మరింత భద్రత కల్పించండి
సాక్షి, ముంబై: ఉట్టి ఉత్సవాల సమయంలో మరింత భద్రత కల్పించాలని మహిళా గోవింద బృందాలు కోరుతున్నాయి. ఉట్టి ఉత్సవాలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో నగరంలో మహిళా గోవింద బృందాలు, పురుష గోవింద బృందాలు మానవ పిరమిడ్ల కోసం ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. అయితే నగరంలో ఇటీవల శక్తిమిల్లో మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం జరగడంతో మహిళా గోవింద బృందాలు తీవ్ర భయాందోళనలకు గరవుతున్నాయి. ఉట్టి ఉత్సవాల నిమిత్తం రాత్రి వేళ్లలో సాధన చేసే సమయాన్ని కూడా తగ్గించి త్వరగా ఇంటికి చేరుకుంటున్నట్లు పలువురు తెలిపారు.
కాగా ఈ ఉత్సవాల సమయంలో రద్దీని అదనుగా తీసుకొని తమను వేధించే అవకాశం ఉందని, భద్రతను పెంచాలని కోరుతున్నారు. ఈ అత్యాచార ఘటన తమలో భయాన్ని నింపిందని దహీ హండి కోచ్లు చెబుతున్నారు. సాధన సమయాన్ని తగ్గించామని, సభ్యుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇంటికి త్వరగా పంపాలని కోరుతున్నారన్నారు. అయితే తాము ఏడు అంతస్తుల వరకు పిరమిడ్ నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నప్పటికీ శక్తిమిల్ ఘటనతో తమలో ఏకాగ్రత తగ్గిందని, సాధన సమయాన్ని కూడా తగ్గించి ఆరు అంతస్తులకే పరిమితం చేశామన్నారు. అయితే స్థానికులతోపాటు, నిర్వాహకులు, పోలీసులు తమకు అండగా ఉంటారనే ధైర్యమే ఉత్సవాల్లో పాల్గొనేలా చేస్తోందన్నారు. మహిళా గోవింద బృందాల పిరమిడ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు.
ఇదిలాఉండగా నగరంలో 35 మహిళా గోవింద బృందాలు ఈసారి ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి. ఉత్సవాలను మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఉపయోగించుకుంటామని చెబుతున్నారు. ఈ విషయమై ‘స్ఫూర్తి సేవా మండల్’ సీనియర్ సభ్యురాలు పల్లవి మాట్లాడుతూ.. శక్తిమిల్ ఘటన నగర వ్యాప్తంగా మహిళల్లో భయాన్ని నింపిందన్నారు. దీంతో తమ కోచ్ కూడా సాధన సమయాన్ని తగ్గించారని, రాత్రి 10.30 వరకు సాధన చేసేవారమని, ఇప్పుడు గంట ముందే సాధనను ముగిస్తున్నట్లు చెప్పారు. పరేల్ స్పోర్ట్స్ క్లబ్ మహిళా దహీ హండి పథక్ కోచ్ గీతా ఝాగ్డే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను వేధిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.