govt schools closing
-
రాష్ట్రంలో పాఠశాలలను మూసివేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే దళితులు, బడుగులు, బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరమవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సగం పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతోందని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే తీవ్రంగా నష్టపోతారని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గడానికి కారణాలను గుర్తించి చక్కదిద్దాలని, అలాకాకుండా పాఠశాలలను మూసివేస్తే తరువాతి తరం విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఉపాధ్యాయ ఖాళీ లను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగుల్లో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు దాదాపు 6 లక్షల మంది ఉన్నారని చెప్పారు. స్కూళ్ల మూసివేతతో వీరందరికీ ఉద్యోగావకాశాలు లేకుండా పోతాయని తెలిపారు. -
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో..
విలీనం పేరుతో విద్యాశాఖ అనుసరిస్తున్న విధానాలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఏటా పదుల సంఖ్యలో పాఠశాలలు మూతపడుతూనే ఉన్నాయి. దీంతో నిరుపేద కుటుంబాలకు చెందిన ఎందరో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడానికి వేలకు వేల రూపాయలు ఖర్చు చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా నలిగిపోతున్నారు. కామారెడ్డి మండలం ఇల్చిపూర్ గ్రామానికి చెందిన రాకేష్, అఖిల, రమ్య, రోహిత్‌లతో పాటు మరికొందరు గతంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివేవారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో గతేడాది గ్రామంలోని బడిని మూసేసి, కిలోమీటరు దూరంలో అడ్లూర్‌లో ఉన్న పాఠశాలలో విలీనం చేశారు. మండలంలోని కొటాల్పల్లి ప్రాథమిక పాఠశాలలో 12 మంది విద్యార్థులుండేవారు. ఈ బడినీ మూసేసి, లింగాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. దీంతో పిల్లలు రోజూ కిలోమీటరుకు పైగా నడిచి బడికి వెళ్లడానికి ఇబ్బందిపడుతున్నారు. సాక్షి, కామారెడ్డి: జిల్లాలో 696 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 130 ప్రాథమికోన్నత పాఠశాలలు, 184 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఏడాదికో 13 పాఠశాలల చొప్పున రెండేళ్లలో 26 ప్రభుత్వ పాఠశాలలను విలీనం పేరిట అధికారులు మూసివేశారు. అక్కడ పనిచేస్తున్న టీచర్లను పక్క గ్రామాల కు డిప్యూటేషన్‌పై పంపించా రు. మద్నూర్ మండలంలోని ఏలేగావ్ ఉర్దూ మీడియం పాఠశాల, పెద్దకొడప్గల్ మండలంలోని తుబ్దల్, మాన్సింగ్ తండా, బిచ్కుంద మండలంలోని మెక్కా, బీర్కూర్ మండలంలోని బీసీ కాలనీ పాఠశాల, నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పాస్పల్లి ఉర్దూ మీడియం, కట్టకింది తండా పాఠశాల, బాన్సువాడ మండలంలోని రాంపూర్ గడ్డ, పిట్లం మండలంలోని సీతారాం తండా, తిమ్మానగర తండా, నిజాంసాగర్ మండలంలోని తుర్కేపల్లి, మారపల్లి పాఠశాలలు, నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూరు ఉర్దూ మీడియం పాఠశాలలు ఏడాది క్రితమే మూతపడ్డాయి. ఎల్లారెడ్డిలోని హరిజనవాడ, లింగంపేట మండలంలోని రామాయిపల్లి, నెహ్రూనగర్, శెట్పల్లి చెరువు ముందరి తండా, ఆగపల్లి తండా పాఠశాలలు, గాంధారి మండలంలోని బొప్పాజీవాడి, పల్లెల మడుగుతండా, భిక్కనూరులోని కుమ్మరివాడ, కామారెడ్డి పరిధిలోని ఇల్చిపూర్, తిమ్మక్‌పల్లి, ఎస్ఆర్ఎన్సీ, బీఆర్ రోడ్‌లోని పాఠశాలలు, మాచారెడ్డిలోని ఉర్దూ మీడియం పాఠశాలలను అధికారులు ఈ ఏడాది మూసివేశారు. చదువుకు ‘దూరం’ విలీనం పేరిట జిల్లాలో రెండేళ్లలో 26 బడులను మూసివేశారు. దీంతో పేదల చదువుకు ‘దూరం’ భారమవుతోంది. సర్కారు బడి లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు గానీ, సమీప ప్రాంతాలలోని ప్రభుత్వ బడులకుగానీ వెళ్లాల్సి వస్తోంది. లింగంపేట మండలంలోని నెహ్రూనగర్ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులే ఉండడంతో ఈ పాఠశాలను బాలికల ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. రామాయిపల్లి ప్రాథమిక పాఠశాల గతేడాది మూతబడింది. ఆ సమయంలో నలుగురు విద్యార్థులున్నారు. వీరు అయిలాపూర్, లింగంపేట గ్రామాల పాఠశాలలకు వెళ్తున్నారు. ఆగపల్లితండా ప్రాథమిక పాఠశాల మూతపడకముందు 15 మంది విద్యార్థులుండేవారు. వారు పర్మళ్లకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. శెట్పల్లి చెరువు ముందు తండా బడిలోని ఐదుగురు విద్యార్థులు శెట్పల్లి పాఠశాలకు వెళ్తున్నారు. ఇలా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడానికీ ఇబ్బంది అవుతుండడంతో చాలామంది చదువు మానేస్తున్నారు. కొంత ఆర్థిక స్థోమత ఉన్నవారు మాత్రమే స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలలో చేర్పిస్తున్నారు. మిగిలినవారు బడిబయటి పిల్లలుగా మిగిలిపోతున్నారు. పక్క ఊరి బడికి పోతున్నం కామారెడ్డి రూరల్: నేను రెండో తరగతి చదువుకుంటున్నాను. మా ఊళ్లో పాఠశాల లేదు. పక్కనే ఉన్న లింగాయిపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లివస్తున్నాం. రోజూ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇబ్బందిగా ఉంది. మా ఊళ్లోనే బడి నడపాలి. – బచ్చగారి యోగి, విద్యార్థి, కొటాల్పల్లి కష్టంగా ఉంది కామారెడ్డి రూరల్: పిల్లలు తక్కువగా ఉన్నరని బడిని మూసేసిన్రు. అప్పట్లో 12 మంది పిల్లలు చదువుకునేటోళ్లు. ఇప్పుడు మా ఊరినుంచి వేరే ఊరికివెళ్లి చదువుకునే పిల్లల సంఖ్య పెరిగింది. అయినా బడి తెరిపిస్తలేరు. బడి తెరిపియ్యాలి. – లావణ్య, కొటాల్పల్లి వేరే పాఠశాలకు వెళ్తున్న.. నిజాంసాగర్: నేను ఏడో తరగతి చదువుతున్నాను. మా ఊరి స్కూలు గతంలో మూతపడింది. దీంతో నేను తుంకిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నా. ఊరిలో బడి లేకపోవడంతో మా స్నేహితులు కొందరు బడి మానేశారు. – రాజ్‌కుమార్, విద్యార్థి, తుర్కపల్లి పిల్లల చదువులు ఆగమైనై.. నిజాంసాగర్: మా ఊళ్లోని పాఠశాల మూతపడడంతో పిల్లల చదువులు ఆగమైనై.. ప్రభుత్వ బడితోపాటు అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తీసేసి న్రు. దీంతో చాలామంది పిల్లలు చదువు మానేసిన్రు. ఊళ్లో బడి నడిపిస్తే మంచిగుంటది. – పొచయ్య, తుర్కపల్లి గ్రామస్తుడు నడుచుకుంటూ వెళ్తున్నాం.. లింగంపేట: మా గ్రామంలో బడి లేదు. రోజూ పుస్తకాలను మోసుకుంటూ కిలోమీటరున్నర దూరంలో ఉన్న శెట్పల్లి బడికి వెళ్లాల్సి వస్తోంది. దారిలో అక్కడక్కడ కుక్కలు, పశువులు ఉంటాయి. భయమేస్తుంది. తండాలోనే బడి నడపాలి. – అరవింద్, శెట్పల్లి చెరువుముందు తండా తండాలోనే బడి నడపాలి.. లింగంపేట: తండాలో 15 మంది పిల్లలున్నరు. బడి లేకపోవడంతో శెట్పల్లి, లింగంపేటలకు వెళ్తున్నారు. పొద్దు న 8గంటలకే బయలుదేరుతరు.. సాయంత్రం ఐదయితది. నడవడానికే గంట పడుత ది. వారు వచ్చేంతవరకు భయంగ ఉంటది. – సావిత్రి, శెట్పల్లి చెరువుముందు తండా ఉదయాన్నే వెళ్తున్నా.. నాగిరెడ్డిపేట: మా ఊరిలోని ఉర్దూ మీడియం స్కూల్‌ను మూసేశారు. దీంతో ఎల్లారెడ్డిలోని ఉర్దూమీడియం స్కూల్‌కు వెళ్తున్నా. ఉదయం 7 గంటలకే బస్సులో వెళ్తాను. ఇంటికి చేరేసరికి రాత్రి 7 గంటలు దాటుతోంది. – మిజ్న, 8వ తరగతి విద్యార్థిని ఆత్మకూర్ -
114 స్కూళ్లకు మంగళం..?
కరీంనగర్‌ఎడ్యుకేషన్: అంతా ఊహించినట్లే జరుగుతోంది.. పాఠశాలలను హేతుబద్ధీకరణ చేయాలనే ప్రభుత్వం నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. తద్వారా గ్రామీణ పేద పిల్లలకు విద్య అందని ద్రాక్షగా మారనుంది. స్కూళ్లు మూతపడి మిగులుబాటుగా మారే ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళం కానుంది. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ దిశగా కృషి చేయకుండా విద్యార్థులు రావడం లేదన్న సాకుతో రేషనలైజేషన్‌లో పాఠశాలలను మూసి ప్రభుత్వ విద్యకు మంగళం పాడేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలలు కనుమరుగు కానుండగా, ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లోకి, వేరే ప్రభుత్వ శాఖల్లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా జిల్లా విద్యాశాఖ అధికారులతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈ నెల 11న డీఈవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ గురించి వివరిస్తూనే ఉన్న ఫలంగా సమాచారాన్ని పంపించాలని కోరడంతో మళ్లీ పాఠశాలల హేతుబద్ధీకరణ అంశం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేస్తూ తక్కువగా ఉన్న పాఠశాలల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉంటాయో.. ఎన్ని మూతపడుతాయో తెలియని గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరుగా ఉత్తర్వులు జారీ అయితే జిల్లాలో 114 పాఠశాలలు మూతబడనున్నాయి. బడిబాట కార్యక్రమం ముగిసేలోగా పక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావించడంతో జూన్ 19లోగా పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయి ఒకే గ్రామంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అదే గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 650 ఉన్నాయి. 37,773 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పదిలోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 60 వరకు ఉన్నట్లు యుడైస్ నివేదికలో వెల్లడయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 20లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు 16 వరకు ఉన్నాయి. 30లోపు విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలు 16 నుంచి 20 వరకు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలే చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం హేతుబద్ధీకరణ ఉత్తర్వులు జారీచేస్తే జిల్లాలో 114 పాఠశాలలు మూతపడుతాయి. యూపీఎస్‌లలో సైతం 30మంది లోపు ఉన్న వాటిని సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్న నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని బాలికలు సమీప ఉన్నత పాఠశాలల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపక చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దీంతో బాలికల విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో వేసవి సెలవుల్లో రేషనలైజేషన్ పేరిట చేసిన సంస్కరణల్లో ఇప్పటికే జిల్లాలో 850 మంది ఎస్జీటీలు మిగులుగా ఉండి డీఈఓ ఆధీనంలో ఉండడంతో వారిని జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ సర్దుబాటు చేసి ఈ విద్యా సంవత్సరం మమ అనిపించారు. తాజాగా మళ్లీ 114 స్కూళ్లు మూతపడితే మిగులుబాటుగా ఉండే ఎస్జీటీలను ఎలా సర్దుబాటు చేస్తారో ప్రభుత్వమే తెల్చాల్సి ఉంది. నిరుద్యోగుల ఆశలు ఆడియాశలే... టీచర్ పోస్టు కొట్టాలనుకుంటున్న నిరుద్యోగుల్లో బడుల హేతుబద్ధీకరణ నిర్ణయం నిరాశ వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకొని టీచర్ జాబ్‌కొట్టాలనే టీఆర్టీ అభ్యర్థుల భవిష్యుత్ ప్రశ్నార్థకమైంది. రేషనలేజేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత చాలామంది ఉపాధ్యాయులు మిగులే పరిస్థితి ఉంటుందనే భావన అందరిలో ఉండడంతో టీఆర్టీ అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఉత్తర్వులు అందలేదు... ఇటీవల జరిగిన వీడియో కాన్పరేన్స్లో పాఠశాలల హేతుబద్ధీకరణ విషయంపై చర్చ జరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలు అందాల్సి ఉంది. గతంలో సూచించిన విధంగా జిల్లాలో విద్యార్థుల, పాఠశాలల పరిస్థితిని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు అందజేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామనే భరోసాను తల్లిదండ్రులకు కల్పించాల్సి ఉంది. అందుకు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా సహకరిస్తే సాధ్యమవుతుంది. రేషనలైజేషన్ జీవో అందాక ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – వెంకటేశ్వర్లు, డీఈవో ప్రభుత్వ నిర్ణయం గర్హనీయం సంస్కరణల పేరిట విద్యారంగాన్ని అథోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగం నుంచి తప్పుకునేందుకే తహతహలాడుతోంది. గ్రామీణ పేద విద్యార్థుల కోసం విద్యాహక్కు చట్టంలో ఉన్న నిబంధనలను తప్పకుండా పాటించాల్సిన ప్రభుత్వం చట్టానికి తూట్లు పొడుస్తోంది. తరగతి గదికో ఉపాధ్యాయుని నియమించి, బోధన, బోధనేతర, పర్యవేక్షణ సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం విద్యార్థులు లేరని సాకుతో బడులను మూసివేయడం మంచి పరిణామం కాదు – గవ్వ వంశీధర్‌రెడ్డి, ఏఐఎస్బీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకం ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ఎస్టీయూ వ్యతిరేకం. విద్యాహక్కు చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. బడుల మూసివేత వల్ల పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకోంది. రేషనలైజేషన్ ప్రక్రియను నిలిపివేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసి ప్రభుత్వ బడులను సంస్కరించాల్సిందిపోయి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా వ్యవహరించడం బాధాకరం. – కటుకం రమేశ్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పేద విద్యార్థులకు పెనుశాపం... పాఠశాలల మూసివేత పేద విద్యార్థులకు పెనుశాపంగా మారనుంది. స్వరాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంగా ఉన్నామని ప్రకటించిన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. తక్షణమే రేషనలైజేషన్ ప్రక్రియను ఉపసంహరించుకోవాలి. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. – కరివేద మహిపాల్‌రెడ్డి, ఎస్జీటీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి -
పాఠశాలలు మూసివేస్తే ప్రజా ఉద్యమమే..
విజయనగరం: ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ హెచ్చరించింది. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ సంయుక్త నిర్వహణలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలలను మూసివేయడం తగదన్నారు. అరకొరగా పాఠ్యపుస్తకాలు సరఫరా చేయడం, పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలు వంటి కారణాలు చూస్తే ప్రభుత్వం కావాలనే పాఠశాల విద్యను నాశనం చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. గ్రామ సభల ఆమోదం లేకుండా ఏ ఒక్క ఆవాస ప్రాంతంలో కూడా పాఠశాలలను తొలగించరాదన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ జిల్లా కన్వీనర్ జేసీ రాజు, కో-కన్వీనర్ కొల్లి సత్యం, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు, అదనపు కార్యదర్శి సీహెచ్వీఎస్ఎన్ మూర్తి, సీహెచ్ వెంకటరమణ, కె.శ్రీనివాసరావు, ఆర్.చంద్రశేఖర్ నాయుడు, సూర్యారావు, చినసత్యం, అప్పారావు, నాగేశ్వరరావు, పైడితల్లి, తదితరులు పాల్గొన్నారు.