Ashes Test Match: సత్తా చాటిన బౌలర్లు.. తొలి రోజు ఆసీస్‌దే..! | Women's Ashes: England Bowled Out For 170 By Australia On Day 1 Of One Off Test | Sakshi
Sakshi News home page

Ashes Test Match: సత్తా చాటిన బౌలర్లు.. తొలి రోజు ఆసీస్‌దే..!

Jan 30 2025 5:19 PM | Updated on Jan 30 2025 5:24 PM

Women's Ashes: England Bowled Out For 170 By Australia On Day 1 Of One Off Test

మహిళల యాషెస్‌ (Women's Ashes) మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో ఇవాళ (జనవరి 30) ఏకైక టెస్ట్ మ్యాచ్‌ ప్రారంభమైంది. పింక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌ జరిగే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఆసీస్‌ బౌలర్లు, ముఖ్యంగా అలానా కింగ్‌ (Alana King) (23-6-45-4) చెలరేగడంతో ఇంగ్లండ్‌ (England) తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే చాపచుట్టేసింది. 

మిగతా ఆసీస్‌ బౌలర్లు కిమ్‌ గార్త్‌, డార్సీ బ్రౌన్‌ తలో రెండు వికెట్లు.. ఆష్లే గార్డ్‌నర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (51) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (25), వ్యాట్‌ హాడ్జ్‌ (22), సోఫీ డంక్లీ (21), ర్యానా మెక్‌డొనాల్డ్‌ గే (15 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగా.. టామీ బేమౌంట్‌ 8, మయా బౌచియర్‌ 2, ఆమీ జోన్స్‌ 3, సోఫీ ఎక్లెస్టోన్‌ 1, లారెన్‌ ఫైలర్‌ 8, లారెన్‌ బెల్‌ 7 పరుగులు చేసి ఔటయ్యారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 56 పరుగులు చేసింది. జార్జియా వాల్‌ 12 పరుగులు చేసి ఔట్‌ కాగా.. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 20, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జార్జియా వాల్‌ వికెట్‌ లారెన్‌ బెల్‌కు దక్కింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 114 పరుగులు వెనుకపడి ఉంది.

ఇదిలా ఉంటే, మల్టీ ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ సిరీస్‌లో తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే  సిరీస్‌ జరిగింది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆస్ట్రేలియా 3-0తోనే ఊడ్చేసింది. 

ప్రస్తుతం జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఆసీస్‌ విజయం సాధిస్తే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ మొత్తాన్ని 16-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. ఈ సిరీస్‌లో ఒక్కో పరిమిత ఓవర్ల మ్యాచ్‌కు రెండు పాయింట్లు.. టెస్ట్‌ మ్యాచ్‌కు 4 పాయింట్లు లభిస్తాయి. సిరీస్‌లోని ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు (3 వన్డేలు, 3 టీ20లు) గెలిచిన ఆసీస్‌ ప్రస్తుతం 12-0 ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement