Government primary health centers
-
నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని!
సాక్షి, పాలకొల్లు సెంట్రల్ : సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. మన ఊరు నాకు ఏమిచేసిందనే కన్నా ఊరికి నేను ఏమిచేశాననే ఆలోచన పుట్టినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఉదయాన్నే లేచినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఉండే మనం ఎక్కడైనా అవినీతి జరిగినట్టు కనపడితే ఒక లైక్ కొట్టడమో, షేర్ చేయడమో చేసి మన బాధ్యత అయిపోయిందని చేతులుదులుపుకుంటున్నాం. నాయకులు మన ఊరికి చేయనివన్నీ చేసేశామని చెబుతున్నా ఏమి చేశారని ప్రశ్నించలేకపోతున్నాం. అలా ప్రశ్నించగలిగిన చైతన్యం మనందరిలో వచ్చనప్పుడే నాయకుల్లో సైతం బాధ్యత, భయం ఏర్పడతాయి. మన సమస్యలపై దృష్టి పెడదాం ఎక్కడెక్కడి సమస్యలనో పట్టించుకునే యవత స్థానిక సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి. నేను, నా కుటుంబం.. అనే భావనతో పాటే నాఊరు, నా పట్టణం, నా సమాజం అనే భావనతో ముందుకు సాగాలి. ఐదేళ్ల ముందు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన నాయకులు మళ్లీ ఓట్లడగడానికి వస్తే నెరవేర్చని హామీల గురించి ధైర్యంగా ప్రశ్నించే స్థాయికి ఎదగాలి. అధికారపార్టీ ఖర్చుచేస్తోంది ఎవరి సొమ్మో కాదని.. అని మనందరి డబ్బేనని ప్రజలంతా గుర్తెరగాలి. వీటిపై ఎప్పుడైనా ప్రశ్నించారా..? నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి తానే చేశానని ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మల చెబుతున్నారు. ప్రతీ సమావేశంలో ఎమ్మెల్యే రాష్ట్రం రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్లో ఉందని ఊదరగొడుతుంటారు. అంత లోటు బడ్జెట్‌ఉంటే అభివృద్ది చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఎవరైనా ప్రశ్నించారా..? మూణ్నాళ్ల ముచ్చటగా సీసీరోడ్లు నియోజకవర్గంలో రోడ్లు, డ్రెయిన్లు వేశామని చెబుతున్నారు. 30 ఏళ్లు పాటు ఉండాల్సిన సీసీ రోడ్లు వేసిన మూడు నెలలకే పాడైపోతున్నాయంటే అందులో ఎంత అవినీతి జరిగి ఉంటుంది. దానిపై ఎప్పుడైనా ప్రశ్నించారా..? ఎక్కడ 100 పడకల ఆస్పత్రి..? 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామం వచ్చిన సందర్భంలో పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన విషయం ఎంతమందికి గుర్తుంది. ఇంతవరకూ ఎందుకు అభివృద్ధి చేయలేదు. దాని గురించి ప్రశ్నించే పౌరుడు ఎవరైనా ఉన్నారా..? శంభుని పార్కులో రూ.70 లక్షల అవినీతి శంభుని చెరువు, రామగుండం పార్కులు సరే.... మరి పాత పార్కుల దుస్థితి ఏమిటని ప్రశ్నించారా..? శంభుని చెరువులో జరిగిన సుమారు రూ.70 లక్షల అవినీతి గురించి తెలుసా. ఇన్ని కోట్లు ఖర్చు చేసినా శంభుని చెరువులో చెరువుకు తూర్పు భాగంలో ఊబి ఉంది. ఆ ఊబి మట్టిని ఎందుకు తొలగించలేదని అడిగారా..? అన్నీ మాయమాటలే డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేస్తానన్నారు. గెలిచిన తరువాత డ్వాక్రా మహిళకు రూ. 10 వేలే చేస్తానన్నారు. అది కూడా నాలుగు విడతలుగా ఐదేళ్లకు అంతంత మాత్రంగానే సరిపెట్టడం తెలిసిందే. నిరుద్యోగ యువతకు రూ. 2 వేలు భృతి కల్పిస్తానన్నారు. నాలుగున్నర సంవత్సరాలు తరువాత వెయ్యి రూపాయలు చేశారు. ఎన్నికలు సమీపించడంతో ఒక నెల నుంచి రెండు వేలు ప్రకటించారు. ఈకప్పదాటు ధోరణిపై ప్రశ్నించారా..? హోదాపై యూటర్న్ ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తామని చెప్పి దానిని రూ. 