టీమిండియాతో జాగ్రత్త..
మెల్బోర్న్: వచ్చే ఏడాది ఆరంభంలో భారత్లో పర్యటించనున్నఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడు. ప్రస్తుతం ఉన్న క్రికెట్ జట్లలో భారత్ కఠినమైన ప్రత్యర్థి అనే సంగతిని గుర్త్తించుకుని పూర్తిస్థాయి ప్రదర్శన ఇస్తేనే అక్కడ రాణిస్తామన్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న భారత్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. దీనిలో భాగంగా ఆసీస్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లతో హిక్ సమావేశమయ్యాడు.
'భారత్లో ఆడేటప్పుడు ముందుగా అక్కడ పరిస్థితులకు అలవాటు పడాలి. అదే సమయంలో భారత్పై ఎదురుదాడికి దిగడం ముఖ్యమే. ఎప్పుడూ రన్ రేట్ను కాపాడుకుంటూ ఆటను కొనసాగించాలి. ఇందుకోసం చాలా ఓపిక అవసరం. ఇటీవల కాలంలో భారత్లో పర్యటించిన కొన్ని జట్లు ఇలా చేసే విజయవంతమయ్యాయి. భారత్తో పోరు అంత సులభం కాదన్న సంగతి ప్రతీ ఆటగాడు మదిలో ఉండాలి. ఆసీస్ జట్టులో ప్రతిభకు లోటు లేదు. కాకపోతే గత కొంతకాలంగా ఆసీస్ జట్టు పూర్తిస్థాయిలో ఆడటం లేదు. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్లు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలి. అందుకోసం సాధ్యమైనంత ఓపికతో ఆడాల్సి అవసరం ఉంది' అని హిక్ పేర్కొన్నాడు.