గ్రేమ్ హిక్కు కొత్త బాధ్యత
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్గా ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు గ్రేమ్ హిక్ నియమితుడయ్యాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో సిరీస్ నేపథ్యంలో హిక్ను బ్యాటింగ్ కోచ్గా ఎంపిక చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ తరపున 65 టెస్టులు, 120 వన్డేలకు ప్రాతినిథ్యం వహించిన హిక్ .. 2013లో క్రికెట్ ఆస్ట్రేలియా హై పెర్ఫామెన్స్ కోచ్ గా ఎంపికయ్యాడు
గ్రేమ్ హిక్ ను బ్యాటింగ్ కోచ్ గా చేయడం పట్ల ఆసీస్ ప్రధాన కోచ్ డారెన్ లీమన్ హర్షం వ్యక్తం చేశాడు.తమ జట్టును మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఉపయోగపడతాయని లీమన్ పేర్కొన్నాడు. ఇటీవల వెస్టిండీస్లో జరిగిన వన్డే సిరీస్లో హిక్ తమతో పని చేసిన విషయాన్ని లీమన్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఆ ముక్కోణపు సిరీస్లో హిక్ తమను ఎంతగానో ఆకట్టుకున్నాడన్నాడు. ప్రపంచ క్రికెట్లో దాదాపు అన్ని పరిస్థితుల్లో ఆడిన విశేష అనుభవమున్న క్రికెటర్ హిక్ అని లీమన్ కొనియాడాడు. రాబోవు రోజుల్లో ఇంగ్లండ్ లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, యాషెస్ సిరీస్, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో హిక్ సలహాలు తమకు కచ్చితంగా ఉపయోగపడతాయని లీమన్ అన్నాడు.