అచ్చం.. అలాగే! | Comparison with journalists' murder | Sakshi
Sakshi News home page

అచ్చం.. అలాగే!

Published Thu, Sep 7 2017 1:54 AM | Last Updated on Tue, Sep 12 2017 2:04 AM

Comparison with journalists' murder

దబోల్కర్, కలబురిగి హత్యల తరహాలోనే...
సాక్షి, నేషనల్‌ డెస్క్‌: ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యకు గతంలో జరిగిన హేతువాదులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయుల హత్యోదాంతాలతో పోలిక ఉంది.    

నరేంద్ర దబోల్కర్‌: మహారాష్ట్రకు చెందిన దబోల్కర్‌ వృత్తిరీత్యా వైద్యుడు. రాష్ట్రంలో మూఢనమ్మకాలను పారదోలడానికి మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్‌ సమితి పేరిట 1989లో ఓ సంస్థను ప్రారంభించి ప్రజ ల్లో చైతన్యం పెంచడానికి కృషి చేశారు. అభ్యుదయ భావాల వ్యాప్తికి కృషిచేసిన సాధనా మేగజీన్‌కు ఎడిటర్‌గా పనిచేశారు. 2013 ఆగస్టు 20న గుర్తుతెలియని వ్యక్తులు దబోల్కర్‌ను కాల్చి చంపారు. దబోల్కర్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.

ఎంఎం కలబురిగి: వచన సాహిత్యంలో పండితుడైన కలబురిగి హంపిలోని కన్నడ వర్సిటీకి వీసీగా చేశారు. రచయిత, పరిశోధకుడు, హేతువాది అయిన ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానించినందుకు కేసు నమోదైంది. విగ్రహారాధనకు వ్యతిరేకంగా పోరాడారు. 2015 ఆగస్టులో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటికెళ్లి కాల్చి చంపేశారు.

గోవింద్‌ పన్సారే: కమ్యూనిస్ట్‌ పార్టీ సీనియర్‌ నాయకుడైన గోవింద్‌ పన్సారే 2015, ఫిబ్రవరిలో హత్యకు గురయ్యారు. మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు సాయుధులు తుపాకులతో ఆయన, ఆయన భార్యపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఆయన భార్య ప్రాణాలతో బయపటపడినా, గాయాలతో పన్సారే కన్నుమూశారు. వ్యవసాయ కూలీలు, ఆటో రిక్షా యూనియన్‌లు తదితరాలకు సంబంధించిన సామాజిక ఉద్యమాల్లో పన్సారే క్రియాశీలక పాత్ర పోషించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో టోల్‌గేట్లు ఎత్తేయాలని పోరాడారు.   

రాజ్‌దేవ్‌ రంజన్‌: బిహార్‌లో సివాన్‌ అనే హిందీ దిన పత్రికలో పనిచేస్తున్న రాజ్‌దేవ్‌ రంజన్‌(45)ను 2016 మే 13న కొందరు వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహమ్మద్‌ షాబుద్దీన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించినందుకే రంజన్‌ హత్యకు గురయ్యాడని భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు కాంట్రాక్ట్‌ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement