ఇక పెళ్లిళ్లపై సర్కారు ఆంక్షలు
ఇక పెళ్లిళ్లపై సర్కారు ఆంక్షలు
Published Tue, Feb 21 2017 3:04 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
ఇంట్లో కొడుకు లేదా కూతురు పెళ్లి జరుగుతోందంటే చెప్పలేనంత ఆర్భాటం ఉంటుంది. నిశ్చితార్థం నుంచి పెళ్లి అయ్యేవరకు చుట్టాల సందడి, బాజా భజంత్రీలు, భారీ ఎత్తున విందు వినోదాలు.. ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ హంగు, ఆర్భాటాలకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ముకుతాడు వేసింది. నిశ్చితార్థం లాంటి చిన్న ఫంక్షన్లకైతే గరిష్ఠంగా వంద మందికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదని, అలాగే కూతురి పెళ్లికైతే 500 మంది, కొడుకు పెళ్లికైతే 400 మందిని మాత్రమే పిలవాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఏడు రకాల వంటలను మాత్రమే వడ్డించాలి తప్ప.. ఎక్కువ పదార్థాలు పెట్టి వాటిని వృథా చేయకూడదని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు.
అంతేకాదు.. ప్రభుత్వ, ప్రైవేటు, సామాజిక ఫంక్షన్లలో ఎక్కడైనా కూడా లౌడ్ స్పీకర్లు వాడకూడదని, టపాసులు కాల్చకూడదని తెలిపింది. శుభలేఖలతో పాటు స్వీట్లు గానీ డ్రై ఫ్రూట్లు గానీ పంపడానికి కూడా వీల్లేదని స్పష్టం చేసింది. సామాజిక, ప్రభుత్వ, ప్రైవేటు ఫంక్షన్లు ఎక్కడ జరిగినా అత్యవసర సరుకులను విచ్చలవిడిగా ఉపయోగించడానికి వీల్లేదని ప్రభుత్వం ఆంక్షలు పెట్టినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి చౌదరి జుల్ఫికర్ అలీ చెప్పారు. ఈ కొత్త నిబంధనలన్నీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.
Advertisement