నెలమూరులో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయ భవనం
పెనుమంట్ర : ప్రొటోకాల్... ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల నిర్వహణకు అంకుశం లాంటి పదం ఇది. దీనిని అడ్డదిడ్డం చేసి తమ అవసరాలకు అనుగుణంగా వాడుకోవడం అధికార పార్టీ నేతలకు అలవాటైపోయింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన చిన్నచిన్న ప్రజాప్రతినిధులపై ప్రొటోకాల్‌నే బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి వారిని ఇరుకు పెడుతున్నారు. ఇదే సమయంలో అ«ధికార పార్టీ నేతలు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ వ్యవహారం. వారం రోజులు క్రితం అనధికారికంగా ప్రారంభించిన భవనాన్ని మళ్లీ మంత్రి లోకేష్‌తో బుధవారం ప్రారంభించడానికి అధికార పార్టీ నేతలు నిస్సిగ్గుగా ఏర్పాట్లు సాగించేస్తున్నారు. పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం తొలి నుంచి వివాదాస్పదంగామారింది.
గ్రామం నడిబొడ్డున ఉన్న పంచాయతీ కార్యాలయం శిథిలం కావడంతో నూతన భవన నిర్మాణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో పాత భవనం ఉన్నచోటనే నిర్మించాలని ఒక వర్గం అక్కడ కాకుండా స్థానిక పంచాయతీ చెర్వు గట్టున ఉన్న పంచాయతీ స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలని మరోవర్గం పట్టుపట్టారు. దీంతో అప్పటి మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గ్రామానికి విచ్చేసి చెర్వు గట్టునే శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యతిరేక వర్గం వారు కోర్టును ఆశ్రయించడంతో భవన నిర్మాణం నిలిచిపోయింది. అనంతరం స్థానిక మంత్రి పితాని సత్యనారాయణ ఇరువర్గాలను సఖ్యత చేసే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. దీంతో సర్పంచి వర్గం వారు గ్రామశివారున దాతలు అందించిన స్థలంలో భవన నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసేశారు. పలుమార్లు ఈ పంచాయతీ భవనాన్ని ప్రారంభించాలని ప్రయత్నించినా వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. వారం రోజుల క్రితం మంత్రి పితానిచే ఈ భవన ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో మంత్రి రాకపోవడంతో ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. దీంతో విసుగు చెందిన సర్పంచ్, అతని అనుచరులు వారం రోజుల క్రితమే భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలోనే సర్పంచి పాలనా వ్యవహారాలు చక్కదిద్దుతున్నారని గ్రామ ప్రతిపక్ష నాయకులు పేర్కొంటున్నారు.
పెనుమంట్ర సర్పంచ్‌పై వివక్ష
ఇదే మండలంలోని పెనుమంట్ర గ్రామ పంచాయతీ భవనాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా గ్రామ వార్డుమెంబర్ ఉందుర్తి కమలమ్మచే గ్రామ సర్పంచి దాట్ల రంగావతి ప్రారంభింపజేశారు. దీంతో తమకు కనీస సమాచారం లేదంటూ, ప్రభుత్వ సెలవుదినాన ప్రారంభోత్సవాలు తగదంటూ అప్పుడు అధికారులు నానా హంగామా చేశారు. అప్పటికప్పుడు పోలీసులు సైతం రంగప్రవేశం చేసి కార్యాలయాన్ని తాత్కాలికంగా మూయించి వేశారు. కాని ఇప్పుడు పంచాయతీ భవన ప్రారంభోత్సవంపై అధికార పక్ష నేతలు చూపుతున్న ప్రొటోకాల్ వివక్షతపై ç విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment