సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే దళితులు, బడుగులు, బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరమవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సగం పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతోందని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే తీవ్రంగా నష్టపోతారని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గడానికి కారణాలను గుర్తించి చక్కదిద్దాలని, అలాకాకుండా పాఠశాలలను మూసివేస్తే తరువాతి తరం విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఉపాధ్యాయ ఖాళీ లను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగుల్లో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు దాదాపు 6 లక్షల మంది ఉన్నారని చెప్పారు. స్కూళ్ల మూసివేతతో వీరందరికీ ఉద్యోగావకాశాలు లేకుండా పోతాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment