఖర్చు లేకుండా సీఎం హంగులతో ప్రచారం చేసుకుంటున్నారని.. ఇందుకు నర్మదా సేవా యాత్రను ఉదహరిస్తూ కాంగ్రెస్ నేత సందీప్ సబ్లోక్ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నేతల ఫొటోలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆప్ నేత ధర్మేంద్ర జైన్ మాట్లాడుతూ.. ప్రజల డబ్బు ఈ స్థాయిలో వృథాగా ఖర్చు చేస్తారని ఊహించలేదన్నారు. కొత్త చర్యలతో నిధులు వృథా చేయకుండా, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం డబ్బు వినియోగించాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో పాటు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల కిందట నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గత జనవరిలో ఇదే తరహాలో ప్రభుత్వ పరిపాలనా విభాగం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ ఫొటోలతో పాటుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫొటోలను ఆఫీసులలో ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఎంపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని సూచించింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అన్ని ప్రకటనలలో సీఎం ఫొటోలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం శివరాజ్‌తో పాటు ప్రధాని మోదీ, మహ్మాత్మా గాంధీ, మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇతర ప్రముఖుల చిత్రపటాలను అన్ని ప్రభుత్వ ఆఫీసులు, కార్పొరేషన్, డివిజన్ కార్యాలయాలలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.