సాయపడవలసిన వారే సైంధవులయ్యారు!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ :జిల్లాలోని రైతులకు ప్రభుత్వం అందజేసే పంట నష్టపరిహారం వారికి సక్రమంగా అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు తిరిగి ఖజానాకే వెళ్లిపోతున్నాయి. నిధులు బ్యాంకు ల నుంచి అధికారులకు చేరుతున్నాయి. కానీ రైతులకు మాత్రం సరిగ్గా అందడం లేదు. అసలు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రావడమే గగనమైతే వచ్చిన దానిని కూడా అధికారులు రైతులకు సకాలంలో చెల్లించకుండానిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఈ కింది సంఘటనలే నిదర్శనం. జిల్లాలో 2011లో నీలం తుపాను వల్ల చాలా వరకు పంటలు పోయూరుు. దీంతో ప్రభుత్వం 2,600 మంది రైతులకు పరిహారం కింద రూ.13. 50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు అదే ఏడాది అక్టోబర్‌లో విడుదలయ్యూయి.
అధికారులు ఇందులో రూ.12.44 కోట్లను డ్రా చేసి, బ్యాంకులకు పంపించారు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. వీటిని లబ్ధిదారులకు అందించాలంటే ఆన్లైన్లో ఇవ్వాలి. కానీ ఆన్లైన్ చేయడానికి రైతులను గుర్తించడంలో జరిగిన జాప్యం వల్ల నిధులు తిరిగి వెళ్లిపోయాయి. తరవాత రైతుల బ్యాంకు అకౌంట్ల జాబితాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలపడంతో మళ్లీ మంజూరు చేశారు. వాటిలో కొన్ని అకౌంట్లకు పరిహారాలను జమ చేసిన యంత్రాంగం, మరికొన్ని అకౌంట్లు దొరకలేదన్న కారణంగా కొన్ని నిధులు పక్కన పెట్టేశారు. దీంతో అకౌంటు నంబర్లు ఇవ్వలేదన్న సాకుతో బ్యాంకర్లు కొంత నగదును తిరిగి వ్యవసాయాధికారులకు పంపించేశారు. ఇలా రూ.1.44 కోట్లు మళ్లీ అధికారుల వద్దకు చేరాయి. రైతుల అకౌంట్లను సరిచేసి మళ్లీ వీటిని 2013లో మార్చిలో పంపించారు. అయితే ఇందులో కూడా రూ. 29.73 లక్షలు వెనక్కి వచ్చేశాయి.
అలాగే అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 2013 జూలైలో కూడా రూ. 3.74 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కూడా రూ.48.45 లక్షలు వెనక్కి మళ్లిపోయాయి. బ్యాంకులకు రైతుల ఖాతాల నంబర్లు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. తరవాత ఖాతా నంబర్లు సరిచేసి అధికారులు పంపించారు. అయినా 17.97లక్షల రూపాయలు తిరిగి వచ్చేశాయి. దీంతో అధికారులు ఇప్పుడు మళ్లీ రైతుల ఖాతా నంబర్లు సేకరించే పనిలో పడ్డారు. మరికొద్ది రోజుల్లో ఆయా రైతులకు పరిహారం చెల్లిస్తామని చెబుతున్నారు.
ఖాతా నంబర్లు తీసుకుని బ్యాంకులకు ఇవ్వడంలో వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం వల్లే తమకు నష్టపరిహారం అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోతుండగా, ఇంకో వైపు అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిన సంవత్సరం తరవాత కూడా సొమ్ము తమ ఖాతాల్లో జమకావడం లేదని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదలవుతున్న పరిహారం సక్రమంగా పంపిణీ జరిగే అవకాశం ఉందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.