చావనైనా చస్తాం.. పోర్టుకు భూములివ్వం
- భావనపాడులో బాధితుల సమావేశం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 8 పంచాయతీల పరిధిలో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పోర్టు నిర్మాణ వ్యతిరేక ఉద్యమ కమిటీ పోరాటాలకు సిద్ధమైంది. చావనైనా చస్తాం గానీ పోర్టు నిర్మాణానికి భూములిచ్చేది లేదని ఆయా గ్రామాల ప్రజలు తెగేసి చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు భూదాహానికి అడ్డుకట్ట వేస్తామని, స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రాంతాల్లో పేదల కడుపుకొట్టి భూములు లాక్కుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. శనివారం వైఎస్సార్సీపీ బాధితులకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించడం ఉద్యమానికి మరింత బలం చేకూరినట్టయింది.
గ్రామాల్లోకి వచ్చారో ఖబడ్దార్: ఇకపై అధికారులు, నాయకులు గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టాలని ఉద్యమ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు శనివారం భావనపాడులో గ్రామస్తులంతా సమావేశమయ్యారు. సోమవారం నుంచి ఇంటింటి నుంచి దరఖాస్తులు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ సహా, ఆర్డీవో, ఎమ్మార్వోలకు విజ్ఞాపనలివ్వాలని తీర్మానించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులు హాజరై మద్దతు ప్రకటించడంతో గ్రామస్తుల్లో మరింత బలం చేకూరింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ హైపవర్కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ... విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఇక్కడకు వచ్చి మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడతారని హామీ ఇచ్చారు. పార్టీ బీసీసెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మత్స్యకారుల్ని ఆదుకున్నది వైఎస్సేననీ, ప్రస్తుత పోరాటాలకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతుంటుందని హామీ ఇచ్చారు.