పాలించడమెలాగోచూపిస్తా
లండన్: ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో సతమతమవుతున్న బ్రిటన్కు స్థిరత్వం, ప్రజలకు విశ్వాసం కలిగించడమే తమ ప్రభుత్వ అజెండాలో ప్రధానాంశమని నూతన ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేసిన ఆర్థిక తప్పిదాలను సరిచేసేందుకే కన్జర్వేటివ్ ఎంపీలు తనను సారథిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘మార్పు కోసం ట్రస్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. ఆమె ఉద్దేశాలు మంచివే. కాకపోతే తీసుకున్న నిర్ణయాల్లో, వాటి అమల్లోనే తప్పిదాలు దొర్లాయి’’ అన్నారు.
మంగళవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి జాతినుద్దేశించి ఆయన తొలి ప్రసంగం చేశారు. దేశం చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ‘‘తొలుత కరోనా, తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన పాలిట పెను సమస్యలుగా మారాయి. పరిస్థితిని దీటుగా ఎదుర్కొంటాం. కరోనా, దానివల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలను ఆర్థిక మంత్రిగా ఎంత సమర్థంగా నిభాయించుకొచ్చానో అందరికీ తెలుసు. ప్రజలను, వ్యాపార వాణిజ్యాలను పరిరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నా. అదే స్ఫూర్తితో ఇప్పుడూ సమస్యలను అధిగమిస్తాం.
సమస్యను చూసి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పూర్తి జవాబుదారీతనం, సమగ్రత, పక్కా ప్రొఫెషనలిజంతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూపిస్తా. మాటలతో కాకుండా చేతల్లో దేశాన్ని ఐక్యం చేసి చూపిస్తా’’ అని చెప్పారు. ‘‘మనం చెల్లించలేనంత భారీ అప్పులను ముందు తరాలపై రుద్దే ప్రసక్తే లేదు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తా’’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో పౌరుల సంక్షేమం పట్ల సహానుభూతితో వ్యవహరిస్తామన్నారు. ‘‘మేం పూర్తి స్పష్టతతో రంగంలోకి దిగాం. ఈ క్షణం నుంచే మా పని మొదలైంది. దేశ సంక్షేమం కోసం అహోరాత్రాలూ కష్టపడతాను’’ అని ప్రకటించారు.
‘‘మనమంతా కలిసి పని చేస్తే అద్భుతాలు చేసి చూపించొచ్చు’’ అంటూ ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే తన పాలన ఉంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఆ క్రమంలో తాను పలు కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలపై రిషి విమర్శలు ఎక్కుపెట్టారు. భార్య అక్షత, కుమార్తెలు కృష్ణ, అనౌష్కలతో కలిసి మాట్లాడతారని అంతా భావించగా రిషి ఒంటరిగానే దాదాపు 6 నిమిషాల పాటు మాట్లాడారు. బ్రిటన్ చరిత్రలో ఓ కొత్త ప్రధాని చేసిన అతి సుదీర్ఘ తొలి ప్రసంగాల్లో ఇదొకటని చెబుతున్నారు. బోరిస్ జాన్సన్ మాత్రం 2019లో బాధ్యతలు చేపట్టాక ఏకంగా 11 నిమిషాల 13 సెకన్లు మాట్లాడారు! తాజా మాజీ ప్రధాని ట్రస్ తన తొలి ప్రసంగాన్ని 4 నిమిషాల్లో ముగించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్