ఫారెస్ట్ వర్సెస్ టీటీడీ
సాక్షి, తిరుమల: తెరవెనుక కారణాలు ఏవైనా పాపవినాశం తీర్థ స్థల వివాదం మళ్లీ తెరపైకి వచ్చిం ది. రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని ఆ స్థలం తమదంటే తమదేనని ఫారెస్ట్, టీటీడీ పట్టుబడుతున్నాయి. ఈ రెండు విభాగాల మధ్య దుకాణదారులు నలిగిపోతున్నారు. శ్రీవారి దర్శన టికెట్లే కొత్త వివాదానికి కారణమని చర్చ జోరుగుతోంది.
టీటీడీ దివ్యక్షేత్రం పరిధిలో ఏడు కొండలు, పది తీర్థాలు
టీటీడీ రెవెన్యూ అధికారులు చెబుతున్న రికార్డుల ప్రకారం శేషాచలంలోని ఏడుకొండలు, పది తీర్థాలు దేవస్థానం పరిధిలోకి వస్తాయి. తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి ఇస్తూ ప్రభుత్వ జీవో ఎంఎస్ 659, 1941 జూన్ 16 ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఉంది. దీనికి అనుబంధంగా ప్రభుత్వ జీవో 338, పం చాయతీ (రెవెన్యూ) 2005 సెప్టెంబర్ 16 ఆ తర్వాత జీవో ఎంఎస్ నం:746, రెవెన్యూ (ఎం డోమెంట్స్3) 2007 జూన్ 2 ప్రకారం ‘తిరుమల దివ్యక్షేత్రం’గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చే సింది.
దీని ప్రకా రం తిరుమల ఆలయం, ఏడుకొండలు, పది తీర్థాలు ఈ గెజిట్‌లో చేర్చారు. ఆయా తీర్థాల చు ట్టూ 200 మీటర్ల స్థలం కూడా టీటీడీ అటవీ పరిధిలోకి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ భూముల పరిధిలో సర్వహక్కులూ శ్రీవారి పే రుతో ఉన్న దేవస్థానానికే చెందుతాయని టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి స్పష్టం చేస్తున్నారు.
రిజర్వు ఫారెస్ట్ తమదేనంటున్న ఫారెస్ట్ విభాగం
శ్రీ వేంకటేశ్వర అభయారణ్యం పరిధిలోకి వచ్చే రిజర్వు ఫారెస్ట్ ప్రాంతమంతా తమదేనని ఫారెస్ట్ విభాగం చెబుతోంది. దీనిపై టీటీడీకి ఎలాంటి హక్కూలేదని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2008లో ఆకాశగంగ తీర్థం తర్వాత రిజర్వు ఫారెస్ట్ పరిధిలో చెక్‌పోస్టు కూడా ఏర్పాటు చేశామని గుర్తుచేస్తున్నారు. తమ పరిధిలోకి వచ్చే తీర్థాల్లో ఉన్న దుకాణాలు ఖాళీ చేయాల్సిందేనని వారు చెబుతున్నారు.
నలుగుతున్న దుకాణదారులు
టీటీడీ, ఫారెస్ట్ విభాగాలు ప్రతిష్టలకు పోవడంతో వారి మధ్య దుకాణదారులు నలిగిపోతున్నారు. 1983లో పాపవినాశనం డ్యాం నిర్మా ణం కాకముందే పాత పాపవినాశనంలో దుకాణాలు ఉన్నాయని, 1967 నుంచే తాము టీటీడీకి అద్దెలు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. 1983 లో డ్యాము నిర్మాణం పూర్తయిన తర్వాత పాత పాపవినాశం మూసివేయడంతో అక్కడు న్న దుకాణాలను కూడా కొత్త పాపవినాశనానికి మారుస్తూ టీటీడీ అధికారులు ఉత్తర్వులు ఇ చ్చారు.
ఆ తర్వాత షికారీలకు గిరిజన కోటా కింద హాకర్ లెసైన్సులు, దుకాణాలు కేటాయిం చారు. మూడో విడతగా తిరుమలలోని సన్నిధి వీధి విస్తరణ పనుల్లో ఇళ్లు, లెసైన్సు దుకాణాలు కోల్పోయినవారికి పాపవినాశం తీర్థంలో మొ త్తం 78 దుకాణాలు కేటాయించారు. తాజాగా దుకాణాలు ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారు లు హెచ్చరించడంతో వారు శనివారం టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి, డీఆర్వో రాజేంద్రకుమార్‌కు విన్నవించి, తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు.
వివాదానికి దర్శన టి కెట్లే కారణమా?
శ్రీవారి దర్శన టికెట్లే స్థల వివాదానికి కారణమ ని చర్చ జోరుగా సాగుతోంది. ఫారెస్ట్ విభాగానికి అవసరమైన శ్రీవారి దర్శన టికెట్లు ఇవ్వలేదనే వాదనా ఉంది. టీటీడీ అధికారులు తమ ఉన్నతాధికారులకు దర్శన సమయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫారెస్ట్ అధికారులు ఆవేదన చెందుతున్నారు. స్థల వివాదాన్ని తెరపైకి తీసుకొస్తే టీటీడీ ఉన్నతాధికారులు దారికొస్తారనే ఉద్దేశంతోనే పాత వివాదానికి మళ్లీ ప్రా ణం పోసినట్టు అటు టీటీడీ, ఇటు ఫారెస్ట్ విభాగాల్లో చర్చ సాగుతుండడం కొసమెరుపు.