ప్రసవం ఖరీదు రూ.1000
* డబ్బులిస్తేనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
* ఇదీ బీర్కూర్ పీహెచ్‌సీ తీరు
కోటగిరి: పేదలకు వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే సిబ్బంది నిర్లక్ష్యం పేద రోగుల పాలిట శాపంగా మారింది. డబ్బులిస్తేనే సేవ చేస్తామన్నట్లుగా వారు వ్యవహరిస్తున్న తీరుపట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బీర్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ గర్బిణి ప్రసవం కోసం వస్తే ఆమె నుంచి డబ్బులు లాక్కున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీర్కూర్‌కు చెందిన లక్ష్మి పురిటినొప్పులతో ఈ పీహెచ్‌సీకి వచ్చింది. గత సోమవారం రాత్రి బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఇంటికి వెళ్లేందుకు డిశ్చార్జి చేయాలని ఆసుపత్రి సిబ్బందిని కోరగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆయా రూ. 1000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో లక్ష్మి కుటుంబసభ్యులు అవాక్కయ్యారు.
ప్రభుత్వాసుపత్రిలో డబ్బులు అడుగడం ఏమిటని వారు ప్రశ్నించారు. తమకు డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆయూ చెప్పడంతో చేసేదేమి లేక ఆమె అడిగినంత ముట్టజెప్పారు. ఈ విషయం బంధువులకు తెలియజేయడంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వైద్యాధికారిని వివరణ కోరగా ఆయా అడగడంతో లక్ష్మి కుటుంబసభ్యులు రూ.1000 ఇచ్చినట్లు ఫిర్యాదు అందిందని, విచారణ చేపట్టి చర్య తీసుకుంటామని చెప్పారు.