ఆప్ సర్కారుతో ఆగని ‘జంగ్’
ఏసీబీలో బిహార్ పోలీసులను
డిప్యుటేషన్‌పై నియమించిన సర్కారు
న్యూఢిల్లీ: ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు మధ్య ఆధిపత్య పోరు మరింతగా ముదురుతోంది. ఉద్యోగుల నియామకంైపై తలెత్తిన వివాదం ఓ పక్క కోర్టుల్లో నానుతుండగానే.. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ విభాగానికి సంబంధించి తాజా ఘర్షణ తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం బిహార్‌కు చెందిన ఆరుగురు పోలీసు అధికారులను డిప్యుటేషన్‌పై ఢిల్లీ ఏసీబీలో నియమించాలని నిర్ణయించగా.. ఆ నిర్ణయం చెల్లబోదని ఎల్జీ అభ్యంతరం చెప్పారు. ఏసీబీ నేరుగా తన అధికార పరిధిలో తన నియంత్రణలో తన పర్యవేక్షణలో పని చేస్తుందని.. దీనిలో నియామకాలు చేసే అధికారం తనకు మాత్రమే ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ జంగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఆప్ సర్కారు తీవ్రంగా ప్రతిస్పందించింది.
ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ఏసీబీ కోసం దేశంలోని ఎక్కడి నుంచైనా పోలీసు అధికారులను నియమించుకునే పూర్తి అధికారాలు తనకు ఉన్నాయని పేర్కొంది. కాగా, కేంద్రం మరోసారి ఎల్జీ వైఖరికి మద్దతు పలికింది. మరోపక్క.. ఢిల్లీ ఏసీబీ కార్యకలాపాల నిర్వహణకు కేంద్రం, ఎల్జీ ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజమెత్తింది. ఆప్ సర్కారు ఎల్జీతో అనవసర ఘర్షణలకు దిగుతోందని బీజేపీ తప్పుపట్టింది. వివాదం కారణంగా ఢిల్లీవాసులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.