‘ఛీ’హెచ్‌సీలు వైద్యం పూజ్యం
సాక్షి, చిత్తూరు: పేదలకు వైద్యసేవలు అందించాల్సిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అధ్వాన్నంగా ఉన్నారు. అన్ని జబ్బులకు ఒకే మందు అన్నట్లు రెండు మూడు రకాల మాత్రలు ఇచ్చి పంపడం మినహా మరెలాంటి వైద్యసేవలు అందడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో ఏఎన్‌ఎంలే వైద్యం చేస్తున్నారు. మంచాలు కూడా లేక రోగులకు ఆరుబయట ప్రదేశాల్లోనే సెలైన్ ఎక్కించే పరిస్థితి నెలకొంది. వందలాది పీహెచ్‌సీలకు సొంత భవనాలు లేవు. సబ్ సెంటర్లు శిథిలావస్థకు చేరాయి.
ఏఎన్‌ఎంలు లేకపోవడంతో సబ్‌సెంటర్లు మూతపడుతున్నారుు. జిల్లాలో 94 పీహెచ్‌సీలు,644 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వైద్యులతో పాటు సిబ్బంది పోస్టులు 2302 ఉండగా, 1718 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 584 ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు పీహెచ్‌సీలు, ఒక కమ్యూనిటి హెల్త్ సెంటర్ ఉన్నారు. ఆరు డాక్టర్, 11 ఏఎన్‌ఎం, రెండు స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నారుు. తంబళ్లపల్లెలో ఎక్స్‌రే యూనిట్ ఆరేళ్లుగా మూతపడి ఉంది. మూడునెలలకొకసారి రూ.1.25 లక్షల మందులు కేటాయించాల్సి ఉన్నా, కేవలం రూ.80 వేల వరకు మాత్రమే మందులను కేటాయిస్తున్నారు.
కుప్పం నియోజకవర్గంలో తొమ్మిది పీహెచ్‌సీలు, 56 ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి. 26 ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుడుపల్లె, కుప్పంలలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేస్తున్నారు.
పీలేరు నియోజకవర్గంలో ఆరు పీహెచ్‌సీలో ఉన్నాయి. రేగల్లులో మినహా మిగిలిన పీహెచ్‌సీలో డాక్టర్లు అందుబాటులో లేరు. కేవీపల్లెలో మూడు డాక్టర్ పోస్టులుంటే ముగ్గురూ లేరు. కలికిరిలో కొత్త భవనం కట్టినా ప్రారంభం కాలేదు.
పుంగనూరు నియోజకవర్గంలోని తొమ్మిది పీహెచ్‌సీల్లో డాక్టర్లతో పాటు సిబ్బంది కొరత ఉంది. ఏఎన్‌ఎంలు లేరు. సదుం పీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్ లేరు. పులిచెర్లలో నర్సుల కొరత ఉంది.
పూతలపట్టు నియోజకవర్గంలోని పి.కొత్తకోట, బంగారుపాళెంల్లో 30 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. ఐదుగురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. మిగిలిన పీహెచ్‌సీల్లో ఏడుగురికి ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు మాత్రమే విధులకు వస్తున్నారు.
పలమనేరు నియోజకవర్గంలో పలమనేరులోని 100 పడకల ఆస్పత్రితో పాటు ఏడు పీహెచ్‌సీలు ఉన్నాయి. పత్తికొండ పీహెచ్‌సీలో డాక్టర్ లేరు. ఐదు ఏఎన్‌ఎం పోస్టు ఖాళీగా ఉన్నాయి. బెరైడ్డిపల్లెలో రెండు పీహెచ్‌సీలకు ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎనిమిది పీహెచ్‌సీలు ఉన్నాయి. వెదురుకుప్పం పీహెచ్‌సీలో వైద్యాధికారి లేరు. పెనుమూరు పీహెచ్‌సీలో ఇద్దరికి ఒక్కరే ఉన్నారు. జీడీ నెల్లూరులో మూడు ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నారుు.
చంద్రగిరి నియోజకవర్గలోని ఏడు పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత ఉంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ఏడుగురికి ఇద్దరే ఉన్నారు. నాలుగు ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నారుు. రామచంద్రాపురంలో పది పడకల ఆస్పత్రిలో సరిపడా మంచాలు లేవు.
మదనపల్లె నియోజకవర్గంలో ఏడు పీహెచ్‌సీలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ ఆస్పత్రులకు మదనపల్లెకు రిఫర్ చేస్తున్నారు. వైద్యులు సమయపాలన పాటించడం లేదు. రామసముద్రం, నిమ్మనపల్లెలలో ఏఎన్‌ఎంలు వైద్యం చేస్తున్నారు.
నగరి నియోజకవర్గంలో నాలుగు పీహెచ్‌సీలు ఉన్నాయి. నగరి రూరల్ పీహెచ్‌సీ సొంత భవన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. విజయపురంలో ఆరుగురు నర్సుల కొరత ఉంది. నిండ్రలో ఇద్దరు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. ఫార్మాసిస్టు విధులకు రాకపోవడంతో ఎఎన్‌ఎంలే మందులిస్తున్నారు.
సత్యవేడు నియోజకవర్గంలో రెండు పీహెచ్‌సీలు ఉన్నాయి. సత్యవేడు ఆస్పత్రికి డాక్టర్‌తో పాటు సిబ్బంది లేటుగా వస్తున్నారు. ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. పాండూరు పీహెచ్‌సీ శిథిలావస్థకు చేరింది. ముగ్గురు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు.
చిత్తూరు నియోజకవర్గంలోని చిత్తూరు బీఎన్‌ఆర్‌పేట ప్రాథమిక ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. స్టాఫ్ నర్సు, ఎంహెచ్‌వో, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్, సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియోజకవర్గంలో ఐదు పీహెచ్‌సీలున్నాయి. ఏంపేడు, పాపానాయుడుపేట పీహెచ్‌సీల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. ప్రతి ఒక్కరినీ తిరుపతికి రెఫర్ చేస్తున్నారు.