అయ్యయ్యో..!
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్) ఆవరణలోని ప్రభుత్వ నర్సింగ్ పాఠశాల విద్యార్థినులు తినే ఆహారం కలుషితం కావటంతో పది మంది డయేరియా బారిన పడ్డారు. జీఎన్ఎం ప్రథమ సంవత్సరం చదువుతున్న ముగ్గురు, ద్వితీయ సంవత్సరం చదువుతున్న మరో ఏడుగురు విద్యార్థినులు మూడు రోజులుగా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. రెండురోజులుగా వసతి గృహంలో సొంత వైద్యం చేసుకుంటున్నా తగ్గకపోవటంతో మంగళవారం జీజీహెచ్లో చేరి చికిత్స పొందుతున్నారు. మరో వైపు వారం రోజులుగా 15 మందికి పైగా విద్యార్థినులు చికెన్పాక్స్తో (అమ్మవారు) బాధపడుతున్నారు. దీంతోపాటు పలువురు జ్వరాల బారిన పడ్డారు. అధిక శాతం మంది రోగాలకు గురయినా హాస్టల్లో తనిఖీలు చేసి భోజనం, మంచినీటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించకుండా సంబంధిత అధికారులు తాత్సారం చేయటం విమర్శలకు తావిస్తోంది.
దాదాపు 200 మంది వరకు ఉండే ఈ వసతి గృహంలో రోగాల బారిన పడిన వారిలో ఇప్పటికే కొందరు సెలవుపెట్టి ఇళ్లకు వెళ్లిపోగా మరి కొంత మంది వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వంటకు నాసిరకం పదార్థాలు వినియోగిస్తున్నారని, ఉదయం వేళ ుగిలిన పదార్థాలను రాత్రికి, రాత్రి మిగిలిన పదార్థాలను ఉదయం భోజనంలో కలిపి వండుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచి నీరు కూడా సక్రమంగా రావటం లేదని, బయట నుంచి బక్కెట్లుతో తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందని విద్యార్థినులు వాపోతున్నారు.
విద్యార్థినులతో అత్యవసర సమావేశం...
అధిక సంఖ్యలో అస్వస్థతకు గురికావడంతో మంగళవారం సాయంత్రం పాఠశాల నర్సింగ్ పాఠశాల ప్రిన్సిపాల్ విన్నకోట సరోజిని విద్యార్థినులతో అత్యవసర సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు, ఆర్ఎంఓ డాక్టర్ అనంత శ్రీనివాసులు చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి మెరుగైన వైద్యసేవలు అందించాలని సంబంధిత వైద్యులను ఆదేశించారు.