35 వేలకు కుదించారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నాలుగేళ్లు క్రితం వరకూ ప్రత్యేక హోదాపై ఎన్ని మాటలు మార్చారో ఆరు మాసాల నుంచి యూటర్న్ తీసుకుని హోదా గురించి ఇప్పుడు చేస్తున్న రాద్ధాంతం ఏపాటిదో అందరికీ తెలిసిందే.. దీనిపై ప్రశ్నించారా..? కాంగ్రెస్‌తో పొత్తా..? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్‌ను నాడు దూషించి నేడు పొత్తు పెట్టుకుని ప్రజల మనోభావాలను ఢిల్లీలో ఎలా తాకట్టు పెడతారని ఎప్పుడైనా ప్రశ్నించారా..? గర్భిణులనూ ఇబ్బంది పెట్టారు డ్వాక్రా మహిళలను, అంగన్వాడీ మహిళలను టీడీపీ ఏర్పాటుచేసిన ప్రతీ సమావేశానికి తరలించేవారు. సమావేశాలకు గర్భిణీలను కూడా తీసుకువచ్చిన దారుణ సంఘటనలు పాలకొల్లులో జరిగిన విషయంపై స్పందించారా..? -
ప్రసవం ఖరీదు రూ.1000
* డబ్బులిస్తేనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి * ఇదీ బీర్కూర్ పీహెచ్సీ తీరు కోటగిరి: పేదలకు వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే సిబ్బంది నిర్లక్ష్యం పేద రోగుల పాలిట శాపంగా మారింది. డబ్బులిస్తేనే సేవ చేస్తామన్నట్లుగా వారు వ్యవహరిస్తున్న తీరుపట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బీర్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ గర్బిణి ప్రసవం కోసం వస్తే ఆమె నుంచి డబ్బులు లాక్కున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీర్కూర్‌కు చెందిన లక్ష్మి పురిటినొప్పులతో ఈ పీహెచ్‌సీకి వచ్చింది. గత సోమవారం రాత్రి బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఇంటికి వెళ్లేందుకు డిశ్చార్జి చేయాలని ఆసుపత్రి సిబ్బందిని కోరగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆయా రూ. 1000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో లక్ష్మి కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. ప్రభుత్వాసుపత్రిలో డబ్బులు అడుగడం ఏమిటని వారు ప్రశ్నించారు. తమకు డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆయూ చెప్పడంతో చేసేదేమి లేక ఆమె అడిగినంత ముట్టజెప్పారు. ఈ విషయం బంధువులకు తెలియజేయడంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వైద్యాధికారిని వివరణ కోరగా ఆయా అడగడంతో లక్ష్మి కుటుంబసభ్యులు రూ.1000 ఇచ్చినట్లు ఫిర్యాదు అందిందని, విచారణ చేపట్టి చర్య తీసుకుంటామని చెప్పారు. -
‘ఛీ’హెచ్‌సీలు వైద్యం పూజ్యం
సాక్షి, చిత్తూరు: పేదలకు వైద్యసేవలు అందించాల్సిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అధ్వాన్నంగా ఉన్నారు. అన్ని జబ్బులకు ఒకే మందు అన్నట్లు రెండు మూడు రకాల మాత్రలు ఇచ్చి పంపడం మినహా మరెలాంటి వైద్యసేవలు అందడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో ఏఎన్ఎంలే వైద్యం చేస్తున్నారు. మంచాలు కూడా లేక రోగులకు ఆరుబయట ప్రదేశాల్లోనే సెలైన్ ఎక్కించే పరిస్థితి నెలకొంది. వందలాది పీహెచ్‌సీలకు సొంత భవనాలు లేవు. సబ్ సెంటర్లు శిథిలావస్థకు చేరాయి. ఏఎన్ఎంలు లేకపోవడంతో సబ్‌సెంటర్లు మూతపడుతున్నారుు. జిల్లాలో 94 పీహెచ్‌సీలు,644 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వైద్యులతో పాటు సిబ్బంది పోస్టులు 2302 ఉండగా, 1718 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 584 ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు పీహెచ్‌సీలు, ఒక కమ్యూనిటి హెల్త్ సెంటర్ ఉన్నారు. ఆరు డాక్టర్, 11 ఏఎన్ఎం, రెండు స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నారుు. తంబళ్లపల్లెలో ఎక్స్‌రే యూనిట్ ఆరేళ్లుగా మూతపడి ఉంది. మూడునెలలకొకసారి రూ.1.25 లక్షల మందులు కేటాయించాల్సి ఉన్నా, కేవలం రూ.80 వేల వరకు మాత్రమే మందులను కేటాయిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో తొమ్మిది పీహెచ్‌సీలు, 56 ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి. 