అయ్యో ‘బంగారు తల్లీ’
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: మేలిమి బంగారు తల్లుల్లారా..కలువ కన్నుల కన్నెల్లారా..రేపటికి దీపాలయ్యే పాపల్లారా..మీరు చదువుకోవాలి. మీరు చదువుకుంటే మీ ఇల్లు బాగుపడుతుంది. మీకు చదువులేక పోతే మీ కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధిలో వెనుకపడుతుంది. స్త్రీకి చదువులేని పరిస్థితి రాకూడదనే భావించిన దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ‘బాలికా సంరక్షణ’ పేరుతో మహత్తర పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకంలో భాగంగా ఆడపిల్ల పుట్టగానే కొంత నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని యోచించారు. బాలిక పెరిగి పెద్దయ్యాక ఆమెకు నగదు చేరాలంటే తప్పనిసరిగా చదువుకోవాలనే నిబంధన విధించారు. ఆయన హయాంలో ఈ పథకం వల్ల ఎంతో మంది లబ్ధిపొందారు. ఇంతవరకూ బాగానే ఉన్నా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఆ పథకం పేరును ఆర్భాటాల మధ్య ‘బంగారుతల్లి- మా ఇంటి మహాలక్ష్మి’గా మా ర్చేశారు.
అయితే ఈ పథకం ఇప్పుడు ప్రాథమిక దశలోనే కునికిపాట్లు పడుతోంది. ఆడపిల్ల పుట్టగానే తల్లి ఖాతాలో పడాల్సిన సొమ్ము లబ్ధిదారులకు ఇప్పటికీ అందలేదు. ఎక్కడో అరకొరగా... ఆదీ ఈ వారంలోనే జమ అయినట్లు తెలిసింది. పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులకు, పాపం తీరిక లేకుండా పోవడంతో పథకం అమలు గతుకుల రోడ్డుపై బండి నడకలా తయారైంది.
ప్రస్తుతం పథకం ఎలా ఉందంటే...
2013 మే 1 తర్వాత పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఈ పథకం వర్తింపచేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ వరకు 2,243 మంది ఆడపిల్లలు జన్మించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ జననాల్లో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో 400 మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలుగానే దరఖాస్తులు వచ్చాయి. వారి వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసే ప్రక్రియ ఇప్పటికీ నవీకరణ కాలేదు. పథకం కింద వచ్చిన ప్రతి ఆడపిల్లకూ ముందుగా రూ.2,500 జమచేయాలి. అయితే పథకం ప్రారంభించి ఐదునెలలు కావస్తున్నా ఇప్పటికి పైసా కూడా జమకాలేదు. గతంలోని బాలికా సంర క్షణ పథకాన్ని ఐసీడీఎస్ పరిధిలో చేర్చగా ప్రస్తుతం బంగారు తల్లి పథకం నిర్వహణ బాధ్యతను ఐకేపీకి అప్పగించారు.
అర్హులు...నిబంధనలు..
ఈ పథకంలో చేరేవారు తెల్లరేషన్ కార్డుదారులై ఉండాలి. కుటుంబంలోని ఇద్దరు బాలికల వరకు ఈ పథకం వర్తిస్తుంది. మొదటి, రెండో కాన్పులో కూడా ఆడపిల్ల జన్మించినా...లేక ఇద్దరూ కవలలుగా పుట్టినా పథకానికి అర్హులే. అయితే కాన్పును ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యశాలల్లోనే చేయించాలి. బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తల్లితో సంయుక్తంగా బాలిక పేరున బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, తల్లీబిడ్డల సంయుక్త ఫొటోను అధికారులకు అందించాలి. ఈ వివరాలను ఆన్లైన్లోని బంగారు తల్లి పథకం వెబ్సైట్లో నమోదు చేస్తారు. మూడేళ్లపాటు అంగన్వాడీ కేంద్రంలో కచ్చితంగా టీకాలు వేయించి...ఐదేళ్లు వచ్చేవరకూ కేంద్రానికి పంపాలి. బిడ్డకు ఏడేళ్ల వయసు నిండగానే తల్లీబిడ్డల పేర్లపై సంయుక్త బ్యాంక్ ఖాతా తెరవాలి.
పథక ప్రయోజనం
పథకం కింద పేరు రిజిస్టర్ కాగానే తల్లీబిడ్డల పేరుపై ఉండే బ్యాంకు ఖాతాలో రూ.2,500 జమ అవుతాయి. ఏడాది దాటిన వెంటనే రూ.1,000, రెండేళ్లు పూర్తికాగానే మరో రూ.1,000 మూడు నుంచి పదేళ్లలోపు ఏడాదికి రూ.1,500 చొప్పున మొత్తం రూ.4,500 బ్యాంకులో వేస్తారు. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి పూర్తయ్యే లోపు ఏడాదికి రూ.2 వేల చొప్పున రూ.10 వేలు ఇస్తారు. ఆరు నుంచి 8వ తరగతి వరకు ఏడాదికి రూ. 2,500 చొప్పున మూడేళ్లకు రూ.7,500, తొమ్మిది, పది తరగతుల్లో ఏడాదికి రూ.3 వేలు చొప్పున ఆరువేలు జమ చేస్తారు. ఇంటర్ రెండేళ్లకు రూ.7వేలు, ఏదైనా డిగ్రీ నాలుగేళ్ల పాటు చదివితే ఏడాదికి రూ. 4 వేలు చొప్పున రూ.16 వేలు ఇస్తారు. లబ్ధిదారురాలికి 21 సంవత్సరాలు నిండగా నే బ్యాంకు ఖాతాలో జమ అయి న రూ.55,500కు అదనంగా లక్ష రూపాయలు ఇస్తారు. ఇంట ర్ వరకు మాత్ర మే చదివితే 21 సంవత్సరాలకు రూ.50 వేలు మాత్రమే అందుతాయి.