Graeme Hick
-
బ్యాటింగ్ కోచ్ అవసరం లేదు!
మెల్బోర్న్: కరోనా వైరస్ దెబ్బ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై బాగానే పడింది. ఆర్థిక నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో బోర్డు తాజాగా 40 మందిపై వేటు వేసింది. ఈ జాబితాలో బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున 65 టెస్టులు, 120 వన్డేలు ఆడిన హిక్ 2016నుంచి ఆసీస్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సీఈఓ కెవిన్ రాబర్ట్స్‌ను సాగనంపిన సీఏ తాజాగా హిక్ సేవలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ సారి అధిక వేతన భత్యాలు పొందుతున్న వారిపైనే సీఏ గురిపెట్టింది. ఈ తొలగింపులతో ఏకంగా రూ. 210 కోట్లు (4 కోట్ల ఆసీస్ డాలర్లు) భారం తగ్గుతుందని సీఏ భావిస్తోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీఏ పొదుపు చర్యల్లో భాగంగానే సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. పైగా ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌కు కూడా ఆతిథ్యమివ్వడం లేదని ప్రకటించిన మరుసటి రోజే ఇక అనవసరమనుకున్న సిబ్బందిని తొలగించింది. అలాగే అండర్–19 మినహా జూనియర్ స్థాయి, ద్వితీయ శ్రేణి క్రికెట్ టోర్నీలను షెడ్యూల్ నుంచి తప్పించింది. మరో వైపు తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపడుతున్న నిక్ హాక్లీపై ఐసీసీ మాజీ సీఈ మాల్కమ్ స్పీడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కష్టకాలంలో హాక్లీ బాధ్యతలు చేపడుతున్నాడు. సరిగ్గా చెప్పాలంటే తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలర్ తన తొలి ఓవర్‌ను కోహ్లిని వేస్తున్నట్లుగా అతని పరిస్థితి కనిపిస్తోంది’ అని మాల్కమ్ అన్నాడు. -
టీమిండియాతో జాగ్రత్త..
మెల్బోర్న్: వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించనున్నఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడు. ప్రస్తుతం ఉన్న క్రికెట్ జట్లలో భారత్ కఠినమైన ప్రత్యర్థి అనే సంగతిని గుర్త్తించుకుని పూర్తిస్థాయి ప్రదర్శన ఇస్తేనే అక్కడ రాణిస్తామన్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న భారత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. దీనిలో భాగంగా ఆసీస్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లతో హిక్ సమావేశమయ్యాడు. 'భారత్‌లో ఆడేటప్పుడు ముందుగా అక్కడ పరిస్థితులకు అలవాటు పడాలి. అదే సమయంలో భారత్‌పై ఎదురుదాడికి దిగడం ముఖ్యమే. ఎప్పుడూ రన్ రేట్‌ను కాపాడుకుంటూ ఆటను కొనసాగించాలి. ఇందుకోసం చాలా ఓపిక అవసరం. ఇటీవల కాలంలో భారత్‌లో పర్యటించిన కొన్ని జట్లు ఇలా చేసే విజయవంతమయ్యాయి. భారత్‌తో పోరు అంత సులభం కాదన్న సంగతి ప్రతీ ఆటగాడు మదిలో ఉండాలి. ఆసీస్ జట్టులో ప్రతిభకు లోటు లేదు. కాకపోతే గత కొంతకాలంగా ఆసీస్ జట్టు పూర్తిస్థాయిలో ఆడటం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలి. అందుకోసం సాధ్యమైనంత ఓపికతో ఆడాల్సి అవసరం ఉంది' అని హిక్ పేర్కొన్నాడు. -
గ్రేమ్ హిక్కు కొత్త బాధ్యత
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు గ్రేమ్ హిక్ నియమితుడయ్యాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో సిరీస్ నేపథ్యంలో హిక్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ తరపున 65 టెస్టులు, 120 వన్డేలకు ప్రాతినిథ్యం వహించిన హిక్ .. 2013లో క్రికెట్ ఆస్ట్రేలియా హై పెర్ఫామెన్స్ కోచ్ గా ఎంపికయ్యాడు గ్రేమ్ హిక్ ను బ్యాటింగ్ కోచ్ గా చేయడం పట్ల ఆసీస్ ప్రధాన కోచ్ డారెన్ లీమన్ హర్షం వ్యక్తం చేశాడు.తమ జట్టును మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఉపయోగపడతాయని లీమన్ పేర్కొన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో హిక్ తమతో పని చేసిన విషయాన్ని లీమన్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఆ ముక్కోణపు సిరీస్‌లో హిక్ తమను ఎంతగానో ఆకట్టుకున్నాడన్నాడు. ప్రపంచ క్రికెట్లో దాదాపు అన్ని పరిస్థితుల్లో ఆడిన విశేష అనుభవమున్న క్రికెటర్ హిక్ అని లీమన్ కొనియాడాడు. రాబోవు రోజుల్లో ఇంగ్లండ్ లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, యాషెస్ సిరీస్, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో హిక్ సలహాలు తమకు కచ్చితంగా ఉపయోగపడతాయని లీమన్ అన్నాడు.