Gram panchayat building
-
ముహూర్తం నేడే..
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పరిపాలనను ప్రజల దరికి చేర్చేందుకు ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అమలయ్యేలా చూడడంతో పాటు ప్రజల వ్యయప్రయాసలు తగ్గించేందుకు ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీలు గురువారం నుంచి మనుగడలోకి రానున్నాయి. ఇక పాత గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు బుధవారంతో ముగియగా.. వీటితో పాటు నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో సైతం ప్రత్యేక అధికారుల పాలన గురువారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాన్ని వేడుకగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లో అనువుగా గదుల నుంచి పాలన సాగించేందుకు ఏర్పాట్లు చేయగా.. అందుబాటులో లేని ప్రాంతాల్లో అద్దె భవనాలు తీసుకున్నారు. ఇప్పటికే ఆ యా భవనాల మరమ్మతు, రంగులు వేయడం పూర్తికాగా.. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించా రు. అలాగే, కొత్త గ్రామపంచాయతీల్లో ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఆయా పంచాయతీలను ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగ వాతావరణం జిల్లాలో 265 కొత్త గ్రామపంచాయతీలు గురువారం నుంచి మనుగడలోకి రానున్నాయి. గ్రామపంచాయతీలుగా మార్చాలనే డిమాండ్ ఉన్నవే కాకుండా డిమాండ్ లేని చాలా గ్రామాలను సైతం పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేశారు. కాగా, పాత పంచాయతీల పరిధిలో ఇవి ఉండగా.. బుధవారంతో ఆయా పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో గురువారం నుంచి నూతన గ్రామపంచాయతీల్లో పాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు పండుగ వాతావరణంలో కొత్త గ్రామపంచాయతీలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పాలనను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు. 265 కొత్త పంచాయతీలు... జిల్లాలో కొత్తగా 265 పంచాయతీలు ఏర్పడుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 468 పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో కలుపుకుని జిల్లాలో ప్రస్తుతం వీటి సంఖ్య 721కి చేరింది. 500 జనాభా ఉండి సంబంధిత గ్రామపంచాయతీకి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న నివాసిత ప్రాంతాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు 500 జనాభా కలిగిన ప్రతీ గిరిజన తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. కొత్త, పాత వాటిని కలుపుకుంటే జిల్లాలో 733 పంచాయతీలు ఉండగా.. ఇందులో 12 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. తద్వారా జిల్లాలో 721 పంచాయతీలు ఉన్నట్లయింది. ప్రత్యేక అధికారుల పాలన జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి కొత్త, పాత గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. గ్రామపంచాయతీల స్థాయి ప్రకారం గెజిటెట్ అధికారులు, మండల స్థాయి అధికారులకు బాధ్యతలను ఇప్పటికే అప్పగించారు. ఇందులో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు ఈఓపీఆర్డీలు, సీడీపీఓ, ఐసీడీఎస్ సూపరింటెండెంట్లు ఉన్నారు. రెండు, మూడు గ్రామపంచాయతీలను ఒక క్లస్టర్‌గా చేసి వాటికి ఒక మండల స్థాయి అధికారిని నియమించారు. -
చినబాబు వస్తున్నారని..
పెనుమంట్ర : ప్రొటోకాల్... ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల నిర్వహణకు అంకుశం లాంటి పదం ఇది. దీనిని అడ్డదిడ్డం చేసి తమ అవసరాలకు అనుగుణంగా వాడుకోవడం అధికార పార్టీ నేతలకు అలవాటైపోయింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన చిన్నచిన్న ప్రజాప్రతినిధులపై ప్రొటోకాల్‌నే బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి వారిని ఇరుకు పెడుతున్నారు. ఇదే సమయంలో అ«ధికార పార్టీ నేతలు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ వ్యవహారం. వారం రోజులు క్రితం అనధికారికంగా ప్రారంభించిన భవనాన్ని మళ్లీ మంత్రి లోకేష్‌తో బుధవారం ప్రారంభించడానికి అధికార పార్టీ నేతలు నిస్సిగ్గుగా ఏర్పాట్లు సాగించేస్తున్నారు. పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం తొలి నుంచి వివాదాస్పదంగామారింది. గ్రామం నడిబొడ్డున ఉన్న పంచాయతీ కార్యాలయం శిథిలం కావడంతో నూతన భవన నిర్మాణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో పాత భవనం ఉన్నచోటనే నిర్మించాలని ఒక వర్గం అక్కడ కాకుండా స్థానిక పంచాయతీ చెర్వు గట్టున ఉన్న పంచాయతీ స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలని మరోవర్గం పట్టుపట్టారు. దీంతో అప్పటి మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గ్రామానికి విచ్చేసి చెర్వు గట్టునే శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యతిరేక వర్గం వారు కోర్టును ఆశ్రయించడంతో భవన నిర్మాణం నిలిచిపోయింది. అనంతరం స్థానిక మంత్రి పితాని సత్యనారాయణ ఇరువర్గాలను సఖ్యత చేసే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. దీంతో సర్పంచి వర్గం వారు గ్రామశివారున దాతలు అందించిన స్థలంలో భవన నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసేశారు. పలుమార్లు ఈ పంచాయతీ భవనాన్ని ప్రారంభించాలని ప్రయత్నించినా వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. వారం రోజుల క్రితం మంత్రి పితానిచే ఈ భవన ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో మంత్రి రాకపోవడంతో ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. దీంతో విసుగు చెందిన సర్పంచ్, అతని అనుచరులు వారం రోజుల క్రితమే భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలోనే సర్పంచి పాలనా వ్యవహారాలు చక్కదిద్దుతున్నారని గ్రామ ప్రతిపక్ష నాయకులు పేర్కొంటున్నారు. పెనుమంట్ర సర్పంచ్‌పై వివక్ష ఇదే మండలంలోని పెనుమంట్ర గ్రామ పంచాయతీ భవనాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా గ్రామ వార్డుమెంబర్ ఉందుర్తి కమలమ్మచే గ్రామ సర్పంచి దాట్ల రంగావతి ప్రారంభింపజేశారు. దీంతో తమకు కనీస సమాచారం లేదంటూ, ప్రభుత్వ సెలవుదినాన ప్రారంభోత్సవాలు తగదంటూ అప్పుడు అధికారులు నానా హంగామా చేశారు. అప్పటికప్పుడు పోలీసులు సైతం రంగప్రవేశం చేసి కార్యాలయాన్ని తాత్కాలికంగా మూయించి వేశారు. కాని ఇప్పుడు పంచాయతీ భవన ప్రారంభోత్సవంపై అధికార పక్ష నేతలు చూపుతున్న ప్రొటోకాల్ వివక్షతపై ç విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వయోజన విద్యకు మంగళం..!
పక్క చిత్రంలో.. కన్పిస్తున్నది నెన్నెలలోని సాక్షర భారత్ కేంద్రం. గ్రామ పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. వీసీవో(గ్రామ కో-ఆర్డినేటర్) వచ్చినా పంచాయతీ కార్యాలయ తాళం తెరిచి ఉంటేనే కేంద్రం కొనసాగుతుంది. కానీ పంచాయతీ కార్యదర్శి తన పని ఉంటేనే వస్తాడు. లేకపోతే లేదు. దీంతో ఆరు నెలల నుంచి సాక్షర భారత్ కేంద్రం నిర్వహణ జరగడం లేదు. ఆ వైపు వయోజనులెవరూ వెళ్లడం లేదు. వయోజన విద్య.. జిల్లాలో మిథ్యగా మారింది. ప్రభుత్వ తీరు.. అధికారుల వైఫల్యంతో నిరక్షరాస్య వయోజనులకు అక్షరజ్ఞానం అందని ద్రాక్షలా తయారైంది. వయోజనులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సాక్షర భారత్’ అమలు జిల్లాలో అటకెక్కింది. మూడేళ్ల క్రితం.. సాక్షర భారత్ అమలు సమయంలో అధికారులు నిర్వహించిన సర్వేలో 8,44,556 మంది నిరక్షరాస్యులు(చదవడం, రాయడం) ఉన్నట్లు నిర్ధారణ కాగా.. ఇప్పటి వరకు 2,41,744 మంది చదవడం, రాయడం నేర్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా.. 6లక్షలకు పైగా మంది నిరక్షరాస్యులున్నారు. జిల్లా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే.. ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. సాక్షి, మంచిర్యాల : నిరక్షరాస్య వయోజనులకు అక్షరజ్ఞానం నేర్పించేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ యోజన విద్యాశాఖ ఏర్పాటు చేసింది. గతంలో అనియత విద్య.. అక్షర సంక్రాంతి.. చదువు వెలుగు.. కార్యక్రమాలతో వయోజన విద్య అమలైంది. కానీ ప్రణాళిక రూపకల్పన.. ఆచరణలో వైఫల్యం కారణంగా ఆశించిన ప్రగతి సాధించలేకపోయింది. ఏటా.. మహిళలతోపాటు పురుషులూ చదువుకు దూరమవుతూనే ఉన్నారు. కనీసం చదవడం.. రాయడం రాని వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2009లో సాక్షరభారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో 2011లో ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 866 సాక్షర భారత్ కేంద్రాలుండగా... ఒక్కో కేంద్రానికి పురుష, మహిళా గ్రామ కో-ఆర్డినేటర్లు మొత్తం 1732 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో గ్రామ కో-ఆర్డినేటర్‌కు ప్రతి నెల రూ.2వేలు, మండల కో-ఆర్డినేటర్‌కు రూ.6వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. తెరుచుకోని కేంద్రాలు.. జిల్లాలో సాక్షర భారత్ కేంద్రాలు తెరుచుకోవడం లేదు. ఏడాది నుంచి గౌరవ వేతనం అందకపోవడంతో కేంద్రాల్లో చదువు చెప్పేందుకు గ్రామ, మండల కో-ఆర్డినేటర్లు ఆసక్తి చూపడం లేదు. గ్రామ కో-ఆర్డినేటర్లకు రూ.4.15 కోట్లకు పైగా వేతనాలు, మండల కో-ఆర్డినేటర్లకు రూ.37.44లక్షలు గౌరవ వేతనం రావాల్సి ఉంది. మరోపక్క.. కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడం.. గ్రామ పంచాయతీ భవనాల్లోనే ఎక్కువ కేంద్రాలు కొనసాగడంతో పంచాయతీ కార్యదర్శులు సహకరించిప్పుడే అవి తెరుచుకుంటున్నాయి. లేకపోతే తెరుచుకోని పరిస్థితి నెలకొంది. జిల్లాలో సాక్షర భారత్ కేంద్రాలు తెరుచుకోవడం లేదనే ఫిర్యాదులు ఇంత వరకు అందలేదని, గౌరవ వేతనాలు లేకపోయినా కో-ఆర్డినేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారని పథకం జిల్లా కో-ఆర్డినేటర్ సాగర్ వివరణ ఇచ్చారు. ఇలా చేస్తే బాగు.. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే.. వయోజన విద్యతోపాటు సర్వశిక్షా అభియాన్, డీఆర్డీఏ, డ్వామా శాఖలనూ భాగస్వామ్యుల్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కో శాఖకు కొన్ని మండలాలు కేటాయించి.. ఆయా మండలా పరిధిలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. లక్ష్యానికి తగ్గట్టు.. ప్రణాళిక రూపొందించి కార్యక్రమ నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులు నివేదికలు స్వీకరిస్తూ ఉండాలి. జిల్లాలో డీఆర్డీఏ, ఐకేపీలోని మహిళా గ్రూపుల ద్వారా వయోజనులకు విద్య అందించాలి. జిల్లా, మండల, గ్రామైక్య సంఘ సభ్యులనూ ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసి.. చదవడం, రాయడం రాని వారికి అక్షరజ్ఞానం నేర్పించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకంలో పని చేసే కూలీల్లో సింహభాగం నిరక్షరాస్యులే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకునేందుకు వారు ముందుకురావడం లేదు. ఇందుకోసం.. పథక నిర్వహణ బాద్యత నిర్వర్తిస్తున్న డ్వామానూ భాగస్వామ్యం చే యాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల సహకారంతో కూలీలు పని చేసే చోటే.. వారికి కొంత సమయం కేటాయించి అక్షరాలు దిద్దించే ఏర్పాటు చేయాలి. సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేజీబీవీలు, ఇతర విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి క్షేత్రస్థాయిలో పరిచయాలుండడంతో వారికీ వయోజన విద్య బాధ్యత అప్పగిస్తే బాగుంటుంది. బోథ్ మండలంలో మొత్తం 38 సాక్షర భారత్ కేంద్రాలుండగా.. రెండేళ్ల నుంచి ఒక్క కేంద్రం కూడా తెరుచుకోవడం లేదు. బె జ్జూరు మండలంలో 42 కేంద్రాలున్నాయి. నెల రోజుల నుంచి ఒక్క కేంద్రం కూడా తెరుచుకోవడం లేదు. కోటపల్లి మండలంలో ఉన్న 42 సాక్షర భారత్ కేంద్రాల్లో 20కిపైగా తెరుచుకోవడం లేదు. నెన్నెల మండలంలో మొత్తం 13 కేంద్రాలుండగా ప్రస్తుతం అవన్నీ మూతబడ్డాయి. కడెం మండలంలో మొత్తం 24 వయోజన విద్యా కేంద్రాలున్నాయి. అందులో నాలుగైదు కేంద్రాలకు మించి తెరుచుకోవడం లేదు. కౌటాల మండలంలో 21 సాక్షరభారత్ కేంద్రాలున్నాయి. ఆరు నెలల నుంచి మెటీరియల్ రాకపోవడంతో కేంద్రాలు నామ మాత్రంగా తెరిచి.. మూసేస్తున్నారు. ఒక్కకి కూడా అక్షరజ్ఞానం అందడం లేదు.