Gowri Lakesh murder
-
ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకు పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యత తగ్గిపోతోంది. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. పత్రికా స్వేచ్ఛలో 180 దేశాలకుగాను గతేడాది భారత్‌కు 136వ స్థానం రాగా, ఈ ఏడాది 138వ స్థానం వచ్చింది. పత్రికా స్వేచ్ఛా సూచికను ‘రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్’ రూపొందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. 1992 రెండు నుంచి ఇప్పటి వరకు 64 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యలకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది స్థానిక రిపోర్టర్లే ఉన్నారు. స్థానికంగా అధికారంలో ఉన్న వ్యక్తి ఆగడాలకే వీరులో ఎక్కువ మంది బలయ్యారు. 2017 నుంచి హిందూత్వ శక్తుల దాడులకు జర్నలిస్టులు బలవుతున్నారు. కర్ణాటకలో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య అలాంటిదే. ర్యాడికల్ హిందూత్వ శక్తులే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ఆరెస్సెస్‌ను అంత ఘాటుగా విమర్శించి ఉండకపోతే ఆమె ఈ రోజున బతికి ఉండేదంటూ ఓ బీజేపీ శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్య ఇక్కడ గమనార్హం. 2017లో ఐదుగురు జర్నలిస్టులు హత్యలకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో 35 ఏళ్ల జర్నలిస్ట్ సందీప్ శర్మను డంపర్ యాక్సిడెంట్లో చంపేశారు. ఇసుక మాఫియాతో కుమ్ముక్కయిన పోలీసు అధికారి గురించి వార్త రాసినందుకు ఆయన బలయ్యారు. హత్య జరిగిన మరుసటి రోజే కేసును సిబీఐకి అప్పగిస్తున్నామని మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించినప్పటికీ ఇంతవరకు సీబీఐ అధికారులు కేసును టేకప్ చేయలేదు. ఇదే విషయమై వారిని అడిగితే తమకు ఎవరూ కేసును అప్పగించలేదని వారు తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించేవరకు ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును దర్యాప్తు చేస్తుందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 15 మంది జర్నలిస్టులు హత్యలు గురికాగా, ఏ ఒక్క కేసులో ఎవరికి శిక్ష పడలేదు. గడచిన దశాబ్దం కాలంలోనే ఏ ఒక్క జర్నలిస్ట్ హత్య కేసులో న్యాయం జరగలేదని అధికారిక వివరాలే తెలియజేస్తున్నాయి. -
అచ్చం.. అలాగే!
దబోల్కర్, కలబురిగి హత్యల తరహాలోనే... సాక్షి, నేషనల్ డెస్క్: ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకు గతంలో జరిగిన హేతువాదులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయుల హత్యోదాంతాలతో పోలిక ఉంది. నరేంద్ర దబోల్కర్: మహారాష్ట్రకు చెందిన దబోల్కర్ వృత్తిరీత్యా వైద్యుడు. రాష్ట్రంలో మూఢనమ్మకాలను పారదోలడానికి మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి పేరిట 1989లో ఓ సంస్థను ప్రారంభించి ప్రజ ల్లో చైతన్యం పెంచడానికి కృషి చేశారు. అభ్యుదయ భావాల వ్యాప్తికి కృషిచేసిన సాధనా మేగజీన్‌కు ఎడిటర్‌గా పనిచేశారు. 2013 ఆగస్టు 20న గుర్తుతెలియని వ్యక్తులు దబోల్కర్‌ను కాల్చి చంపారు. దబోల్కర్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు. ఎంఎం కలబురిగి: వచన సాహిత్యంలో పండితుడైన కలబురిగి హంపిలోని కన్నడ వర్సిటీకి వీసీగా చేశారు. రచయిత, పరిశోధకుడు, హేతువాది అయిన ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానించినందుకు కేసు నమోదైంది. విగ్రహారాధనకు వ్యతిరేకంగా పోరాడారు. 2015 ఆగస్టులో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటికెళ్లి కాల్చి చంపేశారు. గోవింద్ పన్సారే: కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడైన గోవింద్ పన్సారే 2015, ఫిబ్రవరిలో హత్యకు గురయ్యారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు సాయుధులు తుపాకులతో ఆయన, ఆయన భార్యపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఆయన భార్య ప్రాణాలతో బయపటపడినా, గాయాలతో పన్సారే కన్నుమూశారు. వ్యవసాయ కూలీలు, ఆటో రిక్షా యూనియన్లు తదితరాలకు సంబంధించిన సామాజిక ఉద్యమాల్లో పన్సారే క్రియాశీలక పాత్ర పోషించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో టోల్గేట్లు ఎత్తేయాలని పోరాడారు. రాజ్దేవ్ రంజన్: బిహార్‌లో సివాన్ అనే హిందీ దిన పత్రికలో పనిచేస్తున్న రాజ్దేవ్ రంజన్(45)ను 2016 మే 13న కొందరు వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహమ్మద్ షాబుద్దీన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించినందుకే రంజన్ హత్యకు గురయ్యాడని భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.