26 ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుడుపల్లె, కుప్పంలలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో ఆరు పీహెచ్సీలో ఉన్నాయి. రేగల్లులో మినహా మిగిలిన పీహెచ్సీలో డాక్టర్లు అందుబాటులో లేరు. కేవీపల్లెలో మూడు డాక్టర్ పోస్టులుంటే ముగ్గురూ లేరు. కలికిరిలో కొత్త భవనం కట్టినా ప్రారంభం కాలేదు. పుంగనూరు నియోజకవర్గంలోని తొమ్మిది పీహెచ్‌సీల్లో డాక్టర్లతో పాటు సిబ్బంది కొరత ఉంది. ఏఎన్ఎంలు లేరు. సదుం పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్ లేరు. పులిచెర్లలో నర్సుల కొరత ఉంది. పూతలపట్టు నియోజకవర్గంలోని పి.కొత్తకోట, బంగారుపాళెంల్లో 30 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. ఐదుగురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. మిగిలిన పీహెచ్‌సీల్లో ఏడుగురికి ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు మాత్రమే విధులకు వస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో పలమనేరులోని 100 పడకల ఆస్పత్రితో పాటు ఏడు పీహెచ్‌సీలు ఉన్నాయి. పత్తికొండ పీహెచ్సీలో డాక్టర్ లేరు. ఐదు ఏఎన్ఎం పోస్టు ఖాళీగా ఉన్నాయి. బెరైడ్డిపల్లెలో రెండు పీహెచ్‌సీలకు ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎనిమిది పీహెచ్‌సీలు ఉన్నాయి. వెదురుకుప్పం పీహెచ్సీలో వైద్యాధికారి లేరు. పెనుమూరు పీహెచ్సీలో ఇద్దరికి ఒక్కరే ఉన్నారు. జీడీ నెల్లూరులో మూడు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నారుు. చంద్రగిరి నియోజకవర్గలోని ఏడు పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత ఉంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ఏడుగురికి ఇద్దరే ఉన్నారు. నాలుగు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నారుు. రామచంద్రాపురంలో పది పడకల ఆస్పత్రిలో సరిపడా మంచాలు లేవు. మదనపల్లె నియోజకవర్గంలో ఏడు పీహెచ్‌సీలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ ఆస్పత్రులకు మదనపల్లెకు రిఫర్ చేస్తున్నారు. వైద్యులు సమయపాలన పాటించడం లేదు. రామసముద్రం, నిమ్మనపల్లెలలో ఏఎన్ఎంలు వైద్యం చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలో నాలుగు పీహెచ్‌సీలు ఉన్నాయి. నగరి రూరల్ పీహెచ్సీ సొంత భవన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. విజయపురంలో ఆరుగురు నర్సుల కొరత ఉంది. నిండ్రలో ఇద్దరు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. ఫార్మాసిస్టు విధులకు రాకపోవడంతో ఎఎన్ఎంలే మందులిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో రెండు పీహెచ్‌సీలు ఉన్నాయి. సత్యవేడు ఆస్పత్రికి డాక్టర్‌తో పాటు సిబ్బంది లేటుగా వస్తున్నారు. ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. పాండూరు పీహెచ్సీ శిథిలావస్థకు చేరింది. ముగ్గురు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గంలోని చిత్తూరు బీఎన్‌ఆర్‌పేట ప్రాథమిక ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. స్టాఫ్ నర్సు, ఎంహెచ్వో, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్, సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియోజకవర్గంలో ఐదు పీహెచ్‌సీలున్నాయి. ఏంపేడు, పాపానాయుడుపేట పీహెచ్‌సీల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. ప్రతి ఒక్కరినీ తిరుపతికి రెఫర్ చేస్తున్నారు.