మూడెకరాల భూమి, ఇల్లు కలేనా?
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఇతర పథకాలకు మళ్లింపు
నామమాత్రంగా భూ పంపిణీ
ప్రభుత్వ మోసాలపై ఉద్యమాలు నిర్మిస్తాం
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం
నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం 2014 ఆగస్టులో ఆర్భాటంగా ప్రకటించిన దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు కలగానే మిగిలే పరిస్థితి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మాణిక్యం అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన సీపీఎం డివిజన్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు.
రాష్ట్రంలో 10 లక్షల దళితు కుటుంబాలు ఉన్నాయని, సీఎం హామీ అమలు కావాలంటే 30 లక్షల ఎకరాల భూమి అవసరమన్నారు. ఇప్పటి వరకు కేవలం 3 వేల ఎకరాల కూడా పంపిణీ చేయలేదన్నారు. జిల్లాలో 16 వేల దళిత కుటుంబాలు ఉంటే కేవలం 550 మందికి మాత్రమే భూమి ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే దళితులు సాగు చేసుకుంటున్న భూములను దళారులు కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల సంగతి అటుంచితే గతంలో నిర్మించుకున్న ఇళ్లకు నేటికీ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దళిత వాడల అభివృద్ధికి కేటాయించాలని, కానీ వీటిని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇతర పథకాలకు మళ్లించి దళితులకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళితులను సంఘటితం చేసి ఉద్యమాలను నిర్మిస్తామని మాణిక్యం హెచ్చరించారు.
లాఠీచార్జీ చేసిన పోలీసులపై కేసులు పెట్టాలి
శివ్వంపేట మండలం ధర్మా తండాకు చెందిన గిరిజనుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు కబ్జాలకు పాల్పడుతుంటే అడ్డుకున్న గిరిజనులపై కక్షగట్టి అర్ధరాత్రి పోలీసులు తండాపై దాడిచేసి లాఠీచార్జీ శారని మాణిక్యం అన్నారు. అమాయక గిరిజనులపై దౌర్జన్యాలు చేస్తూ 50 మందిపైన కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
గిరిజనులపై దాడులకు పాల్పడిన సీఐ, ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చిరంజీవి, నర్సింహులు, సంగమేశ్వర్, రాములు, మోషప్ప, అరుణ్ పాల్గొన్నారు.