టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు వాయిదా
మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 2 నుంచి 5 వరకు జరగాల్సిన పరీక్షలను మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించేలా రివైజ్డ్ టైమ్‌టేబుల్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్‌కు సంబంధించిన 8 పేపర్ల పరీక్షలు 31 నుంచి 3 వరకు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం ఉంటాయని పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు మరో పరీక్ష ఉంటుందని తెలిపారు. డ్రాయింగ్ హయ్యర్ పరీక్షలు కూడా ఆయా తేదీల్లో నిర్ణీత సమయాల్లో ఉంటాయని వివరించారు. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ పరీక్షలు 31న ఉదయం, మధ్యాహ్నం ఉంటాయని, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు 1, 2 తేదీల్లో ఉంటాయని తెలిపారు. హాల్‌టికెట్లను bse. telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు.