కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది..
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ విచారణ అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, జాతి స్వేచ్ఛకు వ్యతిరేకమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. పార్లమెంటు లోపలా, బయటా రాజకీయ పార్టీలను భయపెట్టేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహిరిస్తోందన్నారు.
ఈ వివాదంపై సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. గోరంతను కొండంతలు గా చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఇలాంటి విచారణలు జరిగాయని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటికి ఢిల్లీ పోలీసులు వెళ్లి ఆయన గురించి వాకబు చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మరోవైపు శరద్ యాదవ్ మహిళల శరీర రంగుపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. సభ ప్రారంభంలోనే బీజేపీ నాయకుడు రవిశంకర్ మహిళలపై అనుచిత కమెంట్స్ చేసిన శరద్ యాదవ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని మహిళల శరీర రంగుపై దయచేసి వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌత్ ఇండియన్ మహిళలు నల్లగా ఉన్నా, అందంగా ఉంటారని, వాళ్లు డాన్స్ చేస్తోంటే చూడాలని ఉంటుందంటూ గత శనివారం సమాజ్ వాదీ నేత శరద్ యాదవ్ కమెంట్ చేయడం, ప్రతిపక్షాలు క్షమాపణకు పట్టుబట్టడం తెలిసిందే.