ఖజానాపై సర్కారు ఆంక్షలు | Government restrictions on the state treasury | Sakshi
Sakshi News home page

ఖజానాపై సర్కారు ఆంక్షలు

Published Sun, Sep 17 2017 12:54 AM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

ఖజానాపై సర్కారు ఆంక్షలు

ఖజానాపై సర్కారు ఆంక్షలు

- మౌఖిక ఆదేశాలతో బిల్లుల ఫ్రీజింగ్‌
ఆర్థిక శాఖ డైరెక్షన్‌లో బిల్లుల వారీగా డీటీఏ అనుమతి
 
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని ఖజానా (ట్రెజరీ)లపై సర్కారు ఆంక్షల కత్తి దూసింది. ఆర్థిక లోటు పేరుతో బిల్లుల చెల్లింపులపై లోపాయికారి ఫ్రీజింగ్‌ అమలు చేస్తోంది. వేతన బిల్లులు మినహా మిగిలిన ఏ ఒక్క బిల్లు మంజూరు కావాలన్నా అనుమతి తప్పనిసరి అనే మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. గతంలో జిల్లాల వారీగా బిల్లుల ఆమోదం జరిగితే, ఇప్పుడు ఆ ప్రక్రియను ఆన్‌లైన్‌ ద్వారా రాష్ట్రమంతటా ఒకే పద్ధతి అమలు చేసేలా ఆర్థిక శాఖ ఆంక్షలు పెట్టింది.

ఏ బిల్లు ఎప్పుడు ఆమోదించాలి? ఎంత మొత్తం బిల్లులు ఆమోదించాలి? అనే ఆదేశాలను ఆర్థిక శాఖ ఇస్తోంది. అందుకు అనుగుణంగానే డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌(డీటీఏ) 13 జిల్లాలకు ఎప్పటికప్పుడు మౌఖిక ఆదేశాలు ఇస్తోంది. ప్రతీనెల జీతాల బిల్లు సాకుతో 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్ని రకాల బిల్లులను మంజూరు చేయకుండా ్రïఫీజింగ్‌ విధిస్తుండటం గమనార్హం. ఇలా రోజుకు ఒక్కో జిల్లాలో రూ.3 నుంచి 8 కోట్ల బిల్లులు ట్రెజరీల్లో ఆమోదానికి నోచుకోవడంలేదు. ఈ లెక్కన జిల్లాకు ప్రతీ నెల రూ.200 నుంచి రూ.300 కోట్ల బిల్లులు ఖజానా శాఖలో కొర్రీలు వేస్తుండటంతో జాప్యం జరుగుతోంది. 
 
వేతనాలు మినహా అన్నింటిపై ఆంక్షలు
మూడు నెలలుగా రాష్ట్రంలో వేతనాలు మినహా ఏ ఒక్క బిల్లు సకాలంలో ట్రెజరీ ఆమోదం లేక ఉద్యోగులు, విద్యార్థులు, పింఛన్‌ లబ్ధిదారులు, కాంట్రాక్టర్లు అనేక మంది అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగులకు వేతనాలు మినహా అలవెన్సులు, సరెండర్‌ లీవ్స్, ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) తదితర బిల్లులు ఆమోదం కోసం రోజుల తరబడి ట్రెజరీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్‌ బిల్లుల మంజూరులోనూ ఇదే తీరు కొనసాగడంతో ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్పుల బిల్లులు కూడా మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోంది.

సకాలంలో బిల్లులు మంజూరు కాక ఆయా ప్రభుత్వ శాఖలు సైతం ఆర్థికపరమైన కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నెల 1న పంపిణీ చేయాల్సిన పింఛన్‌ మొత్తాలకు చెందిన బిల్లులు ట్రెజరీలో మంజూరు కాకపోవడంతో వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు పింఛన్‌ల కోసం రోజుల తరబడి ఆయా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పింఛన్‌ మొత్తాల బిల్లులను ఈ నెల 12న ఆమోదించడంతో ఇప్పుడు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.150 కోట్ల పింఛన్‌ బిల్లులు ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు మంజూరు కావాల్సిన బిల్లులు ట్రెజరీలపై ఆంక్షల నేపథ్యంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఆయా వర్గాలు అవస్థలు పడుతున్నాయి.  

 

Advertisement
Advertisement