విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో.. | Govt Schools Are Closing In Kamareddy By Showing Students Is Low | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో..

Published Wed, Oct 2 2019 9:05 AM | Last Updated on Wed, Oct 2 2019 9:05 AM

Govt Schools Are Closing In Kamareddy By Showing Students Is Low - Sakshi

కామారెడ్డి పట్టణంలో మూతబడిన పాఠశాల

విలీనం పేరుతో విద్యాశాఖ అనుసరిస్తున్న విధానాలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఏటా పదుల సంఖ్యలో పాఠశాలలు మూతపడుతూనే ఉన్నాయి. దీంతో నిరుపేద కుటుంబాలకు చెందిన ఎందరో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. మరోవైపు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించడానికి వేలకు వేల రూపాయలు ఖర్చు చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా నలిగిపోతున్నారు.

కామారెడ్డి మండలం ఇల్చిపూర్‌ గ్రామానికి చెందిన రాకేష్, అఖిల, రమ్య, రోహిత్‌లతో పాటు మరికొందరు గతంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివేవారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో గతేడాది గ్రామంలోని బడిని మూసేసి, కిలోమీటరు దూరంలో అడ్లూర్‌లో ఉన్న పాఠశాలలో విలీనం చేశారు. మండలంలోని కొటాల్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో 12 మంది విద్యార్థులుండేవారు. ఈ బడినీ మూసేసి, లింగాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. దీంతో పిల్లలు రోజూ కిలోమీటరుకు పైగా నడిచి బడికి వెళ్లడానికి ఇబ్బందిపడుతున్నారు.

సాక్షి, కామారెడ్డి: జిల్లాలో 696 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 130 ప్రాథమికోన్నత పాఠశాలలు, 184 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఏడాదికో 13 పాఠశాలల చొప్పున రెండేళ్లలో 26 ప్రభుత్వ పాఠశాలలను విలీనం పేరిట అధికారులు మూసివేశారు. అక్కడ పనిచేస్తున్న టీచర్లను పక్క గ్రామాల కు డిప్యూటేషన్‌పై పంపించా రు. మద్నూర్‌ మండలంలోని ఏలేగావ్‌ ఉర్దూ మీడియం పాఠశాల, పెద్దకొడప్‌గల్‌ మండలంలోని తుబ్దల్, మాన్‌సింగ్‌ తండా, బిచ్కుంద మండలంలోని మెక్కా, బీర్కూర్‌ మండలంలోని బీసీ కాలనీ పాఠశాల, నస్రుల్లాబాద్‌ మండలంలోని బొప్పాస్‌పల్లి ఉర్దూ మీడియం, కట్టకింది తండా పాఠశాల, బాన్సువాడ మండలంలోని రాంపూర్‌ గడ్డ, పిట్లం మండలంలోని సీతారాం తండా, తిమ్మానగర తండా, నిజాంసాగర్‌ మండలంలోని తుర్కేపల్లి, మారపల్లి పాఠశాలలు, నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూరు ఉర్దూ మీడియం పాఠశాలలు ఏడాది క్రితమే మూతపడ్డాయి. ఎల్లారెడ్డిలోని హరిజనవాడ, లింగంపేట మండలంలోని రామాయిపల్లి, నెహ్రూనగర్, శెట్పల్లి చెరువు ముందరి తండా, ఆగపల్లి తండా పాఠశాలలు, గాంధారి మండలంలోని బొప్పాజీవాడి, పల్లెల మడుగుతండా, భిక్కనూరులోని కుమ్మరివాడ, కామారెడ్డి పరిధిలోని ఇల్చిపూర్, తిమ్మక్‌పల్లి, ఎస్‌ఆర్‌ఎన్‌సీ, బీఆర్‌ రోడ్‌లోని పాఠశాలలు, మాచారెడ్డిలోని ఉర్దూ మీడియం పాఠశాలలను అధికారులు ఈ ఏడాది మూసివేశారు.  

చదువుకు ‘దూరం’ 
విలీనం పేరిట జిల్లాలో రెండేళ్లలో 26 బడులను మూసివేశారు. దీంతో పేదల చదువుకు ‘దూరం’ భారమవుతోంది. సర్కారు బడి లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు గానీ, సమీప ప్రాంతాలలోని ప్రభుత్వ బడులకుగానీ వెళ్లాల్సి వస్తోంది. లింగంపేట మండలంలోని నెహ్రూనగర్‌ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులే ఉండడంతో ఈ పాఠశాలను బాలికల ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. రామాయిపల్లి ప్రాథమిక పాఠశాల గతేడాది మూతబడింది. ఆ సమయంలో నలుగురు విద్యార్థులున్నారు. వీరు అయిలాపూర్, లింగంపేట గ్రామాల పాఠశాలలకు వెళ్తున్నారు. ఆగపల్లితండా ప్రాథమిక పాఠశాల మూతపడకముందు 15 మంది విద్యార్థులుండేవారు. వారు పర్మళ్లకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. శెట్పల్లి చెరువు ముందు తండా బడిలోని ఐదుగురు విద్యార్థులు శెట్పల్లి పాఠశాలకు వెళ్తున్నారు. ఇలా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడానికీ ఇబ్బంది అవుతుండడంతో చాలామంది చదువు మానేస్తున్నారు. కొంత ఆర్థిక స్థోమత ఉన్నవారు మాత్రమే స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ పాఠశాలలలో చేర్పిస్తున్నారు. మిగిలినవారు బడిబయటి పిల్లలుగా మిగిలిపోతున్నారు.

పక్క ఊరి బడికి పోతున్నం 
కామారెడ్డి రూరల్‌: నేను రెండో తరగతి చదువుకుంటున్నాను. మా ఊళ్లో పాఠశాల లేదు. పక్కనే ఉన్న లింగాయిపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లివస్తున్నాం. రోజూ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇబ్బందిగా ఉంది. మా ఊళ్లోనే బడి నడపాలి.
 – బచ్చగారి యోగి, విద్యార్థి, కొటాల్‌పల్లి  

కష్టంగా ఉంది 
కామారెడ్డి రూరల్‌: పిల్లలు తక్కువగా ఉన్నరని బడిని  మూసేసిన్రు. అప్పట్లో 12 మంది పిల్లలు చదువుకునేటోళ్లు. ఇప్పుడు మా ఊరినుంచి వేరే ఊరికివెళ్లి చదువుకునే పిల్లల సంఖ్య పెరిగింది. అయినా బడి తెరిపిస్తలేరు. బడి తెరిపియ్యాలి.          
 – లావణ్య, కొటాల్‌పల్లి  

వేరే పాఠశాలకు వెళ్తున్న.. 
నిజాంసాగర్‌: నేను ఏడో తరగతి చదువుతున్నాను. మా ఊరి స్కూలు గతంలో మూతపడింది. దీంతో నేను తుంకిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నా. ఊరిలో బడి లేకపోవడంతో మా స్నేహితులు కొందరు బడి మానేశారు.  
– రాజ్‌కుమార్, విద్యార్థి, తుర్కపల్లి 

పిల్లల చదువులు ఆగమైనై.. 
నిజాంసాగర్‌: మా ఊళ్లోని పాఠశాల మూతపడడంతో పిల్లల చదువులు ఆగమైనై.. ప్రభుత్వ బడితోపాటు అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా తీసేసి న్రు. దీంతో చాలామంది పిల్లలు చదువు మానేసిన్రు. ఊళ్లో బడి నడిపిస్తే మంచిగుంటది.    
– పొచయ్య, తుర్కపల్లి గ్రామస్తుడు 

నడుచుకుంటూ వెళ్తున్నాం..
లింగంపేట: మా గ్రామంలో బడి లేదు. రోజూ పుస్తకాలను మోసుకుంటూ కిలోమీటరున్నర దూరంలో ఉన్న శెట్పల్లి బడికి వెళ్లాల్సి వస్తోంది. దారిలో అక్కడక్కడ కుక్కలు, పశువులు ఉంటాయి. భయమేస్తుంది. తండాలోనే బడి నడపాలి. 
– అరవింద్, శెట్పల్లి చెరువుముందు తండా  

తండాలోనే బడి నడపాలి.. 
లింగంపేట: తండాలో 15 మంది పిల్లలున్నరు. బడి లేకపోవడంతో శెట్పల్లి, లింగంపేటలకు వెళ్తున్నారు. పొద్దు న 8గంటలకే బయలుదేరుతరు.. సాయంత్రం ఐదయితది. నడవడానికే గంట పడుత ది. వారు వచ్చేంతవరకు భయంగ ఉంటది.
– సావిత్రి, శెట్పల్లి చెరువుముందు తండా

ఉదయాన్నే వెళ్తున్నా.. 
నాగిరెడ్డిపేట: మా ఊరిలోని ఉర్దూ మీడియం స్కూల్‌ను మూసేశారు. దీంతో ఎల్లారెడ్డిలోని ఉర్దూమీడియం స్కూల్‌కు వెళ్తున్నా. ఉదయం 7 గంటలకే బస్సులో వెళ్తాను. ఇంటికి చేరేసరికి రాత్రి 7 గంటలు దాటుతోంది. 
– మిజ్న, 8వ తరగతి విద్యార్థిని ఆత్మకూర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement