సంపద ఒకరిది.. సోకు మరొకరిది!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియలో మిల్లర్లు కొత్త రకం అక్రమాలకు తెర తీశారు. ఇప్పటి వరకు ఒకటి, రెండేళ్లు ఆలస్యంగా ఇస్తూ లాభాలు ఆర్జించిన మిల్లర్లు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. నేరుగా స్వాహా చేయకుండా... ప్రభుత్వం ధాన్యాన్ని బగడువు ముగిసిన తర్వాత అధికారులు బియ్యం ఇవ్వాలని అడిగితే... మిల్లర్లకు బదులుగా బ్యాంకులే అడ్డం పడుతున్నాయి.
ఇలా ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని జిల్లాలోని పలువురు మిల్లర్లు, బ్యాంకులతో కలిసి ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేసే పనులకు దిగారు. కొడకండ్ల మండలం పెద్దవంగరలో ఉన్న చిల్లంచెర్ల ఆగ్రోటెక్ ఇండస్ట్రీ ఇదే పని చేసింది. గత ఖరీఫ్, రబీలో ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ), వ్యవసాయ సహకార సంఘాలు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే రైస్ మిల్లర్లకు ఇచ్చింది. రెండు సీజన్లలోని ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు ఈ నెల 30లోపు బియ్యం అప్పగించాల్సి ఉంటుంది.
ఇలా 6236 టన్నుల ధాన్యం తీసుకున్న చిల్లంచెర్ల ఆగ్రోటెక్ ఇండస్ట్రీ మళ్లీ బియ్యం ఇచ్చే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించింది. గడువు ముగుస్తున్నా ఇవ్వాల్సిన బియ్యంలో 70 శాతమే ఇచ్చింది. మిగిలిన బియ్యం విషయంలో అధికారులు వాస్తవ పరిస్థితిని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఈ మిల్లర్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో తనఖా పెట్టి కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు అధికారులు గుర్తిం చారు.
మిల్లులో ఉన్న సరుకును వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయగా, రుణం తీరే వరకు కుదరదంటూ బ్యాంకు అధికారులు జిల్లా యంత్రాంగానికి తెలిపారు. ఈ మేరకు కోర్టు నుంచి ఆదేశాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాలే వల్లే ఇలా జరిగిందని గుర్తించిన పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ జి.కిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై కలెక్టర్ వద్ద ఇటీవల ప్రత్యేకంగా విచారణ జరిగినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ఉషారాణి ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. తనఖా పెట్టిన సరుకుతో సంబంధం లేకుండా బియ్యాన్ని గడువులోపు ఇచ్చేందుకు మిల్లర్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
మొత్తంగా 84 శాతమే..
గత ఖరీఫ్, రబీలో ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి 1.88 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. పౌర సరఫరాల శాఖ ఈ ధాన్యాన్ని జిల్లాలోని 89 రైస్ మిల్లులకు ఇచ్చింది. 2013-2014 లెవీ సీజన్ ముగిసే సెప్టెంబర్ 30 లోపు ఈ ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్లు భారత ఆహార సంస్థ, పౌర సరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంది. తుది గడువుకు ఇంకా రెం డు రోజులే ఉంది. జిల్లాలో మాత్రం ఇప్పటికి 86 శాతం బియ్య మే పౌర సరఫరాల సంస్థకు చేరింది. మొత్తం 89 మిల్లుల్లో వంద శాతం బియ్యం ఇచ్చినవి 19 మాత్రమే. 99 శాతం లెవీ పూర్తి చేసిన మిల్లులు 36, యాభై శాతంలోపు బియ్యం కోటా అప్పగించిన మిల్లులు నాలుగు ఉన్నాయి. ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 68 కిలోల బియ్యం వస్తాయి. ఈ లెక్కన ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఇంకా 17,360 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది.