పాలకుల నిర్లక్ష్యం రైతుకు శాపం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పాలకులు పట్టించుకోరు.. అధికారులు స్పందించరు. రెక్కలు ముక్కలు చేసుకుని సాగుచేసిన పంటలకు సరిగ్గా నీరందక కళ్లముందే ఎండిపోతున్నాయి. మరి కొన్నిచోట్ల కొనఊపిరితో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ.. గొడవలకు దిగుతున్నారు. జిల్లాలో సోమశిల, సంగం, తెలుగుగంగ, కండలేరు జలాశయాల కింద కాలువలు ఉన్నాయి. ఆయా రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాలి.
అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన కాలువలు ఆక్రమణలకు గురికావటం.. పూడిక పేరుకుపోవటం.. గుర్రపుడెక్కతో నిండిపోవటంతో చివరి ఆయకట్టుకు నీరందటం లేదు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా 27వేల ఎకరాల్లో వరిపంట ఎండిపోతుంది. మరో లక్ష ఎకరాల పంట పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. తెలుగుగంగ, కండలేరు జలాశయాల నీటి ఆధారంగా గూడూరు, చిల్లకూరు మండలాలకు చెందిన రైతులు వరిని సాగుచేస్తున్నారు. కండలేరు నుంచి వచ్చే నీరు పొదలకూరు, మనుబోలు మీదుగా కాలువల ద్వారా గూడూరు పట్టణ ం, పురిటిపాళెం, పోటుపాళెంతో పాటు, చిల్లకూరు మండలంలోని నాంచారమ్మపేట, తిప్పగుంటపాళెం పరిధిలోని భూములకు నీరు చేరుతుంటుంది. అయితే మనుబోలు మండలం బద్వేలు వద్ద ఉన్న వెంకన్నపాళెం సప్లయ్ చానల్ వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కాలువ పూడిక పేరుకుపోయి నీరు రాని పరిస్థితి. అదేవిధంగా వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి పరిధిలోని ప్రధాన కాలువలకు అటవీ అనుమతులు లేకపోవటంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
దుస్థితిలో కావలి కాలువ
ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో సుమారు 70 వేల ఎకరాలకు సోమశిల రిజర్వాయర్ నుంచి కావలి కాలువ ద్వారా సాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. అయితే కాలువ అస్తవ్యస్తంగా ఉండటంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు.
ఇకపోతే కావలి నియోజకవర్గానికి ప్రధాన కాలువ కూడా ఇదే. ఐఏబీ సమావేశంలో 75వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అందులో భాగంగా కావలి కాలువ ద్వారా 54 చెరువులకు నీరందాల్సి ఉంది. 1970లో 600 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన కావలి కాలువ పూడిక తీయకపోవటం.. వెడల్పు చేయకపోవటంతో ప్రస్తుతం 350 క్యూసెక్కుల నీరు మాత్రం వస్తోంది. ఫలితంగా పూర్తిస్థాయిలో పంటలకు నీరందడం లేదు. దీంతో 10వేల ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయి. కనిగిరి రిజర్వాయర్ పరిధిలో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి. కాలువ పొడవునా గుర్రపుడెక్కతో నిండిపోవటంతో విడవలూరు, కొడవలూరు, అల్లూరు రైతులకు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూళ్లూరుపేట పరిధిలోని నెర్రికాలువ ద్వారా తడ, దొరవారిసత్రం, సూళ్లూరుపేట పరిధిలోని 15 చెరువులకు నీరందించాల్సి ఉంది. అయితే కాలువ మరమ్మతులకు నోచుకోకపోవటం, ఆక్రమణలకు గురికావటంతో పంటలకు నీరందడం లేదు.
నాయుడుపేట పరిధిలోని విన్నమాల కాలువ పూర్తిగా పూడిపోయింది. దీంతో 15వేల ఎకరాలు బీడుభూములుగా మారాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవటంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. పాలకులు, అధికారులపై నమ్మకం లేక మరికొందరు రైతులు వేలాది ఎకరాలను బీళ్లుపెట్టారు. ఈవిషయంపై పాలకులు, అధికారులు స్పందించి కాలువల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి పంటలకు నీరందించాల్సిన అవసరం ఉంది.