Govt Hospetal
-
మదురై ఆస్పత్రిలో దారుణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని మదురై ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ఒకరి తరువాత మరొకరు ప్రాణాలు విడిచిన విషాదకర సంఘటన మంగళ, బుధవారాల్లో జరిగింది. మదురైలో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీయడంతోపాటు భారీ స్థాయిలో వర్షం కురిసింది. దీంతో సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రికి కూడా కరెంటు సరఫరా నిలిచిపోవడం, జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా ఆలస్యం కావడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులు ఆక్సిజన్ అందకపోవడంతో విలవిల్లాడారు. ఈ నేపథ్యంలో మదురై జిల్లా మేలూరుకు చెందిన మల్లిక (55), దిండుగల్లు జిల్లా ఒట్టనసత్రంకు చెందిన పళనియమ్మాళ్ (60), విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన రవీంద్రన్ (52) ప్రాణాలు విడిచారు. బుధవారం ఉదయం మదురై సెల్లూరుకు చెందిన చెల్లత్తాయ్ (55), తిరుప్పూరు జిల్లా పల్లడంకు చెందిన ఆర్ముగం (48) కూడా మృతి చెందారు. అయితే వెంటిలేటర్ పనిచేయక పోవడం వల్ల కాదని, వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెంచారని ఆస్పత్రి డీన్ వనిత చెప్పారు. -
కాంట్రాక్టు జగన్నాథునికెరుక!
అనంతపురం న్యూసిటీ : సర్వజనాస్పత్రిలో అవినీతి, అక్రమాలు తారస్థాయికి చేరాయి. డబ్బు ముట్టజెబితే చాలు.. ఇక్కడ ఎలాంటి పని చేసేందుకైనా వెనుకాడని పరిస్థితి. మెడికల్ రికార్డు, ఓపీ, ఐపీ నిర్వహణ బాధ్యతను పరిశీలిస్తే అధికారులు ఏ స్థాయికి దిగజారినారో అర్థమవుతోంది. ఏడాదిన్నరగా కర్నూలుకు చెందిన ఓ ప్రయివేట్ సంస్థకు ఓపీ, ఐపీ, రికార్డుల నిర్వహణ బాధ్యతను అనధికారికంగా కట్టబెట్టారు. ఇందుకోసం ప్రతినెలా రూ.3.25లక్షలు చెల్లిస్తున్నారు. ఇందులో ఆసుపత్రిలోని కీలక అధికారికి భారీగా ముడుపులు ముడుతున్నట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఏడాదికి పైగా అదే కంపెనీని కొనసాగిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రతి నెలా కలెక్టర్‌కు ఫైల్ పంపి కాంట్రాక్టును కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. ఇదీ సంగతి 2017లో ఎంసీఐ సర్వజనాస్పత్రిని తనిఖీ చేసి మెడికల్ రికార్డ్స్ నిర్వహణ సరిగా లేదని, డిజిటలైజేషన్ పక్కాగా ఉండాలని స్పష్టం చేసింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఆస్పత్రిలోని కీలక అధికారి ఎలాంటి టెండర్ లేకుండానే ఓ కంపెనీకి ఐపీ, ఓపీ, రికార్డ్స్ నిర్వహణ బాధ్యతను కట్టబెట్టారు. అప్పట్లో ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అధికార పార్టీ నాయకల అండతో కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తూ వచ్చారు. కంపెనీ నిర్వాహకులు ఆస్పత్రిలో పూర్తి స్థాయి సామగ్రిని కూడా సమకూర్చుకోలేదు. ఓపీ, ఐపీ, మెడికల్ రికార్డ్ రూంలో తూతూమంత్రంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలోనూ సర్వజనాస్పత్రికి చెందిన కంప్యూటర్లే ఉన్నాయి. ప్రతి నెలా కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉన్నా.. ఆస్పత్రిపైనే భారం వేస్తున్నారు. రూ.1.50లక్షకు పైనే లబ్ధి కంపెనీకి ప్రతి నెలా రూ.3.25 లక్షలు చెల్లించేలా ఆస్పత్రి యాజమాన్యం కాంట్రాక్ట్‌ను అప్పగించింది. ఇక్కడ 10 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వారికి ప్రతి నెలా రూ.6వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రూ.60వేలు సిబ్బందికి ఖర్చవుతుంది. ఇక మెడికల్ రికార్డ్స్ పేపర్లకు రూ.లక్ష కూడా ఖర్చు కాదని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. అంటే.. కంపెనీ ప్రతి నెలా రూ.1.50లక్షకు పైగానే లబ్ధి పొందుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిబ్బందికి అందని వేతనాలు ఐపీ, ఓపీ, మెడికల్ రికార్డ్ సెక్షన్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి గత నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. కంపెనీకి ప్రతి నెలా రూ.3.25 లక్షలు వస్తున్నా వేతనాలు ఇవ్వకపోవడం పట్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం విధులకు హాజరైనట్లు వ్యాట్సాప్‌లో ఫొటోలు ఉంచడం మినహా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వేతనాల విషయమై కంపెనీ నిర్వాహకులను ఆరా తీస్తే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లుగా సమాచారం. నిబంధనలకు పాతర సర్వజనాస్పత్రిలో ఓ కీలక అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనిలోనూ కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా పని జరగాలంటే ఆ అధికారిని కలిస్తే చాలని ఆసుపత్రిలోనే బహిరంగ చర్చ జరుగుతోంది. రూ.వెయ్యి మొదలు రూ.లక్షల వరకు ఆయన దేన్నీ వదలడం లేదని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘ఆఫ్’గ్రేడ్..!
పరకాల: ఈ రోజుల్లో వైద్యం అత్యంత ఖరీదుగా మారింది. పేదలకు అందని ద్రాక్షలా మారింది. ప్రతి కుటుంబ సంపాదనలో అధిక మొత్తం ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారనేది నిత్య సత్యం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చూయించుకుందామంటే అరకొర వసతులు, నాణ్యమైన వైద్యం పొందలేక పోతున్నారు. ప్రజలు అవసరాలకు అనుగుణంగా మెరుగైన వసతుల కల్పనలో పాలకులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల పేదల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. ఈ కోవకే వస్తుంది పరకాల సివిల్ ఆస్పత్రి. చుట్టూ వందల గ్రామాలకు పెద్దదిక్కుగా ఉన్న ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు ఇప్పటికే రెండుసార్లు ప్రతిపాదనలు చేసినా మొగ్గ దశలోనే వాడిపోయాయి. అయితే ఈ ప్రాంత సరిహద్దు మండలం కమలాపూర్‌కు చెందిన ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో వంద పడకల ఆస్పత్రికి చేసిన ప్రతిపాదనలకు తోడుమరో 150 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలంటూ మంత్రికి విన్నవించుకునేందుకు ప్రతిపాదనలు చేయాలని వైద్యాధికారులను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి పరకాల సివిల్ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని కోరనున్నట్లు తెలిసింది. మూడు జిల్లాలకు పెద్ద దిక్కు.. వరంగల్ రూరల్, అర్బన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 8 మండలాలుకు చెందిన సుమారు 150 గ్రామాలతో పాటు మహారాష్ట్రకు చెందిన నిరుపేదలకు పరకాల సివిల్ ఆస్పత్రి పెద్దదిక్కుగా నిలుస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎంజీఎం ఆస్పత్రి తర్వాత ఎక్కువ మంది రోగులు వైద్యం అందించే పరకాల సివిల్ ఆస్పత్రిఇ పట్టిన జబ్బును నయం చేసేవారు కనిపించలేదు. పొరుగున ఉన్న చిట్యాల, కమలాపూర్ వంటి మండల స్థాయి పీహెచ్‌సీలు వంద పడకలుగా మారినా పరకాల ఆస్పత్రిఇ మాత్రం ఆ భాగ్యం లభించలేదు. నిత్యం వందలాది మంది రోగులతో కిట కిటలాడే ఆస్పత్రి పుట్టెడు కష్టాలతో తల్లడిల్లుతుంది. ప్రసుత్తం ఉన్న 30 పడకల ఆస్పత్రి భవనంలోనే బాలింతలను, ఇన్పెషంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకల ఆస్పత్రి చేస్తామంటూ పాలకులు చేసిన హామీలు నెరవేరలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల శాతం పెంచడానికి కేసీఆర్ కిట్లను అందజేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ప్రతి నిరుపేద రోగికి సకాలంలో మెరుగైన వైద్యసేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కొత్తగా రూ.45 కోట్లతో ప్రతిపాదనలు..! పరకాల సివిల్ ఆస్పత్రిని 250 పడకలు దవఖానాగా మార్చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరాలని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే 250 పడకల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. గతంలో రెండు సార్లు.. పెరుగుతున్న రోగుల సంఖ్యతో పాటు శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో 100 పడకల ఆస్పత్రి చేయాలంటూ 2012 సంవత్సరంలో ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సారథ్యంలోని అప్పటి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ రూ.5కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలకు తీర్మానం చేయగా 2015 సంవత్సరంలో ప్రస్తుత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ.23 కోట్లతో మరో విడతగా ప్రతిపాదనలు చేయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రూ.1.50 కోట్లతో మొదటి అంతస్తు భవన నిర్మాణపు పనులకు మంజూరు ఇచ్చిన భవన పనులు జరుగలేదు. మూడో విడతగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 250 పడకల ఆస్పత్రి కోసం రూ.45కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ను కోరనున్నట్లు తెలిసింది. -
సేవాభావంతో వైద్యవృత్తిలో రాణించగలరు
– వైద్యవిధాన పరిషత్ కమిషనర్ బి.కే.నాయక్ బద్వేలు అర్బన్: వైద్య సేవలు అందించినంతమాత్రాన సరిపోదని వైద్యులు సేవాభావం ఉన్నప్పుడే వైద్య వృత్తిలో రాణించగలుగుతారని ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ బికే.నాయక్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని లేబర్‌వార్డు, జనరల్‌వార్డు, ఐపీ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి మంజూరైన వార్మర్ (చిన్న పిల్లలను భద్రపరిచేయంత్రం)లు ఏసీ గదిలో ఉంచకుండా పక్కన ఉంచడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు వెచ్చి చి కొనుగోలు చేసిన యంత్రాలను నిరుపయోగంగా పడేసి ఏసీని మీరు ఉపయోగించుకుంటున్నారా అని మండిపడ్డారు. అలాగే నెలవారీ కాన్పుల సంఖ్య తక్కువగా ఉండడంతో గైనకాలజిస్ట్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఐపీవార్డులో జ్వరం, విరేచనాలతో బాధపడుతున్న చిన్నారిని స్వయంగా పరిశీలించి జాగ్రత్తగా సేవలందించాలని కోరారు. అలాగే లేబర్‌వార్డులో ఉన్న గర్బిణీని కూడా పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. అలాగే మెడాల్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలలో సాధ్యమైనంత వరకు రోగులకు వీలైనన్ని పరీక్షలు చేయించాలని ఎందుకంటే ఒక్క పరీక్షకైనా ప్రభుత్వం రూ.230లు చెల్లిస్తుందని అలాంటపుడు పేదలకు మిగతా పరీక్షలుకూడా చేయించడం ద్వారా వారికి సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్ఎస్) డాక్టర్ పి.జయరాజన్ , ఏవో మహబూబ్‌ఖాన్, డిప్యూటి సివిల్ సర్జన్ డాక్టర్ ఎన్.మల్లేశ్వరి , గైనకాలజిస్ట్ డాక్టర్దుర్గా భవాణి, వైద్యాధికారి డాక్టర్ శిరీష, జనరల్ సర్జన్ డాక్టర్ గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.