వయోజన విద్యకు మంగళం..! | Adult education is in concern | Sakshi

వయోజన విద్యకు మంగళం..!

Published Wed, Dec 24 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

వయోజన విద్యకు మంగళం..!

వయోజన విద్యకు మంగళం..!

పక్క చిత్రంలో.. కన్పిస్తున్నది నెన్నెలలోని సాక్షర భారత్ కేంద్రం. గ్రామ పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. వీసీవో(గ్రామ కో-ఆర్డినేటర్) వచ్చినా పంచాయతీ కార్యాలయ తాళం తెరిచి ఉంటేనే కేంద్రం కొనసాగుతుంది. కానీ పంచాయతీ కార్యదర్శి తన పని ఉంటేనే వస్తాడు. లేకపోతే లేదు. దీంతో ఆరు నెలల నుంచి సాక్షర భారత్ కేంద్రం నిర్వహణ జరగడం లేదు. ఆ వైపు వయోజనులెవరూ వెళ్లడం లేదు.
 
వయోజన విద్య.. జిల్లాలో మిథ్యగా మారింది. ప్రభుత్వ తీరు.. అధికారుల వైఫల్యంతో నిరక్షరాస్య వయోజనులకు అక్షరజ్ఞానం అందని ద్రాక్షలా తయారైంది. వయోజనులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సాక్షర భారత్’ అమలు జిల్లాలో అటకెక్కింది. మూడేళ్ల క్రితం.. సాక్షర భారత్ అమలు సమయంలో అధికారులు నిర్వహించిన సర్వేలో 8,44,556 మంది నిరక్షరాస్యులు(చదవడం, రాయడం) ఉన్నట్లు నిర్ధారణ కాగా.. ఇప్పటి వరకు 2,41,744 మంది చదవడం, రాయడం నేర్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా.. 6లక్షలకు పైగా మంది నిరక్షరాస్యులున్నారు. జిల్లా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే.. ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితి.                         
 
సాక్షి, మంచిర్యాల : నిరక్షరాస్య వయోజనులకు అక్షరజ్ఞానం నేర్పించేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ యోజన విద్యాశాఖ ఏర్పాటు చేసింది. గతంలో అనియత విద్య.. అక్షర సంక్రాంతి.. చదువు వెలుగు.. కార్యక్రమాలతో వయోజన విద్య అమలైంది. కానీ ప్రణాళిక రూపకల్పన.. ఆచరణలో వైఫల్యం కారణంగా ఆశించిన ప్రగతి సాధించలేకపోయింది. ఏటా.. మహిళలతోపాటు పురుషులూ చదువుకు దూరమవుతూనే ఉన్నారు.

కనీసం చదవడం.. రాయడం రాని వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2009లో సాక్షరభారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో 2011లో ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 866 సాక్షర భారత్ కేంద్రాలుండగా... ఒక్కో కేంద్రానికి పురుష, మహిళా గ్రామ కో-ఆర్డినేటర్లు మొత్తం 1732 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో గ్రామ కో-ఆర్డినేటర్‌కు ప్రతి నెల రూ.2వేలు, మండల కో-ఆర్డినేటర్‌కు రూ.6వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు.
 
తెరుచుకోని కేంద్రాలు..
జిల్లాలో సాక్షర భారత్ కేంద్రాలు తెరుచుకోవడం లేదు. ఏడాది నుంచి గౌరవ వేతనం అందకపోవడంతో కేంద్రాల్లో చదువు చెప్పేందుకు గ్రామ, మండల కో-ఆర్డినేటర్లు ఆసక్తి చూపడం లేదు. గ్రామ కో-ఆర్డినేటర్లకు రూ.4.15 కోట్లకు పైగా వేతనాలు, మండల కో-ఆర్డినేటర్లకు రూ.37.44లక్షలు గౌరవ వేతనం రావాల్సి ఉంది. మరోపక్క.. కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడం.. గ్రామ పంచాయతీ భవనాల్లోనే ఎక్కువ కేంద్రాలు కొనసాగడంతో పంచాయతీ కార్యదర్శులు సహకరించిప్పుడే అవి తెరుచుకుంటున్నాయి. లేకపోతే తెరుచుకోని పరిస్థితి నెలకొంది. జిల్లాలో సాక్షర భారత్ కేంద్రాలు తెరుచుకోవడం లేదనే ఫిర్యాదులు ఇంత వరకు అందలేదని, గౌరవ వేతనాలు లేకపోయినా కో-ఆర్డినేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారని పథకం జిల్లా కో-ఆర్డినేటర్ సాగర్ వివరణ ఇచ్చారు.

ఇలా చేస్తే బాగు..

సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే.. వయోజన విద్యతోపాటు సర్వశిక్షా అభియాన్, డీఆర్‌డీఏ, డ్వామా శాఖలనూ భాగస్వామ్యుల్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కో శాఖకు కొన్ని మండలాలు కేటాయించి.. ఆయా మండలా పరిధిలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. లక్ష్యానికి తగ్గట్టు.. ప్రణాళిక రూపొందించి కార్యక్రమ నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులు నివేదికలు స్వీకరిస్తూ ఉండాలి.
 జిల్లాలో డీఆర్‌డీఏ, ఐకేపీలోని మహిళా గ్రూపుల ద్వారా వయోజనులకు విద్య అందించాలి. జిల్లా, మండల, గ్రామైక్య సంఘ సభ్యులనూ ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసి.. చదవడం, రాయడం రాని వారికి అక్షరజ్ఞానం నేర్పించాలి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకంలో పని చేసే కూలీల్లో సింహభాగం నిరక్షరాస్యులే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకునేందుకు వారు ముందుకురావడం లేదు. ఇందుకోసం.. పథక నిర్వహణ బాద్యత నిర్వర్తిస్తున్న డ్వామానూ భాగస్వామ్యం చే యాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల సహకారంతో కూలీలు పని చేసే చోటే.. వారికి కొంత సమయం కేటాయించి అక్షరాలు దిద్దించే ఏర్పాటు చేయాలి.
సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేజీబీవీలు, ఇతర విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి క్షేత్రస్థాయిలో పరిచయాలుండడంతో వారికీ వయోజన విద్య బాధ్యత అప్పగిస్తే బాగుంటుంది.
బోథ్ మండలంలో మొత్తం 38 సాక్షర భారత్ కేంద్రాలుండగా.. రెండేళ్ల నుంచి ఒక్క కేంద్రం కూడా తెరుచుకోవడం లేదు.
బె జ్జూరు మండలంలో 42 కేంద్రాలున్నాయి. నెల రోజుల నుంచి ఒక్క కేంద్రం కూడా తెరుచుకోవడం లేదు.
కోటపల్లి మండలంలో ఉన్న 42 సాక్షర భారత్ కేంద్రాల్లో 20కిపైగా తెరుచుకోవడం లేదు.
నెన్నెల మండలంలో మొత్తం 13 కేంద్రాలుండగా ప్రస్తుతం అవన్నీ మూతబడ్డాయి.
కడెం మండలంలో మొత్తం 24 వయోజన విద్యా కేంద్రాలున్నాయి. అందులో నాలుగైదు కేంద్రాలకు మించి తెరుచుకోవడం లేదు.
కౌటాల మండలంలో 21 సాక్షరభారత్ కేంద్రాలున్నాయి. ఆరు నెలల నుంచి మెటీరియల్ రాకపోవడంతో కేంద్రాలు నామ మాత్రంగా తెరిచి.. మూసేస్తున్నారు. ఒక్కకి కూడా అక్షరజ్ఞానం అందడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement