![Cricket Australia sacks Graeme Hick as batting coach amid financial crisis - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/18/ac.jpg.webp?itok=-nonhh_v)
మెల్‌బోర్న్: కరోనా వైరస్ దెబ్బ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై బాగానే పడింది. ఆర్థిక నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో బోర్డు తాజాగా 40 మందిపై వేటు వేసింది. ఈ జాబితాలో బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున 65 టెస్టులు, 120 వన్డేలు ఆడిన హిక్ 2016నుంచి ఆసీస్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సీఈఓ కెవిన్ రాబర్ట్స్‌ను సాగనంపిన సీఏ తాజాగా హిక్ సేవలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ సారి అధిక వేతన భత్యాలు పొందుతున్న వారిపైనే సీఏ గురిపెట్టింది. ఈ తొలగింపులతో ఏకంగా రూ. 210 కోట్లు (4 కోట్ల ఆసీస్ డాలర్లు) భారం తగ్గుతుందని సీఏ భావిస్తోంది.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీఏ పొదుపు చర్యల్లో భాగంగానే సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. పైగా ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌కు కూడా ఆతిథ్యమివ్వడం లేదని ప్రకటించిన మరుసటి రోజే ఇక అనవసరమనుకున్న సిబ్బందిని తొలగించింది. అలాగే అండర్–19 మినహా జూనియర్ స్థాయి, ద్వితీయ శ్రేణి క్రికెట్ టోర్నీలను షెడ్యూల్ నుంచి తప్పించింది. మరో వైపు తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపడుతున్న నిక్ హాక్లీపై ఐసీసీ మాజీ సీఈ మాల్కమ్ స్పీడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కష్టకాలంలో హాక్లీ బాధ్యతలు చేపడుతున్నాడు. సరిగ్గా చెప్పాలంటే తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలర్ తన తొలి ఓవర్‌ను కోహ్లిని వేస్తున్నట్లుగా అతని పరిస్థితి కనిపిస్తోంది’ అని మాల్కమ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment