ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే బస్సు ప్రమాదాలు
⇒ ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలపై చర్చా గోష్టిలో వక్తలు
⇒ అమలు కాని కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్ నిబంధనలు
⇒ స్టేజి క్యారేజ్ పద్ధతిలో కొనసాగుతున్న ట్రావెల్స్ బస్సులు
⇒ ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వాలు
సాక్షి, హైదరాబాద్: ‘సమర్థవంతమైన ఆర్టీసీని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రైవేటు ట్రావెల్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బస్సు యాజమాన్యం స్పందించదు. ప్రభుత్వాలు సాంత్వన చర్యలు తీసుకుంటాయి. కానీ బాధ్యులైన యాజమాన్యాలపై చర్యలు తీసుకున్న దాఖలా లుండవు. మరుసటి రోజునుంచి షరా మామూ లుగా ట్రావెల్స్ బస్సులు రోడ్డెక్కుతాయి. ప్రభుత్వా ల్లో పెద్దలు, రాజకీయ నాయకుల ప్రవేయం ఉండడంతోనే ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా చెలరేగిపోతోంది.
ప్రభుత్వాలు స్పందించనంత వరకు ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి’ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్ర వారం ఇక్కడ ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా వ్యతి రేక పోరాట సమితి చర్చాగోష్టి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రవాణాశాఖ మాజీ అదనపు కమిషనర్ సీఎల్ఎన్ గాంధీ, ఏపీసీసీ అధికార ప్రతినిధి గౌతమ్, జర్నలిస్టులు జి.సాయి, మురళీకృష్ణ, ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా వ్యతిరేక పోరాట సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సుధాకర్, పీఎన్.మూర్తి, చైర్పర్సన్ ముక్తాల రేఖ, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్రావెల్స్ బస్సుల్లో కంటే ఆర్టీసీ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. బస్సు ప్రమాదానికి సంబంధిం చి ముందుగా యాజమానిని బాధ్యులుగా చేయా లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మెమో ఇచ్చిం దని, దీని ఆధారంగా పెనుగంచిప్రోలులో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం తక్షణమే జేసీ బ్రదర్స్‌ను అరెస్టు చేయాలని ఏపీసీసీ నేత గౌతమ్ డిమాండ్ చేశారు. ప్రైవేటు బస్సులు కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్లు తీసుకుని స్టేజి క్యారేజీ పర్మిట్ పద్ధతిలో నడుస్తున్నాయని ఆర్టీఏ మాజీ అధికారి గాంధీ చెప్పారు. పెనుగంచిప్రోలు వద్ద బస్సు ప్రమాదం ఘటనా స్థలానికి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లి అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నా, అధికార పార్టీకి చెందిన వారెవరూ వెంటనే రాలేదని కొండా రాఘవరెడ్డి అన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలపై త్వరలో కోదాడ వద్ద మహాధర్నా చేపడతా మని మహబూబ్‌నగర్ ఎమ్మె ల్యే శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.