government restrictions
-
ఖజానాపై సర్కారు ఆంక్షలు
-
ఖజానాపై సర్కారు ఆంక్షలు
- మౌఖిక ఆదేశాలతో బిల్లుల ఫ్రీజింగ్ - ఆర్థిక శాఖ డైరెక్షన్లో బిల్లుల వారీగా డీటీఏ అనుమతి సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని ఖజానా (ట్రెజరీ)లపై సర్కారు ఆంక్షల కత్తి దూసింది. ఆర్థిక లోటు పేరుతో బిల్లుల చెల్లింపులపై లోపాయికారి ఫ్రీజింగ్ అమలు చేస్తోంది. వేతన బిల్లులు మినహా మిగిలిన ఏ ఒక్క బిల్లు మంజూరు కావాలన్నా అనుమతి తప్పనిసరి అనే మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. గతంలో జిల్లాల వారీగా బిల్లుల ఆమోదం జరిగితే, ఇప్పుడు ఆ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా రాష్ట్రమంతటా ఒకే పద్ధతి అమలు చేసేలా ఆర్థిక శాఖ ఆంక్షలు పెట్టింది. ఏ బిల్లు ఎప్పుడు ఆమోదించాలి? ఎంత మొత్తం బిల్లులు ఆమోదించాలి? అనే ఆదేశాలను ఆర్థిక శాఖ ఇస్తోంది. అందుకు అనుగుణంగానే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్(డీటీఏ) 13 జిల్లాలకు ఎప్పటికప్పుడు మౌఖిక ఆదేశాలు ఇస్తోంది. ప్రతీనెల జీతాల బిల్లు సాకుతో 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్ని రకాల బిల్లులను మంజూరు చేయకుండా ్రïఫీజింగ్ విధిస్తుండటం గమనార్హం. ఇలా రోజుకు ఒక్కో జిల్లాలో రూ.3 నుంచి 8 కోట్ల బిల్లులు ట్రెజరీల్లో ఆమోదానికి నోచుకోవడంలేదు. ఈ లెక్కన జిల్లాకు ప్రతీ నెల రూ.200 నుంచి రూ.300 కోట్ల బిల్లులు ఖజానా శాఖలో కొర్రీలు వేస్తుండటంతో జాప్యం జరుగుతోంది. వేతనాలు మినహా అన్నింటిపై ఆంక్షలు మూడు నెలలుగా రాష్ట్రంలో వేతనాలు మినహా ఏ ఒక్క బిల్లు సకాలంలో ట్రెజరీ ఆమోదం లేక ఉద్యోగులు, విద్యార్థులు, పింఛన్ లబ్ధిదారులు, కాంట్రాక్టర్లు అనేక మంది అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగులకు వేతనాలు మినహా అలవెన్సులు, సరెండర్ లీవ్స్, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) తదితర బిల్లులు ఆమోదం కోసం రోజుల తరబడి ట్రెజరీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ బిల్లుల మంజూరులోనూ ఇదే తీరు కొనసాగడంతో ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల స్కాలర్షిప్పుల బిల్లులు కూడా మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోంది. సకాలంలో బిల్లులు మంజూరు కాక ఆయా ప్రభుత్వ శాఖలు సైతం ఆర్థికపరమైన కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నెల 1న పంపిణీ చేయాల్సిన పింఛన్ మొత్తాలకు చెందిన బిల్లులు ట్రెజరీలో మంజూరు కాకపోవడంతో వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు పింఛన్ల కోసం రోజుల తరబడి ఆయా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పింఛన్ మొత్తాల బిల్లులను ఈ నెల 12న ఆమోదించడంతో ఇప్పుడు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.150 కోట్ల పింఛన్ బిల్లులు ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు మంజూరు కావాల్సిన బిల్లులు ట్రెజరీలపై ఆంక్షల నేపథ్యంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఆయా వర్గాలు అవస్థలు పడుతున్నాయి. -
ఇక పెళ్లిళ్లపై సర్కారు ఆంక్షలు
ఇంట్లో కొడుకు లేదా కూతురు పెళ్లి జరుగుతోందంటే చెప్పలేనంత ఆర్భాటం ఉంటుంది. నిశ్చితార్థం నుంచి పెళ్లి అయ్యేవరకు చుట్టాల సందడి, బాజా భజంత్రీలు, భారీ ఎత్తున విందు వినోదాలు.. ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ హంగు, ఆర్భాటాలకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ముకుతాడు వేసింది. నిశ్చితార్థం లాంటి చిన్న ఫంక్షన్లకైతే గరిష్ఠంగా వంద మందికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదని, అలాగే కూతురి పెళ్లికైతే 500 మంది, కొడుకు పెళ్లికైతే 400 మందిని మాత్రమే పిలవాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఏడు రకాల వంటలను మాత్రమే వడ్డించాలి తప్ప.. ఎక్కువ పదార్థాలు పెట్టి వాటిని వృథా చేయకూడదని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రభుత్వ, ప్రైవేటు, సామాజిక ఫంక్షన్లలో ఎక్కడైనా కూడా లౌడ్ స్పీకర్లు వాడకూడదని, టపాసులు కాల్చకూడదని తెలిపింది. శుభలేఖలతో పాటు స్వీట్లు గానీ డ్రై ఫ్రూట్లు గానీ పంపడానికి కూడా వీల్లేదని స్పష్టం చేసింది. సామాజిక, ప్రభుత్వ, ప్రైవేటు ఫంక్షన్లు ఎక్కడ జరిగినా అత్యవసర సరుకులను విచ్చలవిడిగా ఉపయోగించడానికి వీల్లేదని ప్రభుత్వం ఆంక్షలు పెట్టినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి చౌదరి జుల్ఫికర్ అలీ చెప్పారు. ఈ కొత్త నిబంధనలన్నీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.