లక్కీ చాన్స్!
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న, సాగు భూములుగా వినియోగించుకుంటున్న వారు.. సదరు స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే పలు మార్లు ఈ వెసులుబాటు కల్పించినప్పటికీ.. మరోమారు అవకాశమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఆక్రమిత స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నాలు సాగించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసి సఫలీకృతమైంది. గతంలోనే జీవో.నెం 59 ద్వారా ఆక్రమిత నివాస గృహాల స్థలాలకు సాధారణ మార్కెట్ ధర ప్రకారం లబ్ధిదారుల పేరుమీదనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు.
అయినప్పటికీ ఇంకా చాలా మంది ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులు దీన్ని సద్వినియోగం చేసుకోలేదని నిర్ధారించుకున్న ప్రభుత్వం మరోమారు అవకాశమిచ్చింది. అంతే కాకుండా పలు కారణాలతో గతంలో తిరస్కరించిన దరఖాస్తులకు కూడా ఈ విడతలో పరిష్కరించాలని నిర్ణయించింది. గతంలో ఆఫ్లైన్లో సాగిన ఈ ప్రక్రియ ఈ సారి ఆన్లైన్లోనే చేపట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించడానికి గాను మొదటిసారిగా జీవో.166ను విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం 200 చదరపు గజాల విస్తీర్ణం మేర రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించారు. ఈ జీవో కింద వచ్చిన దరఖాస్తులలో అర్హత ఉంటే వాటిని జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఆమోదం మేరకు ఆక్రమణదారులకే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. కాగా ప్రస్తుత క్రమబద్ధీకరణ ప్రక్రియను భూపరిపాలన చీ ఫ్ కమిషనర్ పర్యవేక్షణలో కొనసాగుతోందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
జీవో.179 విడుదల...
ప్రభుత్వ స్థలాల, భూముల ఆక్రమణకు సంబంధించి క్రమబద్ధీకరణకు గాను ప్రభుత్వం తాజాగా జీవో.179 విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ మరోమారు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి 20015లో జీవో.58, 59లను జారీచేశారు. జీవో 58 కింద 125 గజాలలోపు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి ఉచితంగా రెగ్యులరైజ్ చేశారు. జీవోనెం.59 ప్రకారం 125 గజాలకు పైగా ఆక్రమించుకున్న వారికి మార్కెట్ ధరపై (నామినల్ రేట్) ప్రకారం క్రమబద్ధీకరించారు. ఆక్రమించుకున్న స్థలంలో శాశ్వత కట్టడం (ఇళ్లు నిర్మించుకొని) ఉంటేనే రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించారు.
ఖాళీ స్థలాలు ఉన్న పక్షంలో క్రమబద్ధీకరణకు అనర్హులని షరతు పెట్టారు. దీంతో అప్పట్లో ఈ అవకాశాన్ని చాలా మంది వినియోగించుకున్నా..ఇంకా చట్టబద్ధత లేని ఆక్రమిత స్థలాలు ఉన్నట్లు అధికారులు నివేదించారు. ముఖ్యంగా మండల కేంద్రాల్లో ఈ ఆక్రమణలు అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారుల సూచనల మేరకు మరోమారు ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లను నిర్మించుకున్న వారికి, వేయి చదరపు గజాల కంటే ఎక్కువ ప్రభుత్వ భూములను అనధికారికంగా కబ్జాలో ఉంచుకున్నవారికి ఆ భూములను ప్రభుత్వ నిబంధనల ప్రకారం హక్కులు పొందేందుకు గాను తాజాగా జీవోనెం.179ను జారీచేశారు.
ఆక్రమణ స్థలం మార్కెట్ రేటు ప్రకారం ఎంత చెల్లించాలనేది నిర్ణయిస్తారు. రెండు, మూడు వాయిదాల్లో ఈ సొమ్మును చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు. గతంలో తిరస్కరించిన, పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు ఈ దఫా మోక్షం కలిగించాలని ప్రభుత్వం సూచించింది. ఈనెల 15వతేదీ నుంచి ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. వచ్చేనెల 15వతేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలోగా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు.