గుండెకు పొట్టకు మేలు
బద్ధకోణం.. శలభం
యోగా
ఆసనంలో కూర్చుని కాళ్లు రెండూ ముందుకు స్ట్రెచ్ చేసి, విశ్రాంతి పొందాలి. ఆ తర్వాత కాళ్ళు రెండూ మడచి అరిపాదానికి ఎదురుగా ఇంకొక అరిపాదాన్ని కలిపి రెండు చేతులతో బొటన వేళ్ళను పట్టుకోవాలి. మోకాళ్ళు రెండూ పైకి, కిందకు సీతాకోకచిలుక లాగా కదిలిస్తూ ఉండాలి. తొడకీలు భాగాలు కూడా (గ్రెయిన్ ఏరియా) బాగా ఫ్రీ చేసుకొని యింకా అవసరం అయితే అర చేతులు రెండూ సీటుకు ఇరువైపులా భూమి మీద సపోర్ట్‌గా ఉంచి ప్రెస్ చేస్తూ సీటును పైకి లేపి మోకాళ్ళను పైకి, కిందకు కదిలించినట్లయితే తొడకీలు భాగాలు ఇంకా ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. రెండు చేతులతో కాలి వేళ్ళని కలిపి పట్టుకుని ఉన్నప్పుడు అరిపాదాలు రెండూ పైకి చూపించే ప్రయత్నం చేస్తే పైకి లేచిన రెండు మోకాళ్లు భూమికి ఇంకా కొంచెం దగ్గరగా తీసుకురావచ్చు. ఈ స్థితిలో తల.. వీపు నిటారుగా ఉంచి శ్వాసతీసుకుని, శ్వాస వదులుతూ పొట్టదగ్గర కండరాలను లోపలకు లాగుతూ కొంచెం కొంచెం ముందుకు వంగుతూ కలిపి ఉంచిన పాదాలకు నుదురును దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా ముందుకు వంగేటప్పుడు పొట్ట నడుము భాగాలలోని కండరాలు పట్టుకునే ప్రమాదం ఉన్నది కనుక జాగ్రత్తగా చేయడం ముఖ్యం. ప్రిపరేటరీగా శ్వాసతీసుకుంటూ తల ఛాతీపైకి మళ్ళీ శ్వాస వదులుతూ తల ఛాతీకి కిందకు, మళ్ళీ శ్వాసతీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ఈ సారి కొంచెం ఎక్కువగా ముందుకు ఇలా 4, 5 సార్లు చేసినట్లయితే తేలికగా చేయగల్గుతారు.
ఉపయోగాలు: గుండె కండరాలను బలంగా చేయడానికి, గుండెకు రక్తప్రసరణ చక్కగా జరగడానికి ఉపయోగపడుతుంది. తొడ కీలు భాగాలు ఓపెన్ అవ్వడానికి, స్టిఫ్నెస్ పోవడానికి పొట్టలో భాగాలకు వ్యాయామం జరిగి జీర్ణశక్తి మెరుగవుతుంది. హై బీపీకి మెనోపాజ్ సమస్యకి, ఆస్తమా సమస్యకి, ఇన్ ఫెర్టిలిటీకి చాలా ఉత్తమమైన ఆసనం. డిప్రెషన్, యాంగ్జయిటీ, ఫాటిగ్యూలను దూరం చేస్తుంది.
పొట్టమీద బోర్లా పడుకుని మకరాసనంలో కొంచెం రిలాక్స్ అయ్యి భుజంగాసన అర్థ శలభాసన, శలభాసన తరువాత ధనురాసన... సీక్వెన్స్‌లో భాగంగా ఈ ఆసనాన్ని సాధన చేస్తారు. బోర్లా పడుకుని నేలమీద గడ్డం సపోర్ట్‌గా ఉంచి పాదాలు రెండూ దగ్గరకు చేర్చి మోచేతులు రెండూ పొట్ట కిందకు తీసుకువెళ్ళి అరచేతులు భూమి మీదకు గట్టిగా ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళను కలిపి మోకాళ్ళు వంచకుండా గాలిలోకి పైకి లేపే ప్రయత్నం చేయాలి. శ్వాసవదులుతూ నెమ్మదిగా కాళ్ళు రెండూ కిందకు దించాలి. మధ్యలో శ్వాస తీసుకుని వదిలే ప్రయత్నం చేయకుండా సాధారణ శ్వాస తీసుకుంటూ తేలికగా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి వెనుకకు రావాలి. పూర్తి ఆసనస్థితిలో ఉన్నప్పుడు తొడలు మోకాళ్లు కూడా భూమి మీద ఆనకుండా పైకి లేపి ఉంచాలి. పూర్తి ఆసన స్థితిలోకి రావడం కష్టంగా ఉన్నట్లయితే ఒక కాలు ఒకసారి, ఆ తర్వాత రెండో కాలుని పైకి (మోకాళ్ళ దగ్గర మడచి) తీసుకువెడుతూ ఫ్రీ చేసుకోవాలి. తరువాత శలభాసన వేరు వేరుగా రెండు కాళ్ళతో సాధన చేసి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం చేయాలి.
ఉపయోగాలు: పిరుదులలో తొడలలో పొట్టకింద భాగాలలో ఉన్న కొవ్వు కరగడానికి, జీర్ణశక్తి పెంపొందించడానికి, పొట్ట దగ్గర కండరాలు, పెల్విక్ రీజియన్ బలపడటానికి, సయాటికా సమస్యకు, లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి లేదా లోయర్ బ్యాక్‌కి బలం చేకూరడానికి ఉపయోగపడే ఆసనం ఇది.
జాగ్రత్తలు: గర్భిణులు, రుతుస్త్రావంలో ఉన్న స్త్రీలు చేయరాదు. పెప్టిక్ అల్సర్‌తో బాధపడేవాళ్లు, హెర్నియా సమస్య ఉన్నవాళ్లు పూర్తి స్థాయిలో ఈ ఆసనం చేయకపోవడం మంచిది. - సమన్వయం: సత్యబాబు
ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్